Hand Block Printing: అజ్రఖ్ లెహంగాలతో అద్భుతంగా
ABN, Publish Date - Jul 13 , 2025 | 03:59 AM
ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన అజ్రఖ్ ప్రింటింగ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. వివాహాది శుభకార్యాల్లో, పార్టీల్లో అజ్రఖ్ లెహంగాలు, చీరలు, కుర్తీలు కనువిందు చేస్తున్నాయి. ఈ తరహాలో...
సంప్రదాయం
ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన అజ్రఖ్ ప్రింటింగ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. వివాహాది శుభకార్యాల్లో, పార్టీల్లో అజ్రఖ్ లెహంగాలు, చీరలు, కుర్తీలు కనువిందు చేస్తున్నాయి. ఈ తరహాలో డిజైన్ చేసిన టాప్‌లను మహిళలు రోజువారీగా ధరించడానికి బాగా ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్న ఈ అజ్రఖ్ ప్రింటింగ్ గురించి తెలుసుకుందాం...
అజ్రఖ్ అంటే...
అజ్రఖ్ అనేది ఓ సంప్రదాయ హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ పద్ధతి. సహజమైన రంగులను ఉపయోగిస్తూ చెక్క దిమ్మలతో వస్త్రాల మీద డిజైన్లు ముద్రించే విధానం. ఇది చాలా పురాతనమైన కళ. ఇది గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వం ఖత్రీ జాతులవారు ఈ తరహా వస్త్రాలను రూపొందించేవారు. ముందుగా చెక్క దిమ్మల మీద వివిధ నమూనాలు, సౌష్టవంగా ఉండే ఆకారాలు చెక్కుతారు. ఈ దిమ్మలను సహజసిద్ధమైన రంగుల్లో ముంచి... వాటిని వస్త్రాలమీద అద్ది డిజైన్లు రూపొందిస్తారు. ఇలా ఎన్నో రకాల నమూనాలు, ముద్రలు ఉంటాయి. ప్రతిదీ దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. ప్రకృతిలో లభ్యమయ్యే సహజసిద్ధమైన రంగులను మాత్రమే అద్దకానికి ఉపయోగిస్తారు. చెట్ల ఆకులు, కాండం, బెరడు, పూల నుంచి, అలాగే మట్టి నుంచి రంగులు తయారుచేసుకుంటారు. నీలం, ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ ప్రక్రియ కోసం కాటన్, పట్టు వస్త్రాలను మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకంటే ఇవి రంగులను బాగా పట్టుకుంటాయి. డిజైన్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. క్రమంగా ఈ అద్దకం ప్రక్రియ కొత్త సొబగులను అందిపుచ్చుకొని సరికొత్త రూపాలను సంతరించుకుంది. ఇప్పుడు దేశవిదేశాల్లోని మహిళలను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం చేతితో రూపొందించిన వస్త్ర రూపాలకు అమితమైన డిమాండ్ ఉంటోంది. ఈ కోవలోనే అజ్రఖ్ వస్త్రాలకు కూడా ఆదరణ బాగా పెరుగుతోంది.
ట్రెండింగ్‌లో ఇలా...
సంప్రదాయ కళను ఆధునిక ఫ్యాషన్‌తో మేళవించిన ఓ వినూత్న తరహా అజ్రఖ్‌లు వాడుకలోకి వచ్చేశాయి. విభిన్న శైలితో ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. అజ్రఖ్ ప్రింటింగ్‌తో కూడిన శాలువాలు, చున్నీలు, పరికిణీలు, ఓణీలు... ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అజ్రఖ్ లెహంగాలు యువతులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అందంతోపాటు హుందాతనాన్ని, నవ్యత్వాన్ని ప్రతిబింబించడంతో వీటికే ఓటు వేస్తున్నారు అమ్మాయిలు. అందంగా మెరిసే బ్లాక్ ప్రింటింగ్... సంప్రదాయ వస్త్రాల్లో కొత్త పోకడలను సృష్టిస్తోంది.
పార్టీవేర్‌గా...
కొత్త, పాతల కలయికతో రాజసంగా కనిపించాలనుకునే అమ్మాయిలకు ఈ అజ్రఖ్ లెహంగాలు మంచి ఎంపిక. గ్రాండ్‌గా కనిపించేలా, సౌకర్యవంతంగా ఉండేలా వీటిని రూపొందిస్తున్నారు. అందమైన ప్రింటింగ్ మధ్య జరీ దారాలతో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నారు. అలాగే జర్దోసి వర్క్, కుందన్ వర్క్‌లను కూడా జోడించి మరింత ఆకర్షణీయంగా అందుబాటులోకి తెస్తున్నారు. అంతే అందంగా బ్లౌజ్, ఓణీలను కూడా రూపొందిస్తున్నారు. ఈ అజ్రఖ్ లెహంగాలు ధరించినప్పుడు చక్కగా నగలు అలంకరించుకోవచ్చు. వీటిపై బ్లాక్ మెటల్‌తో తయారు చేసిన ఆభరణాలు, బంగారు నగలు, పెద్ద ముత్యాల హారాలు బాగా నప్పుతాయి.
ఖ్యాతి,
ఖ్యాతి డిజైనర్ స్టూడియో హైదరాబాద్, 6300386749
ఇవి కూడా చదవండి..
పేర్నినాని అక్కడికి వెళ్లు.. నీ రప్పా..రప్పా సంగతి వాళ్లే చూస్తారు: బోడె ప్రసాద్
అర్చక నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆనం
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 13 , 2025 | 03:59 AM