Women in Traditional Arts: చెండా మోగించి చరిత్రకెక్కారు
ABN, Publish Date - May 12 , 2025 | 05:31 AM
అశ్వతీ జితిన్, అర్చనా అనూప్ మొదటి మహిళలుగా త్రిసూర్ పూరమ్ ఉత్సవంలో చెండా వాయిద్యాన్ని వాయించటం ద్వారా చరిత్రలో స్థానం సంపాదించుకున్నారు. ఈ కఠినంగా ఉన్న వాయిద్యాన్ని వాయించడానికి 40 పైగా మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు.
‘‘సంప్రదాయాన్ని ధిక్కరించాలనుకోలేదు. దానిలో భాగం కావాలనుకున్నాం’’ అంటున్నారు అశ్వతీ జితిన్, అర్చనా అనూప్.ప్రతిష్ఠాత్మకమైన త్రిసూర్ పూరమ్ ఉత్సవాల ఊరేగింపులో చెండా వాద్యకారులైన తొలి మహిళలుగా వారు చరిత్రకెక్కారు. వందల ఏళ్ళుగా పురుషులకే పరిమితమైన ఈ అవకాశాన్ని అందుకున్న ఈ ఇద్దరు గృహిణుల బాటలో పయనించేందుకు మరెందరో మహిళలు సిద్ధమవుతున్నారు.
‘‘పూరమ్ వేడుకలకు సంబంధించి నా జ్ఞాపకాలు బాల్యం నాటివి. మా నాన్న నందకుమార్ ఒకప్పుడు పూరమ్ సమన్వయ కమిటీకి సెక్రటరీ. ఆయనతో కలిసి ఉత్సవాలకు వెళ్ళేదాన్ని. వివిధ వాయిద్యాల ధ్వనులు నన్ను ఎంతో ఆకర్షించేవి. జితిన్‌తో వివాహమయ్యాక ఆ ఇష్టం మరింత పెరిగింది. ఎందుకంటే జితిన్ చెండా వాద్యకారుడే కాదు, శిక్షకుడు కూడా. మా అబ్బాయిని కూడా అందులో నిష్ణాతుణ్ణి చేసేందుకు ఆయన ఎంతో శ్రమించారు’’ అంటారు 35 ఏళ్ళ అశ్వతి. తమ కుమారుడు అద్వైత్ అరంగేట్రానికి సిద్ధమవుతున్న సమయంలో... తను కూడా చెండా వాద్యాన్ని నేర్చుకోవాలనిపించింది. అందుకు జితిన్ అంగీకరించడమే కాదు... తగిన శిక్షణ కూడా ఇచ్చారు. చెండా వాయిద్యంపై పలికించడంలో ఆమె నైపుణ్యం సాధించారు. మరి అర్చనా అనూప్ ఆమెకు ఎలా జత అయ్యారు?
ఆయన ప్రోత్సాహంతో...
అర్చన 42 ఏళ్ళ నాట్యకళాకారిణి. ఆమె భర్త అనూప్ మోహన్ మర్చెంట్ నేవీలో కెప్టెన్. జితిన్ దగ్గర చెండా వాద్యాన్ని వారి కుమారుడు నేర్చుకొనేవాడు. తరగతులకు అతనికి తోడుగా వెళ్ళే అర్చనకు ఆ వాయిద్యం మీద ఆసక్తి పెరిగింది. ‘‘అప్పటికే జితిన్ దగ్గర అశ్వతి శిక్షణ పొందినట్టు నాకు తెలిసింది. నేనూ నేర్చుకోవచ్చా?’’ అని అడిగాను. ‘‘తప్పకుండా అంటూ ఆయన, అశ్వతి... నన్ను ప్రోత్సహించారు. అలా ఏడాదిన్నరపాటు శిక్షణ పొందాను’’ అని గుర్తు చేసుకున్నారు అర్చన. డోలును పోలి ఉండే చెండా... బరువుగా ఉండే వాయిద్యం. కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో చెండా మేళం పేరిట దేవాలయ ఉత్సవాల్లో, వేడుకల్లో ఈ వాయిద్యం ప్రధానంగా ఉంటుంది. దీనిలో శిక్షణ సాధారణంగా చిన్నప్పుడే ప్రారంభిస్తారు. కానీ అశ్వతి, అర్చన... మూడు పదుల వయసు దాటిన తరువాత అభ్యాసం ప్రారంభించడమే కాదు, నైపుణ్యాన్ని కూడా సాధించారు. పురుష కళాకారులకే పరిమితమైన త్రిసూర్ పూరమ్ వేడుకల్లో తమ ప్రతిభను ప్రదర్శించాలన్న ఆలోచన వారికి రావడానికి కారణం... హృదయ అనే అమ్మాయి.
