ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మలబద్ధకం మతలబు

ABN, Publish Date - Jun 10 , 2025 | 06:07 AM

ప్రతి రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవడం ఆరోగ్యకరం. నిజమే! కానీ అందరికీ ఈ సూత్రం వర్తించదు. రెండు, మూడు రోజులకోసారి విరోచనమయ్యే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లకు చిన్నప్పటి నుంచి అలవడిన...

కాలకృత్యం

పొద్దున్నే పొట్ట ఖాళీ అయితే అదొక సంతృప్తి. కానీ కొన్నిసార్లు ఆ పని సజావుగా జరగక మలబద్ధకం వేధించవచ్చు. ఇలా అరుదుగా జరిగితే ఫరవాలేదు. వారాల తరబడి కొనసాగితే, పరిస్థితిని తీవ్రంగానే పరిగణించాలంటున్నారు వైద్యులు. మలబద్ధకం, మూల కారణాలు, పరిష్కారాలు, పరిణామాల గురించి ఇలా వివరిస్తున్నారు.

ప్రతి రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవడం ఆరోగ్యకరం. నిజమే! కానీ అందరికీ ఈ సూత్రం వర్తించదు. రెండు, మూడు రోజులకోసారి విరోచనమయ్యే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లకు చిన్నప్పటి నుంచి అలవడిన అలవాటు అది. కాబట్టి మలబద్ధకం ఉందో, లేదో ఎవరికి వారు తెలుసుకోవడం కోసం కొన్ని లక్షణాలను గమనించాలి. ముక్కవలసిన అవసరం లేకుండా, నిమిషాల వ్యవధిలోనే సుఖ విరోచనం సంతృప్తిగా జరిగిపోతే మలబద్ధకం లేనట్టే! ఇందుకు భిన్నంగా ప్రతిసారీ ముక్కవలసి వస్తున్నా, మలం పెంటికల్లా గట్టి ఉండలు కట్టినా, మలవిసర్జన తదనంతరం పొట్ట ఖాళీ కానట్టు అనిపిస్తున్నా మలబద్ధకంగానే భావించాలి. అయితే సరిపడా పీచు తినకపోవడం, నీళ్లు తాగకపోవడం వల్ల అప్పుడప్పుడూ తాత్కాలిక మలబద్ధకం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దీన్ని తీవ్రంగా పరిగణించవలసిన అవసరం లేదు. కానీ కొన్ని రెండు వారాలకు మించి మలబద్ధకం కొనసాగితే వెంటనే వైద్యులను కలవడం మంచిది.

కారణాలు అనేకం

మలబద్ధకానికి చాలా కారణాలున్నాయి. మన ఆహార, జీవనశైలులు కూడా మన మలవిసర్జనను ప్రభావితం చేస్తాయి. ఈ ఇబ్బందికి ఇంకొన్ని వైద్యపరమైన కారణాలు కూడా ఉంటాయి. అవేంటంటే....

  • హైపో థైరాయిడిజం

  • పారా థైరాయిడ్‌ గ్రంథులు అవసరానికి మించి పని చేయడం

  • శరీరంలో క్యాల్షియం మోతాదులు పెరగడం

  • మూత్రపిండాల సమస్యలు

  • పెద్ద పేగుల కదలికలు మందగించడం

  • గుండెపోటుకు గురవడం

  • పార్కిన్సన్స్‌ వ్యాధి బారిన పడడం

  • మంచానికే పరిమితమవడం

  • కటి కండరాల మధ్య సహకారం లోపించడం

  • గుండె జబ్బుల మందులు, నొప్పి నివారణ మందులు వాడుకోవడం మలబద్ధకం అంటే?

