టీనేజర్లు వీటికి దూరంగా ఉండాలి
ABN, Publish Date - Jun 09 , 2025 | 06:22 AM
యుక్తవయసు పిల్లలు పాటించే కొన్ని అలవాట్లే వారి శారీరక, మానసిక సమస్యలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. టీనేజర్ల ఆరోగ్యాన్ని పాడుచేసే...
యుక్తవయసు పిల్లలు పాటించే కొన్ని అలవాట్లే వారి శారీరక, మానసిక సమస్యలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. టీనేజర్ల ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లు ఏమిటో చూద్దాం...
చాలామంది టీనేజర్లు... మొబైల్ చూస్తూ గంటలు గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల ఒంటరితనం అలవాటై భావవ్యక్తీకరణ నైపుణ్యం దెబ్బతింటుంది. ఎక్కువ సమయం ఒకేచోట కూర్చుని లేదా పడుకుని ఉండడం వల్ల శారీరక శ్రమ లేక బరువు పెరగవచ్చు. మొబైల్‌ను తదేకంగా చూడడం వల్ల కళ్లు పొడిబారడం, ఎర్రబడడంతోపాటు దృష్టి సమస్యలు వస్తాయి.
యుక్తవయసు పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్‌ను ఇష్టపడుతూ ఉంటారు. ప్రాసెస్ చేసిన చిరుతిళ్లు తింటూ చక్కెరలు అధికంగా ఉన్న కూల్‌డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. దీనివల్ల జీర్ణాశయం పనితీరు మందగిస్తుంది. కడుపులో ఆమ్లత్వం పెరుగుతుంది. రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి.
రాత్రిపూట సామాజిక మాధ్యమాలతో గడుపుతూ ఆలస్యంగా నిద్రపోతూ ఉంటారు. దీనివల్ల వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. చురుకుదనం లోపిస్తుంది. మెదడు పనితీరు కుంటుపడుతుంది. యుక్తవయసు పిల్లలకు కనీసం ఎనిమిది గంటల నిద్ర అత్యవసరం.
కొంతమంది టీనేజర్లు తరచూ తమను తాము విమర్శించుకుంటూ ఉంటారు. రంగు, రూపురేఖల గురించి మధనపడుతూ ఉంటారు. దీనివల్ల వారిలో ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం తగ్గుతాయి. ఆందోళన, నిరాశ పెరుగుతాయి. ఈ విధమైన ధోరణి కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని అలవరచుకోవాలి.
ప్రతి పనినీ వాయిదా వేస్తూ ఉంటారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. ఎప్పటి పనిని అప్పుడే పూర్తిచేయడం, క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి.
ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చేయడానికి బద్దకిస్తూ ఉంటారు. దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతుంది. టీనేజర్లు రోజూ కనీసం అరగంటసేపు వ్యాయామం చేయడం మంచిది.
ఉదయం వేళల్లో అల్పాహారం తీసుకోవడానికి ఇష్టపడరు. దీనివల్ల జీవక్రియలు మందగించడం, పోషకాహార లోపం, రోగనిరోధక శక్తి తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి.
ఇవీ చదవండి:
దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 09 , 2025 | 09:03 AM