Ironman World Championship: ఉక్కు మహిళ
ABN, Publish Date - Jul 10 , 2025 | 02:39 AM
‘‘ఐరన్‌మ్యాన్ వరల్డ్ చాంపియన్‌షి్‌ప’నకు అర్హత సాధించిన తొలి భారత మహిళగా గుర్తింపు పొందడం సంతోషంగా అనిపిస్తోంది. నాకు క్రీడలంటే ఇష్టం. వ్యాపార రంగంపై ఆసక్తి. ఇప్పుడు ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ భవిష్యత్‌ను...
విభిన్నం
క్రీడలంటే ఇష్టం. వ్యాపార రంగంపై ఆసక్తి. రెండిటిలోనూ రాణించాలనేది ఆమె ఆకాంక్ష. జాతీయ స్థాయి స్విమ్మర్‌గా క్రీడల్లో రాణిస్తూనే.. ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ వెళ్లింది. అక్కడ చదువుకొంటూనే ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్ కోసం సన్నద్ధమయింది. ఇప్పుడు మాస్టర్స్ పూర్తి చేయడంతో పాటు.. అక్టోబరులో జరిగే ప్రపంచ ఐరన్‌మ్యాన్ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందింది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన బొమ్మినేని సంజనారెడ్డిని ‘నవ్య’ పలుకరించింది.
‘‘ఐరన్‌మ్యాన్ వరల్డ్ చాంపియన్‌షి్‌ప’నకు అర్హత సాధించిన తొలి భారత మహిళగా గుర్తింపు పొందడం సంతోషంగా అనిపిస్తోంది. నాకు క్రీడలంటే ఇష్టం. వ్యాపార రంగంపై ఆసక్తి. ఇప్పుడు ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నా. నేను పుట్టి.. పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న వెంకట్‌రెడ్డి ఇంజినీర్. ప్రస్తుతం ఒక ఇన్‌ఫ్రా కంపెనీ నడుపుతున్నారు. అమ్మ స్వప్న అందులో డైరెక్టర్. నేను ఇంటర్మీడియేట్ వరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నా. 2020లో గ్రాడ్యుయేషన్ కోసం లండన్ వెళ్లా. ‘యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్’లో బీఎస్సీ ఎకనామిక్స్, తాజాగా ఎమ్మెస్సీ అర్బన్ ఎకనామిక్ డెవల్‌పమెంట్‌లో మాస్టర్స్ పూర్తి చేశా. నా చదువు, విదేశాల్లో నేను గడించిన అనుభవం స్వదేశానికి ఉపయోగపడాలనే లక్ష్యంతో తిరిగి భారత్‌కు వచ్చేశా.
ప్రొఫెషనల్ స్విమ్మర్‌గా..
సైక్లింగ్, స్విమ్మింగ్, స్కేటింగ్, తైక్వాండో, భరతనాట్యం ఇలా నేను ఏది నేర్చుకుంటానని అడిగినా ఇంట్లో అడ్డు చెప్పేవారు కాదు. ప్రతి శిక్షణకూ అమ్మ నన్ను వెంటబెట్టుకుని తీసుకెళ్లేది. నా ఇష్టాన్ని తెలుసుకొని ప్రోత్సహించేది. ఇవన్నీ ప్రయత్నించాక నాకు స్విమ్మింగ్‌పై మక్కువ కలిగింది. గచ్చిబౌలి స్టేడియంలో ప్రొఫెషనల్ స్విమ్మింగ్ నేర్చుకోవడం ప్రారంభించా. ఫ్రీస్టయిల్ 800, 1500 మీటర్ల ఈవెంట్లలో 2018, 2019ల్లో రాష్ట్ర చాంపియన్‌గా నిలిచా. జాతీయ పోటీల్లో పాల్గొన్నాను కానీ పతకాలు గెలవలేకపోయా. ఆ దశలో క్రీడలు, చదువు రెండింట్లో ఏది ఎంచుకోవాలనే ప్రశ్న ఉదయించినప్పుడు నా ముందు ఉన్న రెండు దారుల గురించి ఒకసారి ఆలోచించా. క్రీడాకారుల కెరీర్ ఎనిమిది నుంచి పదేళ్లే. ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ ఆ తర్వాత ఏంటి? అంత దూరం వెళ్లడానికి అప్పట్లో క్రీడా రంగానికి ప్రభుత్వాల సహకారం పెద్దగా ఉండేది కాదు. మన దగ్గర క్రీడా మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. ఇక చదువు... వ్యాపార రంగంపై ఆసక్తి ఉండడంతో దానికి సంబంధించిన కోర్సులు చేస్తే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని భావించాను. మన దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త ఆలోచనలతో స్టార్టప్స్ ప్రారంభిస్తే వ్యాపార రంగంలో రాణించవచ్చు అనిపించి ఉన్నత చదువులు కోసం యూకే వెళ్లా.
