సమతా స్ఫూర్తి
ABN, Publish Date - May 02 , 2025 | 04:14 AM
‘‘జ్ఞానం అందరిదీ. అది రహస్యం కాకూడదు. దాన్ని పొందడానికి ఎలాంటి ఆంక్షలు, నిషేధాలు ఉండకూడదు’’ అని నినదించడమే కాదు, గురువు ఆదేశాన్ని ధిక్కరించి, లోకానికి అష్టాక్షరీ మంత్రాన్ని ఎలుగెత్తి ప్రకటించిన...
‘‘జ్ఞానం అందరిదీ. అది రహస్యం కాకూడదు. దాన్ని పొందడానికి ఎలాంటి ఆంక్షలు, నిషేధాలు ఉండకూడదు’’ అని నినదించడమే కాదు, గురువు ఆదేశాన్ని ధిక్కరించి, లోకానికి అష్టాక్షరీ మంత్రాన్ని ఎలుగెత్తి ప్రకటించిన ఆధ్యాత్మిక విప్లవకారుడు శ్రీమద్రామానుజాచార్యులు. అచంచలమైన భక్తితో ఆరాధిస్తే ఎవరైనా ఆ భగవంతుడి అనుగ్రహాన్ని అందుకోవచ్చని స్పష్టం చేసిన శ్రీరామానుజులు... శ్రీవైష్ణవ ధర్మాన్ని కుల, లింగ భేదాలకు అతీతంగా రూపుదిద్దారు. ‘‘సకల జగత్తుకు కారకుడు భగవంతుడైన ఆ శ్రీమన్నారాయణుడు. ఆయన పట్ల భక్తిప్రపత్తులను కలిగి ఉండాలి. అప్పుడే పూర్వ, ప్రస్తుత కర్మల వల్ల కలిగిన సుఖదుఃఖాల నుంచి విముక్తి పొందగలం. దీనికి వైష్ణవ ధర్మానుసరణ దోహదం చేస్తుంది’’ అని ప్రవచించిన శ్రీమద్రామానుజాచార్యులది విశ్వమానవ సిద్ధాంతం. సమతను, మానవతను చాటిచెప్పిన ఆయన వెయ్యేళ్ళ క్రితమే కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలను ప్రోత్సహించారు. అతి గోప్యమైన తిరుమంత్రాన్ని సామాన్య ప్రజానీకానికి వెల్లడి చేశారు. ఎన్నో గ్రంథాలు రచించి, శ్రీ భాష్యకారులుగా ప్రసిద్ధి చెందారు.
త్రిమతాచార్యుల్లో ముఖ్యుడైన శ్రీమద్రామానుజులు... కేశవాచార్యులు, కాంతిమతి దంపతులకు తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో జన్మించారు. చిన్న వయసులోనే జ్ఞానం కోసం అన్వేషించారు. తనకు తగిన గురువు తిరుగోష్టియూరులో ఉన్నారని తెలుసుకొని అక్కడికి చేరుకున్నారు. కానీ గురువు పదే పదే ఆయనకు పరీక్షలు పెట్టారు. కాలినడకన శ్రీరంగం నుంచి పద్ధెనిమిదిసార్లు తిరుగుతూనే ఉన్నారు. చివరకు గురువు ఆయనకు అష్టాక్షరీ మంత్రాన్ని బోధించి, దాని రహస్యాలను వెల్లడించారు. వేరే ప్రాంతం నుంచి వచ్చి... ఉపదేశం పొందిన శ్రీరామానుజుల గురించి ప్రజలకు తెలిసింది. ‘‘మాలాంటి వారి పరిస్థితి ఏమిటి? మాకు ముక్తి ఎలా లభిస్తుంది? అని వారు ఆయనను అడిగారు. ‘దేవుడికి మానవులందరూ సమానమైనప్పుడు, అందరూ ఆ దేవదేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు... తిరుమంత్రం రహస్యంగా ఎందుకు ఉండాలి?’ అనే అంతర్మథనానికి రామానుజులు గురయ్యారు. వెంటనే అక్కడ ఉన్న ఆలయ గోపురాన్ని ఎక్కి, ప్రజలందరినీ పిలిచి... ‘ఓం నమో నారాయణాయ’ అనే ఆ మంత్రాన్ని ప్రకటించారు. దీనివల్ల గురువు ఆగ్రహానికి గురైనా లెక్క చేయలేదు. ఆ తరువాత ఆయన ప్రముఖ వైష్ణవ ఆలయాలను సందర్శించారు. జీర్ణస్థితిలో ఉన్నవాటిని పునరుద్ధరించారు. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులకు భాష్యాలు రాశారు. వాటితోపాటు ఆయన రాసిన గద్యాలు, ఇతర వేదాంత రచనలు శ్రీరామానుజ నవరత్నాలుగా ప్రఖ్యాతి చెందాయి. నూట ఇరవయ్యేళ్ళ పాటు పరిపూర్ణంగా జీవించిన ఆయన కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ పర్యటించి, వైష్ణవ సంప్రదాయానికి, తన విశిష్టాద్వైత సిద్ధాంతానికి ప్రాచుర్యం కల్పించారు.
ఏం చెప్పారు?
‘‘ఆత్మ, పరమాత్మ వేరు వేరు. దేని స్వభావం దానిదే. కానీ ఆ రెండిటికీ విడదీయలేని సంబంధం ఉంది’’ అని శ్రీమద్రామానుజులు ప్రవచించారు. ఈ సిద్ధాంతమే విశిష్టాద్వైతంగా ప్రాచుర్యం పొందింది. ‘‘ప్రపంచం అనేది భ్రమ కాదు, ఆ పరమాత్ముడి సృష్టి. మోక్షాన్ని పొందడానికి భగవద్భక్తే ప్రధాన మార్గం. ఇది కేవలం ఉన్నతవర్గాలవారికో, పండితులకో పరిమితమైనది కాదు, కాకూడదు. అది అందరిదీ. విష్ణువుపై చిత్తాన్ని ఉంచి, నిర్మలమైన మనస్సుతో ఆరాధించేవారు ఎవరైనా వైష్ణవులే’’ననేది శ్రీరామానుజ ఉవాచ.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 02 , 2025 | 04:14 AM