Migraine Headache: పార్శ్వ నొప్పి పని పడదాం
ABN, Publish Date - May 20 , 2025 | 04:37 AM
పార్శ్వ నొప్పిగా పేరొందిన మైగ్రేన్ చిన్న సమస్యగా కనిపించినా, దీని తీవ్రత రోజులు పాటు వేధించగలదు. అదిని ముందుగానే గుర్తించి, ప్రేరకాలకు దూరంగా ఉండటం, సరైన మందులు వాడటం వల్ల ఈ నొప్పిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
పార్శ్వ నొప్పిని భరించడం కష్టమే! అయితే తెలివిగా వ్యవహరించగలిగితే దీని మీద పైచేయి సాధించడం అంత కష్టమేమీ కాదనీ, ప్రేరకాలను కనిపెట్టి, ముందస్తు మందులతో దీనికి అడ్డుకట్ట వేయడం సులభమేనని వైద్యులు అంటున్నారు. పార్శ్వ నొప్పి పని ఎలా పట్టాలో ఇలా వివరిస్తున్నారు.
ఈ నొప్పికి వయసుతో పని లేదు. పిల్లల్లో, పెద్దల్లో, వృద్ధుల్లో ఎవరినైనా ఈ నొప్పి వేధించవచ్చు. అయితే ముఖ్యంగా 20 నుంచి 40 ఏళ్ల వయస్కుల్లో ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సాధారణ తల నొప్పికీ పార్శ్వపు నొప్పికీ స్పష్టమైన తేడాలుంటాయి. సాధారణ తలనొప్పులు కొన్ని నిమిషాల పాటు ఇబ్బంది పెడితే, మైగ్రేన్ నొప్పి గంటలు, రోజుల తరబడి వేధిస్తుంది. అలాగే కొన్ని లక్షణాలతో ఈ నొప్పిని తేలికగా కనిపెట్టవచ్చు.
అవేంటంటే....
కంటి వెనక నొప్పి మొదలవుతుంది
తలకు ఎడమ వైపు, కుడి వైపు ఇలా తలలో ఒక వైపున నొప్పి మొదలవుతుంది
ఈ ప్రదేశాలు కూడా వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటాయి
తల మీద కొట్టినట్టు, తల పగిలిపోతున్నట్టు నొప్పి ఉంటుంది
కళ్లు బైర్లు కమ్మడం
నీరసం, చీకాకు
శబ్దాలను, వెలుతురునూ భరించలేకపోవడం
వాంతి వస్తున్న భావన కలగడం
వాంతితో పాటు తలనొప్పి తగ్గడం
వ్యాధినిర్థారణ సులువే!
ఈ నొప్పికి కొన్ని అంశాలు దోహదపడుతూ ఉంటాయి. నిద్ర లేమి, వేడుకల్లో అధిక వెలుగులకూ, శబ్దాలకూ బహిర్గతం కావడం, సినిమాకు, పబ్‌లకూ వెళ్లి రావడం, విపరీతమైన ఒత్తిడికి లోనవడం, మద్యం తీసుకోవడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం.. వీటి తదనంతరం తల నొప్పి మొదలైతే దాన్ని మైగ్రేన్ నొప్పిగా, మైగ్రేన్ ప్రేరేపిత అంశాలుగా పరిగణించాలి. ఈ నొప్పి ప్రారంభంలో నెలలో ఒకసారికి పరిమితమైతే, క్రమేపీ నెలలో ఐదారుసార్లకు పెరిగిపోతుంది.
ఈ నొప్పి తీవ్రత కూడా కాలక్రమేణా పెరిగిపోతూ, రోజంతా పడకకే పరిమితమయ్యే పరిస్థితికి దారి తీస్తుంది. కాబట్టి మైగ్రేన్ నొప్పిని వీలైనంత త్వరగా నిర్థారించుకుని, వెంటనే చికిత్స మొదలుపెట్టుకోవాలి. ఎమ్మారై, స్కాన్‌లో తలలో ఎటువంటి సమస్య లేదని తేలినప్పుడు, ఒక ప్రశ్నావళి ఆధారంగా ఈ సమస్యను మైగ్రేన్‌గా వైద్యులు నిర్థారిస్తారు. సమస్య తీవ్రత పెంచే కారకాలు, ప్రేరకాలు, లక్షణాల ఆధారంగా ఈ సమస్యను కచ్చితంగా నిర్థారించుకోవచ్చు.
వీటికి దూరం
సరైన నిద్రవేళలు పాటించడం
ఆహార సమయాలు పాటించడం
ఒత్తిడికి దూరంగా ఉండడం
డిజెలు, బిగ్గర శబ్దాలకు దూరంగా ఉండడం
వ్యాయామం చేయడం
వెలుగులకు బహిర్గతం అవకపోవడం
నొప్పిని ప్రేరేపించే పదార్థాలను మానేయడం
మద్యపానం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడం
చికిత్స ఇలా...