అలా మొదలైంది...
నేను పదో తరగతి చదువుతున్నప్పుడు యూట్యూబ్‌లో ఐరన్‌మ్యాన్ చాంపియన్‌షి్‌ప గురించి తొలిసారి తెలుసుకున్నా. తర్వాత దాని గురించి ఇంటర్నెట్‌లో శోధించా. కానీ ఐరన్‌మ్యాన్‌లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ, సదుపాయాలు మన దగ్గర అందుబాటులో లేవని తెలిసి అప్పటికి ఆ ఆలోచనను పక్కన పెట్టా. అయితే లండన్ వెళ్లాక అక్కడున్న క్రీడా మౌలిక సదుపాయాలు చూశాక నాలోని క్రీడాకారిణి మేల్కొంది. ఐరన్‌మ్యాన్‌కు సన్నద్ధమైతే బాగుంటుందని అనిపించింది. అలా 2023లో సాధన మొదలుపెట్టా. చదువును నిర్లక్ష్యం చేయలేదు. తరగతులకూ హాజరవుతూనే ఉదయం మూడు గంటలు, రాత్రి మూడు గంటలు సాధన చేసేదాన్ని. అండర్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ రెండూ డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించా. మరోవైపు ఐరన్‌మ్యాన్ వరల్డ్ చాంపియన్‌షి్‌పలో పాల్గొనేందుకు బ్రిటన్ కోచ్ థామస్ హంట్ దగ్గర శిక్షణ ప్రారంభించా.
ఇష్టపడి చేస్తే...
ఒకరి బలవంతం లేకుండా మనకు నచ్చి చేస్తే ఏ పనీ కష్టంగా అనిపించదు. యూనివర్సిటీకి ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండానే సాధన చేసేదాన్ని. ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్ చాంపియన్‌షి్‌పలో మూడు ఈవెంట్లు ఉంటాయి. స్విమ్మింగ్, సైక్లింగ్, మారథాన్. ఇవన్నీ ఒక్క రోజులోనే పూర్తి చేయాలి. నేను స్వతహాగా స్విమ్మర్‌ను కావడంతో చిన్నప్పటి నుంచీ రోజూ లేవగానే వ్యాయామాలు చేసే అలవాటు ఉండడంతో నాకు ఈ పోటీలో పాల్గొనడం కాస్త సులువు అయింది.
వెనక్కి తగ్గలేదు...
ఆస్ట్రేలియాలో గత నెల 15న జరిగిన ‘ఐరన్‌మ్యాన్’ అర్హత పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచాను. తద్వారా వచ్చే అక్టోబరులో హవాయిలో జరిగే వరల్డ్ చాంపియన్‌షి్‌పకు అర్హత సాధించా. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ అర్హత పోటీల్లో సముద్రంలో ఈదాల్సి వచ్చింది. ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్‌లో సాధన చేసి.. ఒక్కసారిగా సముద్రపు ఉప్పు నీటిలో ఈత కొట్టడం కష్టంగా అనిపించింది. దీనికి తోడు నాకు కంటి చూపు సమస్య ఉండడంతో ‘ఐ లెన్స్’ వాడతాను. కాంటాక్ట్ లెన్స్ నీళ్లలో పెట్టుకోకూడదు. అలాగని అవి లేకపోతే నాకు సరిగ్గా కనిపించదు. అందుకే లెన్స్ తడవకుండా స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకున్నా. కొంచెం దూరం ఈదిన తర్వాత గాగుల్స్ నుంచి కళ్లలోకి ఉప్పు నీరు వెళ్లిపోయాయి. కానీ వెనక్కి తగ్గలేదు. గంట 47 నిమిషాల్లో 3.8 కిలోమీటర్లు ఈదాను.
