పతితపావనుడు శ్రీ జగన్నాథుడు
ABN, Publish Date - Jun 27 , 2025 | 01:00 AM
జగన్నాథుడి రథోత్సవం జనన మరణ చక్రానికి అడ్డుకట్టవేసి, మోక్షమార్గాన్ని సులభంగా అనుగ్రహించగలదని పురాణాలు చెబుతున్నాయి....
విశేషం
నేడు శ్రీజగన్నాథ రథయాత్ర
జగన్నాథుడి రథయాత్ర... భక్తులు అంగరంగంగా జరుపుకొనే ఒక మహోత్సవం. సాక్షాత్తూ శ్రీకృష్ణుడి ప్రతిరూపమైన శ్రీజగన్నాథస్వామి... బలభద్ర, సుభద్రలతో కలిసి... భక్తులను అనుగ్రహించడానికి ఆలయం నుంచి బయటకు వచ్చే దివ్యమైన సందర్భం అది.
జగన్నాథుడి రథోత్సవం జనన మరణ చక్రానికి అడ్డుకట్టవేసి, మోక్షమార్గాన్ని సులభంగా అనుగ్రహించగలదని పురాణాలు చెబుతున్నాయి.
ఒడిశాలోని పూరీలో ఉన్న, అత్యంత పురాతనమైన శ్రీ జగన్నాథుడి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే కన్నుల పండుగ... జగన్నాథ రథయాత్ర. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమవుతుంది. భగవంతుణ్ణి ఆలయంలో దర్శించుకోలేని భక్తులకు... ఆ జగన్నాథుడే స్వయంగా రథంపై వచ్చి దర్శన భాగ్యం కల్పిస్తాడు. అందుకే ఆయనను ‘పతిత పావనుడు’ అంటారు. ‘రథస్థం కేశవం దృష్ట్వా.. పునర్జన్మ న విద్యతే... రథంపై కొలువై ఉన్న జగన్నాథ స్వామిని దర్శించినవారు పునర్జన్మ నుంచి విముక్తి పొందుతారు’ అనేది శాస్త్రవాక్యం. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అసంపూర్ణమైన కరచరణాలతో, ప్రత్యేక రూపాలతో కనిపించడం వెనుక ఒక లీల ఉంది. ఒకసారి కురుక్షేత్రంలో, సూర్యగ్రహణ సమయంలో... శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర తమ బాల్య లీలలను రోహిణీ మాత నుంచి వింటూ పరవశించిపోయారు. అప్పుడు వారి దేహాలు విశాలమైన కళ్ళతో, లోపలికి చొచ్చుకుపోయిన కరచరణాలతో రూపాంతరం చెందాయి. అవి వ్రజ వాసుల మాధుర్య, ప్రేమ భావనలకు ప్రతిరూపాలుగా పూజలందుకుంటున్నాయి.
గుండిచాలో విడిది
రథయాత్రలో జగన్నాథుడు (సాక్షాత్తు శ్రీకృష్ణుడు), బలభద్రుడు (బలరాముడు), సుభద్ర (శ్రీకృష్ణుని సోదరి) వేర్వేరు రథాల మీద కొలువై కదులుతారు. జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’ అంటారు ఇది 16 చక్రాలతో 44 అడుగుల రెండంగుళాల ఎత్తులో ఉంటుంది. బలభధ్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అంటారు. దానికి 14 చక్రాలుంటాయి ఎత్తు 43 అడుగుల మూడంగుళాలు. సుభద్ర రథం పేరు ‘దేవదళన’. దీనికి 12 చక్రాలుంటాయి, ఎత్తు 42 అడుగుల మూడంగుళాలు ఉంటుంది. ఈ రథయాత్ర ప్రధాన ఆలయం దగ్గర మొదలై గుండిచా మందిరం వరకూ సాగుతుంది. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు తొమ్మిదిరోజులపాటు గుండిచా మందిరంలో బస చేస్తారు. మూడు రోజుల తరువాత ‘హేరా పంచమి’ ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు లక్ష్మీదేవి గుడించా మందిరానికి వెళ్ళి, స్వామిని తిరిగి రమ్మని చెప్పి, కోపంగా వెనక్కు తిరిగి వస్తుంది. చివరకు స్వామివారు తమ మందిరానికి చేరుకొని, బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చే ‘సోనాబేష’తో రథయాత్ర ముగుస్తుంది.