మైగ్రేన్ నొప్పి ప్రేరకాలకు దూరంగా ఉండడం ద్వారా ఈ సమస్యను నిలువరించుకోవచ్చు. ఏఏ అంశాలు ఈ నొప్పిని ప్రేరేపిస్తున్నాయో ఎవరికి వారు కనిపెట్టి వాటికి దూరంగా ఉండడం ముఖ్యం. అప్పటికీ నొప్పి వేధిస్తుంటే మందులతో నొప్పిని అదుపు చేసుకోవచ్చు. మైగ్రేన్ నొప్పిని ప్రారంభంలోనే గుర్తించడం, గుర్తించిన వెంటనే మందులు వేసుకుని నొప్పిని అదుపులో ఉంచుకోవడం అవసరం. సమస్యను త్వరగా నిర్థారించుకోవడంతో పాటు నివారణ చర్యలు, చికిత్సలను ఎంత త్వరగా అనుసరించగలిగితే ఈ సమస్య అంత మెరుగ్గా అదుపులో ఉంటుంది. వైద్యులు సూచించిన మాత్రలను నొప్పి మొదలైన మొదటి గంటలోపే వాడుకుంటే, నొప్పి తీవ్రమవకుండా ఉంటుంది. నొప్పి తీవ్రమైన తర్వాత మందులు వాడుకుంటే, ఆ మందులతో నొప్పి అదుపులోకి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే వేర్వేరు ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్యులు సూచించే మైగ్రేన్ మాత్రలు కూడా వేర్వేరుగా ఉంటాయి. అన్ని మాత్రల్లాగే వీటికి కూడా జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం, నెలసరి సమస్యలు లాంటి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అయితే ఈ తలనొప్పి శాశ్వత సమస్య కాదు. వైద్యుల సూచనల మేరకు కారకాలకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా మందులు వాడుకోగలిగితే, క్రమేపీ మందులతో పని లేకుండానే ఈ నొప్పి అదుపులోకొస్తుంది.
కాలక్రమేణా మైగ్రేన్ తలనొప్పులు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అసహనం. అన్నీ క్షణాల్లో జరిగిపోవాలనే తొందర అందర్లో ఉంటోంది. అనుకున్నదే తడవుగా చేతికి అందాలనే స్వభావం మెదడు ఒత్తిడికి దారి తీసి, అదనపు హార్మోన్లు విడుదలై అంతిమంగా మైగ్రేన్ లాంటి సమస్యలను తెచ్చిపెడుతోంది. కాబట్టి శాంత స్వభావాన్ని అలవరుచుకోవడం కూడా కీలకమే! మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ, వాస్తవ దృష్టితో నడుచుకుంటూ, పార్శ్వ నొప్పిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉండగలిగితే, ఈ సమస్య నుంచి తేలికగా బయటపడవచ్చు.
తలలోని ట్రైజెమైనల్ నాడి, న్యూరోట్రాన్స్‌మీటర్లలో హెచ్చుతగ్గులు మైగ్రేన్‌కు కారణం. సెరోటినిన్ అనే న్యూరోట్రాన్స్‌మీటర్ మోతాదు తగ్గితే, శరీరం న్యూరోపెప్టైడ్స్‌ను విడుదల చేస్తుంది. దాంతో తల్లోని రక్తనాళాలు విప్పారి, ఎక్కువ రక్తం మెదడులోకి చేరుకుంటుంది. దాంతో తలభారం మొదలవుతుంది. స్థూలంగా మైగ్రెయిన్ నొప్పికి కారణమిదే!
మందులతో అదుపులోకి రాని మైగ్రేన్ కోసం నేడు బొటాక్స్ ఇంజెక్షన్లు అందుబాటులోకొచ్చాయి. తలలో నొప్పి వేధించే ప్రదేశంలో కండరాలకు ఈ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనాన్ని అందించవచ్చు.
నొప్పి నాలుగు దశల్లో...
24 నుంచి 72 గంటల పాటు వేధించే పార్శ్వపు నొప్పి నాలుగు దశల్లో సాగుతుంది. అవేంటంటే...
ప్రొడోమ్: నొప్పికి రెండు గంటల నుంచి రెండు రోజుల ముందు వరకూ చోటుచేసుకునే అంశాల సమూహమిది. ఈ సమయంలో చీకాకు, ఒత్తిడి, ఆందోళన, వెలుతురు భరించలేకపోవడం, మెడనొప్పి లాంటి లక్షణాలుంటాయి.
ఆరా: నొప్పి మొదలయ్యే కొన్ని నిమిషాల ముందుండే దశ ఇది. చూపు మందగించడం, కళ్లకు ఎగుడుదిగుడు లైన్లు కనిపించడం, తలలో సూదులు గుచ్చినట్టు ఉండడం, మాటలు తడబడడం, నీరసం లాంటి లక్షణాలుంటాయి.
ఎటాక్: ఈ దశ రెండు నుంచి మూడు రోజుల వరకూ ఉండవచ్చు. ఈ దశలో వాంతులు వేధిస్తాయి.
పోస్ట్‌డ్రోమ్: ఈ చివరి దశలో నొప్పి తగ్గిపోయినా, తల భారం కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది.
డాక్టర్ వేణుగోపాల్ గోక
సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్
అండ్ స్పైన్ సర్జన్,
మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 20 , 2025 | 05:58 AM