జీవితం చరితార్థం...
‘‘వేణు వాదనలో ప్రతిభావంతురాలైన హృదయకు కిందటి ఏడాది పూరమ్ ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశాన్ని నిర్వహణ కమిటీ కల్పించింది. దాంతో మేము కూడా చెండాలో మా నైపుణ్యాన్ని అందరిముందూ ప్రదర్శించాలని అనుకున్నాం. మా ఆలోచనను జితిన్ ముందు ఉంచాం. అయితే 228 ఏళ్ళ చరిత్ర ఉన్న త్రిసూర్ పూరమ్ వేడుకల నిర్వహణలో కాని, ప్రదర్శనల్లో కాని మహిళల చాలా పరిమితం. ప్రధాన ఊరేగింపులో చెండా వాద్యకారులు ఇప్పటివరకూ కేవలం పురుషులే. ఇప్పుడు మహిళలకు అవకాశం ఇస్తే... ఉత్సవ నిర్వహణ కమిటీ అన్నివైపుల నుంచి విమర్శలు ఎదుర్కోవచ్చు. ఈ సందేహాలు ఉన్నప్పటికీ... కమిటీ ప్రతినిధులతో జితిన్ మాట్లాడారు. ఆలయ వర్గాలతో, అధికారులతో సంప్రతింపులు జరిపిన తరువాత... కమిటీ అంగీకరించింది. అది 36 గంటలసేపు సాగే వైభవోపేతమైన ఉత్సవం. శ్రీ వడక్కున్నాథన్ ఆలయానికి అనుబంధంగా ఉండే పది ఆలయాల నుంచి బ్రహ్మాండమైన ఊరేగింపులు జరుగుతాయి. ఈ ఏడాది మే అయిదు నుంచి ఏడు వరకూ నిర్వహించిన ఈ ఉత్సవాల్లో... కనిమంగళం శాస్తా ఆలయ దక్షిణ గోపురం దగ్గర రెండో రోజైన మంగళవారం జరిగిన ఊరేగింపులో భాగమైన ‘పండి మేళం’లో... చెండా వాయిద్యాలు పలికించాం. దీనితో మా జీవితం చరితార్థం అయిందని భావిస్తున్నాం’’ అని చెప్పారు అశ్వతి, అర్చన.
అప్పుడు ఇంకేదీ గుర్తుండదు...
‘‘ఈ ఉత్సవాలో ప్రధాన వాయిద్యమైన ‘చెండా’ బరువు దాదాపు 14 కిలోలు ఉంటుంది. దాన్ని భుజాలకు తగిలించుకున్నప్పుడు మొదట్లో కష్టంగా ఉంటుంది. భుజాలు బాగా నొప్పెడతాయి. అయితే క్రమంగా అలవాటుపడ్డాం. మా దృష్టంతా లయ మీద కేంద్రీకరించినప్పుడు ఇంకేదీ గుర్తుండదు. మేము ఉత్సవాల్లో ప్రదర్శన ఇస్తున్నామని తెలిసిన వారందరూ అభినందనలు తెలిపారు. ప్రోత్సహించేలా మాట్లాడారు. మాకు వచ్చిన ఈ అవకాశం గురించి తెలిశాక... ఎంతోమంది యువతులు, గృహిణులు చెండా నేర్చుకోడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పదిహేను మందికి పైగా జితిన్ దగ్గర శిక్షణ కోసం చేరారు’’ అని చెప్పారు అశ్వతి. మరోవైపు... త్రిసూర్ పూరమ్ పూర్తయిన తరువాత... త్రిప్రయార్ ఆలయంలో, వడక్కుమ్‌నాథన్ ఆలయంలో జరిగే విష్ణు పంచరి వేడుకల్లో మరికొందరు మహిళలతో కలిసి వారు ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు.
Updated Date - May 12 , 2025 | 05:32 AM