జగన్నాథ నామం... విశ్వవ్యాప్తం
హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల కృషి ఫలితంగా ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ఖండాలలో, ప్రతి ప్రఖ్యాత నగర వీధుల్లో జగన్నాథ రథయాత్రను నిర్విహిస్తున్నారు. 1967లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో తొలిసారిగా అంతర్జాతీయ రథయాత్రను నిర్వహించారు. కుల, మత, వర్గ భేదం లేకుండా.. ప్రతి ఒక్కరికీ భగవంతుణ్ణి సేవించే అవకాశాన్ని ఈ ఉత్సవం అందిస్తుంది. ప్రజలంతా ‘హరేకృష్ణ... హరేరామ’ మహా మంత్రాన్ని జపిస్తూ ఉత్సవంలో పాల్గొంటారు. ఈ రథయాత్రలు జగన్నాథుని నామాన్ని, ప్రేమను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్నాయి. సామాజిక ఐక్యతను పెంపొందిస్తున్నాయి. శ్రీల ప్రభుపాదులు శ్రీ జగన్నాథుణ్ణి విశ్వమంతా పరిచయం చేశారు. ఆయనకు చిన్ననాటి నుంచే రథయాత్రపట్ల అమితమైన ఆసక్తి ఉండేది. కాగా... నవద్వీపంలో అవతరించిన శ్రీచైతన్య మహాప్రభువు 24వ యేట సన్న్యసించిన తరువాత... జగన్నాథపురినే తన భక్తి ఉద్యమ ప్రచార కేంద్రంగా చేసుకొని, హరినామ సంకీర్తనను వ్యాపింపజేశారు. శ్రీల ప్రభుపాదులు కూడా చైతన్య మహాప్రభువుల గౌడీయ సంప్రదాయ మార్గ నిర్దేశాలను అనుసరించి... ఈ రథోత్సవాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా రాధా-కృష్ణ దేవాలయాలు స్థాపించాలని, రథయాత్రలు నిర్వహించాలని తన శిష్యులను కోరారు. ఆయన అనుగ్రహం వల్లనే నేడు జగన్నాథుని నామం ప్రపంచమంతటా మారుమోగుతోంది.
ఎలా పాల్గొనాలి?
శ్రీ జగన్నాథ రథయాత్ర... భగవంతుడికి సేవ చేసేందుకు ప్రతి ఒక్కరికీ లభించే ఒక గొప్ప అవకాశం. భగవంతుడితో మనకున్న సనాతనమైన సంబంధాన్ని మళ్ళీ తెలుసుకోవడానికి ఈ ఉత్సవం సహాయపడుతుంది. రథయాత్రలో పాల్గొనడం ద్వారా శ్రీకష్ణునితో ప్రత్యక్షంగా అనుబంధం ఏర్పడుతుంది. ఎంత గొప్పవాడినైనా భగవంతుడి సర్నోతత్వాన్ని అంగీకరించాలనే ఆలోచనను రథయాత్ర కలిగిస్తుంది. రథయాత్ర సమయంలో రథాన్ని తాడు పట్టుకొని లాగడం, స్వామిని దర్శించడం, హారతులు ఇవ్వడం, నృత్య సంకీర్తనలు చేయడం, రథ మార్గంలో ముగ్గులు వేయడం, ప్రసాదాలు నివేదించడం లాంటి సేవలు భక్తులు చేయవచ్చు. ఇవి వారిని ఆధ్యాత్మికంగా మరింత పురోగమింపజేస్తాయి.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News
Updated Date - Jun 27 , 2025 | 01:00 AM