ప్రతి రోజూ మలవిసర్జన అలవాటు ఉన్న వాళ్లకు రోజుల తరబడి సుఖ విరోచనం జరగకపోయినా, రోజుకు పదిసార్లు వెళ్లినా విరోచనం అవకపోతున్నా, వెళ్లిన ప్రతిసారీ ముక్కవలసి వస్తున్నా, మలం పెంటికల్లా గట్టి పడినా మలబద్ధకంగానే భావించాలి. మూడు రోజులకు మలవిసర్జన చేసే అలవాటు ఉన్నవాళ్లు, ఆ సమయంలో విసర్జన కోసం కష్టపడవలసి వస్తున్నా, దాన్ని కూడా మలబద్ధకంగానే భావించాలి. అయితే ఆహారంలో పీచును పెంచి, నీళ్లు ఎక్కువగా తాగడం లాంటివి పాటిస్తే మలబద్ధకం తొలగిపోతుంది. ఈ జాగ్రత్తలు పాటించినా రెండు వారాలకు పైగా మలబద్ధకం వేధిస్తే వైద్యులను తప్పనిసరిగా సంప్రతించాలి. మరీ ముఖ్యంగా 45 ఏళ్లు దాటిన వాళ్లు వారి మలవిసర్జన క్రమం తప్పితే వెంటనే అప్రమత్తం కావాలి. అలాగే మలంలో రక్తం పడడం, అకారణంగా బరువు తగ్గడం, పొట్టలో నొప్పి లాంటివి పెద్దపేగు క్యాన్సర్‌ లక్షణాలు కాబట్టి, 45 ఏళ్లు దాటిన వాళ్లు మలబద్ధకంతో పాటు ఈ లక్షణాలు కూడా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.

నిర్లక్ష్యం చేస్తే...

మలబద్ధకంతో ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలుంటాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించేవాళ్లు ఎంతో అరుదు. ఈ ఇబ్బంది గురించి తమలో తాము ఆలోచించుకుంటూ కుంగిపోతూ ఉంటారే తప్ప సమస్యను తీవ్రంగా పరిగణించరు. నిజానికి మలబద్ధకం జీవన నాణ్యతను కూడా దెబ్బ తీస్తుంది. సుఖ విరోచనం జరగని సందర్భాల్లో, తెలియని అసౌకర్యంతో చికాకు, మానసిక కుంగుబాటులకు గురవుతూ ఉంటారు. రోజంతా దాని గురించే ఆలోచించడం, నిద్రకు దూరమవడం, పని సామర్థ్యం తగ్గడం, ఉత్పాదకత దెబ్బతినడం లాంటి సమస్యలు కూడా తోడవుతాయి. కాబట్టి మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే....

  • మొలలు వేధిస్తాయి

  • మలద్వారం దగ్గర చీలికలు ఏర్పడతాయి

  • పేగుల్లో కండరాలు బలహీనపడి, రంథ్రాలు ఏర్పడి ప్రాణాంతక పరిస్థితి తలెత్తవచ్చు

  • మలబద్ధకంతో పేగుల కదలికలు మందగించి, ఆ పరిస్థితి భవిష్యత్తుల్లో క్యాన్సర్‌కు దారితీయవచ్చు

పరిష్కారాలున్నాయి...

పీచు లేని ఆహారం తిన్నప్పుడు మలబద్ధకం తలెత్తవచ్చు. అయితే వెంటనే ఆహారంలో మార్పులు చేసుకుని విరోచన సమస్యను సరిదిద్దుకోవాలి. కానీ ఈ జాగ్రత్తలు పాటించినా రెండు వారాలకు మించి మలబద్ధకం వేధిస్తూ ఉంటే, వైద్యపరమైన కారణాలను విశ్లేషించుకోవాలి. వైద్యులను కలిసి హైపోథైరాయిడ్‌, మూత్రపిండాల సమస్యలు, క్యాల్షియం మోతాదులు తగ్గడం లాంటి మలబద్ధకం మూల కారణాలను పరీక్షించుకోవాలి. పరీక్షల ఫలితాలను బట్టి తగిన చికిత్సలతో ఆయా సమస్యలను సరిదిద్దుకుని, మలబద్ధకాన్ని తొలగించుకోవాలి.

నివారణ ఇలా...

