Lady Who Defended: బంకర్ బాంబ్ లేడీ
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:07 AM
ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన యుద్ధం సందర్భంగా ఇరాన్‌లోని రెండు అణు స్థావరాలపై అమెరికా కురిపించిన ‘బంకర్ బస్టర్’ బాంబులు గొప్ప కచ్చితత్వంతో లక్ష్యాల్ని దెబ్బతీశాయి...
న్యూస్‌మేకర్
ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన యుద్ధం సందర్భంగా ఇరాన్‌లోని రెండు అణు స్థావరాలపై అమెరికా కురిపించిన ‘బంకర్ బస్టర్’ బాంబులు గొప్ప కచ్చితత్వంతో లక్ష్యాల్ని దెబ్బతీశాయి. ఈ బాంబుల రూపకల్పనలో కీలకపాత్ర వహించిన అన్హ్ డుయోంగ్... కాందిశీకురాలిగా అమెరికాలో అడుగుపెట్టారు. తనకు ఆశ్రయం ఇచ్చిన దేశ సైనికుల కోసం ఏదైనా చేస్తానని సంకల్పం తీసుకున్న ఆమె కృషి... అగ్రరాజ్య యుద్ధ వ్యూహాలకు గట్టి దన్నుగా నిలుస్తోంది.
అది 2013. యుఎ్‌సలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణంలో జరిగిన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సదస్సుకు ప్రధాన వక్తగా హాజరయ్యారు అన్హ్ డుయోంగ్. సదస్సు ముగిసిన తరువాత ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. తను అప్ఘానిస్థాన్‌లో పని చేసిన సైనికుడినని చెబుతూ ‘‘మీరు నా ప్రాణాలను, నా తోటి సైనికుల ప్రాణాలను కాపాడారు. ధన్యవాదాలు’’ అని అన్నాడు. దీనికి ఆమె బదులిస్తూ ‘‘నేనే మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. మా కోసం మీ ప్రాణాలను పణంగా పెడుతున్నారు’’ అని చెప్పారామె. ‘‘అతని మాటలు నాకు ఎంతో ఉత్తేజం కలిగించాయి. పదోన్నతులు, పురస్కారాలకన్నా అవి గొప్పవి. ఎందుకంటే... అవి యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికుడి నోటి నుంచి వచ్చాయి. అంతకన్నా ఇంకేం కావాలి? నా లక్ష్యం నెరవేరిందనిపించింది’’ అని అని చెప్పారు అన్హ్. ఆమె లక్ష్యం వెనుక పెద్ద కథే ఉంది.
సర్వం కోల్పోయి...
అన్హ్... వియత్నాంలోని సైగాన్‌లో పుట్టారు. ఆమె తండ్రి దక్షిణ వియత్నాం ప్రభుత్వంలో వ్యవసాయాధికారి. అన్న హెలికాఫ్టర్ పైలెట్. 1970ల్లో... ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం మధ్య జరిగిన యుద్ధ వాతావరణంలోనే ఆమె బాల్యమంతా సాగింది. అన్న తరచూ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్ళేవారు. ‘అతను సజీవంగా వస్తారా?’ అనే భయంతో ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ ఉండేది. ‘‘నా దగ్గర మంత్రదండం ఉంటే... దాంతో మరింత అధునాతనమైన ఆయుధం తయారు చేసి మా అన్నయ్యకి ఇస్తాను. అప్పుడు అతను యుద్ధంలో గెలిచి, చెక్కుచెదరకుండా ఇంటికి వస్తాడనే ధీమా మాకు ఉంటుంది... అని ఎప్పుడూ అనుకొనేదాన్ని’’ అని చెబుతారు అన్హ్. తమ ప్రాంతం ఏ క్షణానైనా ఉత్తర వియత్నాం దళాల ఆధీనంలోకి వచ్చే పరిస్థితి ఉండడంతో... ఆమె సోదరుడు తమ కుటుంబాన్ని, దగ్గర బంధువులను... దక్షిణ వియత్నాం తరఫున పోరాడుతున్న అమెరికన్ సైనికుల సాయంతో హెలికాఫ్టర్‌లో తరలించారు. ఫిలిప్పీన్స్‌కు వెళ్ళే నేవీ నౌకలోకి చేర్చారు. అక్కడి నుంచి వారు యుఎస్ రాజధాని వాషింగ్టన్‌కు రాజకీయ శరణార్థులుగా చేరుకున్నారు. ‘‘అమెరికాలో అడుగుపెట్టేసరికి మేము సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ఉన్నాం. గొప్పగా బతికిన మా కుటుంబ పరిస్థితిని తలుచుకుంటే ఎంతో బాధ కలిగింది. కానీ వియత్నాం నుంచి పడవల్లో పారిపోవాలని ప్రయత్నించిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వారిలో సుమారు రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఆ విధంగా మేము ఎంతో అదృష్టవంతులం. అందుకే... ‘నన్ను, నా కుటుంబాన్నీ కాపాడిన అమెరికన్ సైనికుల కోసం... వాళ్ళు వారి తల్లితండ్రుల దగ్గరకు, అక్కాచెల్లెళ్ళ దగ్గరకు క్షేమంగా చేరుకోవడం కోసం నేను చేయగలిగినది ఏదైనా చేస్తాను’ అని సైగాన్‌లో మా ఇంటి గేటు దాటుతున్నప్పుడు నాకు నేనే ప్రమాణం చేసుకున్నాను’’ అంటారు అన్హ్.