చూడలేకపోయా...
నీళ్లల్లో నుంచి బయటికి వచ్చాక కుడి కన్నుతో అసలు చూడలేకపోయా. రెండు కళ్లల్లో నుంచి అదే పనిగా నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇక్కడితో ఆపేద్దామా? అని మధ్యలో అనుకున్నాను. కానీ మధ్యలో వదిలేస్తే రెండేళ్ల శిక్షణ వృథా అవుతుందని.. నాకు నేను ధైర్యం చెప్పుకొని ముందడుగు వేశా. మూడు ఈవెంట్ల మధ్య ఉండే స్వల్ప విరామంలో ఏదో ఒకటి తినకపోతే శరీరంలో శక్తి ఉండదు. అయితే, ఈదుతున్నప్పుడు నోట్లికి ఉప్పు నీళ్లు వెళ్లిపోవడంతో సైక్లింగ్ చేస్తున్నంత సేపూ వాంతులు అవుతూనే ఉన్నాయి. దీంతో ఏమీ తినకుండానే మిగిలిన రెండు ఈవెంట్లు పూర్తి చేశా. స్విమ్మింగ్ తర్వాత జరిగిన 180 కిలోమీటర్ల సైక్లింగ్ ఈవెంట్‌ను 7.42 గంటల్లో, చివరగా 42.2 కిలోమీటర్ల మారథాన్‌ను 5.52 గంటల్లో ముగించా. మూడు ఈవెంట్లను కలిపి 15 గంటల 45 నిమిషాల 49 సెకన్లలో విజయవంతంగా పూర్తి చేశాను.
అడుగులు అటువైపు...
ఇక ఐరన్‌మ్యాన్ వరల్డ్ చాంపియన్‌షి్‌ప అవ్వగానే వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనేది నా లక్ష్యం. టోక్యో ఒలింపిక్స్ తర్వాత జపాన్‌లో, ఫిఫా సాకర్ వరల్డ్‌కప్ తర్వాత ఖతార్‌లో విదేశీ పెట్టుబడులు బాగా పెరిగాయి. మన దేశంలో ఒలింపిక్స్ జరిగితే క్రీడా వ్యాపార రంగానికి ప్రాముఖ్యత పెరుగుతుంది. కనుక ఆ దిశగా క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, క్రీడా ఆర్థిక విధానాల రంగంలో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నా.’’
ఎస్.ఎస్.బి.సంజయ్
ఐరన్‌మ్యాన్ వరల్డ్ చాంపియన్‌షిప్...
ఐరన్‌మ్యాన్ ట్రయథ్లాన్ కాన్సెస్ట్ 1970వ దశకంలో పుట్టింది. 1974 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తుండగా, 1978 నుంచి ఐరన్‌మ్యాన్ వరల్డ్ చాంపియన్‌షి్‌పను అధికారికంగా ప్రారంభించారు. 3.8 కిలోమీటర్ల స్విమ్మింగ్, 180 కి.మి సైక్లింగ్, మరథాన్ (42.2 కి.మి)ను కలిపి 18 గంటల్లో పూర్తి చేయాలి.
ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి...
మా స్కూల్‌లో నాలుగో తరగతి వరకు అబ్బాయిలతో అమ్మాయిలు అన్ని క్రీడల్లో పోటీపడేవారు. పై తరగతులకు వెళ్లేకొద్దీ నా స్నేహితులు చాలామందిని వాళ్ల తల్లిదండ్రులు ‘ఆటలెందుకు. బాగా చదువుకో’ అని కట్టడి చేసేవారు. కొందరినేమో ఆటలా.. చదువా? ఏదో ఒకటి తేల్చుకో’ అనేవారు. దీనివల్ల చాలామంది అమ్మాయిలు తప్పనిసరి పరిస్థితుల్లో చదువునే కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి మారాలి. ఆడపిల్లల ఆశయాలకు కుటుంబం అండగా ఉండాలి.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 10 , 2025 | 11:24 AM