  • ఆహారంలో పీచు ఉండేలా చూసుకోవాలి

  • రోజుకు 2నుంచి 3లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి

  • బీర, సొర, బెండ, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి

  • ప్రతి రోజూ తప్పనిసరిగా పండ్లు తినాలి

  • క్రమం తప్పక వ్యాయామం చేయాలి

  • ఆహారంలో మైదా తగ్గించాలి

  • పరిమితంగా కాఫీ తీసుకోవాలి

  • రెడ్‌ మీట్‌ పరిమితం చేయాలి

లాక్సేటివ్స్‌ వాడుకుంటే...

మలబద్ధకాన్ని నివారించుకోవడం కోసం కాయంచూర్‌ లాంటి ఆయుర్వేద మందుల మీద ఆధారపడేవాళ్లూ ఉంటారు. వీటిలో కూడా సహజసిద్ధ పీచు మాత్రమే ఉంటుంది. ఇవి హానికరమైనవి కాకపోయినా, వీటిని వాడుకోవలసిన అవసరం వస్తుంటే, ఆ అవసరం ఎందుకొస్తోంది? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మలబద్ధకాన్ని మందులతో సరిదిద్దుకోవడానికి బదులుగా మూల కారణాన్ని కనిపెట్టి, దాన్ని సరిదిద్దుకోవడం మీదే దృష్టి పెట్టాలి. కానీ కారణాన్ని తెలుసుకోకుండా గుడ్డిగా మందులు వాడుకుంటే మూల కారణం మరుగున పడి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది.

45 దాటిన వాళ్లకు ‘కొలనోస్కోపీ’

పెద్దపేగు క్యాన్సర్‌ ప్రధాన లక్షణం మలబద్ధకం. కాబట్టి 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కొలనోస్కోపీ పరీక్ష చేయించుకోవడం అవసరం. పెద్దపేగు క్యాన్సర్‌ చిన్న చిన్న పాలిప్స్‌ రూపంలో మొదలవుతుంది. కొలనోస్కోపీతో పెద్దపేగులను పరీక్షించి, ఈ పాలి్‌ప్సను తొలగించుకోగలిగితే క్యాన్సర్‌కు దారి తీయకుండా ఉంటుంది. మునుపు పెద్దపేగు క్యాన్సర్‌ ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉండేది. కానీ కొలనోస్కోపీ అందుబాటులోకి రావడంతో, ఈ పరీక్షతో ముందస్తుగానే పాలి్‌ప్సను గుర్తించి వాటిని తొలగించుకోవడంతో, ఈ క్యాన్సర్‌ తీవ్రత బాగా తగ్గిపోయింది. అన్ని రకాల క్యాన్సర్లలో మొదటి స్థానంలో ఉన్న పెద్ద పేగు క్యాన్సరు నేడు ఎనిమిదో స్థానానికి పరిమితం అయిపోయింది. కాబట్టి 45 దాటిన ప్రతి ఒక్కరూ ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుని, పాలిప్స్‌ లాంటివి లేకపోతే ఆ తర్వాత ఐదేళ్లకోసారి పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మొదటి పరీక్షలోనే పాలిప్స్‌ లాంటివి కనిపిస్తే, వాటి సంఖ్య ఆధారంగా, వైద్యుల సూచన మేరకు ప్రతి ఏడాదీ లేదా మూడేళ్లకోసారి కొలనోస్కోపీ చేయించుకుంటూ ఉండాలి. పైగా కొలనోస్కోపీ ఎంతో సరళమైన, సురక్షితమైన పరీక్ష. పది నిమిషాల్లో పూర్తయిపోయే ఈ పరీక్షతో ఎలాంటి నొప్పి, అసౌకర్యం కలగదు.

డాక్టర్‌ నవీన్‌ పోలవరపు

సీనియర్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌,

లివర్‌ స్పెషలిస్ట్‌,

అడ్వాన్స్‌డ్‌ థెరప్యూటిక్‌ ఎండోస్కోపిస్ట్‌ అండ్‌ ఎండోసోనాలజిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌, హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌.


ఇవి కూడా చదవండి

ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్ షాక్

పోలీసుల అదుపులో కొమ్మినేని శ్రీనివాస్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2025 | 06:09 AM