67 రోజుల్లోనే...
ఒక చర్చి అండదండలతో ఆమె కుటుంబం కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అమెరికా చేరుకున్నాక అన్హ్. ఎదుర్కొన్న మొదటి సమస్య... భాష. కానీ తన ప్రతిభతో, పట్టుదలతో ఆమె ఆ సమస్యను అధిగమించారు. చదువుల్లో కూడా ఎంతో చురుగ్గా ఉండేవారు. కెమికల్ ఇంజనీరింగ్‌లో ఆనర్స్ డిగ్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాక... మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఇండియన్ హెడ్ పట్టణం కేంద్రంగా పని చేస్తున్న ‘నేవల్ సర్ఫేస్ వార్‌ఫేర్ సెంటర్’ (ఎన్‌ఎ్‌సడబ్ల్యూసి) ఉద్యోగిగా చేరారు. శక్తిమంతమైన పేలుడు పదార్థాల సమర్థవంతమైన వినియోగంపై పలు ప్రయోగాలు చేశారు. క్రమంగా పేలుడు పదార్ధాలు, జలగర్భ ఆయుధాలకు సంబంధించి ఆ కేంద్రం చేపట్టే సాంకేతిక కార్యక్రమాలకు అధిపతి అయ్యారు. అన్హ్, ఆమె బృందం అభివృద్ధి చేసిన పేలుడు పదార్థాలు, ‘ధర్మోబారిక్’ లాంటి బాంబులు వివిధ యుద్ధాల్లో, దాడుల్లో అమెరికా పైచెయ్యి సాధించడానికి దోహదం చేశాయి. 9-11 సంఘటన తరువాత... అల్‌ఖైదా ఉగ్రవాదులు దాక్కొన్న భూగర్భ సొరంగాల్లాంటి లోతైన ప్రదేశాల్లోకి ప్రయాణించగలిగే లేజర్-గైడెడ్ బాంబు ‘బిఎల్‌యు 118/బి’ని కేవలం 67 రోజుల్లో అన్హ్ బృందం తయారు చేసింది. ఇరుకైన ప్రదేశాల్లోకి, గుహల్లోకి సైనికులు కాలినడకన వెళ్ళే అవసరం లేకుండా... కచ్చితమైన ఫలితాలను అందించగలిగే ఈ బాంబుల వల్ల అమెరికాకు ప్రాణనష్టం తగ్గింది. అమెరికన్ మీడియా ఆమెను ‘బాంబ్ లేడీ’ అంటూ ప్రశంసించింది. ఆ తరువాత కొత్తతరం బాంబులు ఎన్నిటినో ఆ బృందం అభివృద్ధి చేసింది. వాటిలో ఒకటైన ‘బంకర్ బస్టర్ బాంబులను ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఇటీవలి యుద్ధం సందర్భంగా... ఇరాన్‌లోని రెండు అణు స్థావరాలపై అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. దీంతో అన్హ్ పేరు మరోసారి మారుమోగుతోంది.
యుద్ధాలంటే ద్వేషం
‘‘నాకు యుద్ధాలంటే ద్వేషం. వాటిని నిరోధించడానికే నేను ఆయుధాలు తయారు చేశాను. అయితే వాటిని ఎలా ఉపయోగిస్తారనేది నా చేతుల్లో ఉండదు. ఆ విషయంలో మా నాయకులమీద నాకు విశ్వాసం ఉంది’’ అంటారు 65 ఏళ్ళ అన్హ్. వ్యక్తిగత విషయాలకు వస్తే... అధికారిక విధుల నుంచి 2020లో పదవీవిరమణ చేసినా... బాంబుల తయారీకి తన సలహాలను, మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉన్నారు. ‘‘నా భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఆయన కూడా వియత్నాం కాందిశీకుడే. మాకు నలుగురు పిల్లలు. మేము ఏదైనా సాధించామంటే కారణం మాకు అమెరికాలో లభించిన అవకాశాలే. మా జీవితాలను బలంగా నిర్మించుకోవడానికి అవే దోహదం చేశాయి’’ అంటారు అన్హ్. ఆమెకు లభించిన అవకాశాలు తన ఎదుగుదలకే కాకుండా... అమెరికా ఆయుధ శక్తిని బలోపేతం చేయడానికి సైతం ఎంతో దోహదం చేశాయనడంలో సందేహం లేదు.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
రాష్ట్రపతుల పేర్లు తప్పుగా పలికిన ఖర్గే.. క్షమాపణకు బీజేపీ డిమాండ్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 05:07 AM