Planetary Influences: మూఢం ఎందుకు వస్తుంది
ABN, Publish Date - Jul 11 , 2025 | 05:08 AM
హిందువులు ఏ పనులు ప్రారంభించినా ముహుర్తాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. సాధారణంగా ముహూర్తాలు గ్రహాల బలం మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాలను తలపెట్టాలన్నా...
తెలుసుకుందాం
హిందువులు ఏ పనులు ప్రారంభించినా ముహుర్తాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. సాధారణంగా ముహూర్తాలు గ్రహాల బలం మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాలను తలపెట్టాలన్నా... గురు, శుక్ర గ్రహాల బలాల ఆధారంగా పండితులు ముహూర్తాలు నిర్ణయిస్తారు. ఈ రెండు గ్రహాలు తమ భ్రమణంలో బలహీనంగా మారినప్పుడు బలమైన ముహూర్తాలు ఉండవు. శుభకార్యాలు నిర్వహించడానికి బలమైన ముహుర్తాలు లేని రోజులను ‘మూఢం’ (మౌఢ్యమి) అంటారు. మరికాస్త వివరంగా చెప్పాలంటే... నవగ్రహాలలో అత్యంత శక్తిమంతమైన, స్వయం ప్రకాశకత్వం కలిగిన గ్రహం సూర్యుడు. అందుకే సూర్యగ్రహాన్ని గ్రహాలన్నిటికీ రాజు అంటారు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే... ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. గ్రహాల భ్రమణంలో గురుగ్రహం సూర్యునికి దగ్గరకు వస్తే ‘గురు మూఢం’ అని, శుక్ర గ్రహం దగ్గరికి వస్తే ‘శుక్ర మూఢం’ అని వ్యవహరిస్తారు. ఈ సమయంలో గురు, శుక్ర గ్రహాలు తమ బలాన్ని కోల్పోతాయి. ఈ ఏడాది జూన్ 10 నుంచి జూలై ఎనిమిది వరకూ సూర్యుడికి దగ్గరగా గురు గ్రహం ఉండడంతో ఆ కాలాన్ని ‘గురుమూఢం’గా పరిగణించడం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 30 నుంచి వచ్చేఏడాది ఫిబ్రవరి 13వ తేదీ వరకు సూర్యుడికి శుక్రుడు దగ్గరగా ఉంటాడు. ఆ కాలాన్ని ‘శుక్రమూఢం’ అంటారు.
చేయకూడనివి, చేయదగ్గవి...
ఈ రెండు సమయాల్లో వివాహాది శుభకార్యాలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం, పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త వాహనాల కొనుగోలు, శంకుస్థాపనలు, వ్రతాలు, విగ్రహ ప్రతిష్టలు, చెరువులు తవ్వడం లాంటి పనులు చేయకూడదని, దానివల్ల దుష్ఫలితాలు ఎదురవుతాయని పూర్వులు చెప్పారు. కాగా చిన్న పిల్లలకు అన్నప్రాశన, దూరప్రయాణాలు, ఇళ్ళకు చిన్న మరమ్మతులు, భూముల క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, విదేశీ యానాలు, కొత్త ఉద్యోగాల్లో చేరడం, నూతన వస్త్రాల కొనుగోలు, పుణ్యక్షేత్ర సందర్శన, దేవాలయాల్లో అన్నదానాలు, గృహాల్లో సీమంతాలు, ఇతర దైవ, పితృకార్యాలు, నవగ్రహ శాంతులు, హోమాలు తదితరాలు చేయవచ్చునని సూచించారు.
సి.ఎన్.మూర్తి,
8328143489
ఇవి కూడా చదవండి
ఇన్కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 11 , 2025 | 05:08 AM