Millets: పిల్లలకూ చిరుధాన్యాలు
ABN, Publish Date - Aug 19 , 2025 | 04:26 AM
ఒకటి నుంచి మూడేళ్ల వయసు పిల్లలకు ఘానాహారంగా అన్నాన్నే ఎంచుకుంటూ ఉంటాం. కానీ పిల్లల ఎదుగుదలకు సూక్ష్మపోషకాల మీద దృష్టి పెట్టడం అత్యవసరం. అందుకోసం చిరుధాన్యాలను ఎంచుకోవాలి.
ఒకటి నుంచి మూడేళ్ల వయసు పిల్లలకు ఘానాహారంగా అన్నాన్నే ఎంచుకుంటూ ఉంటాం. కానీ పిల్లల ఎదుగుదలకు సూక్ష్మపోషకాల మీద దృష్టి పెట్టడం అత్యవసరం. అందుకోసం చిరుధాన్యాలను ఎంచుకోవాలి. వీటిలో బియ్యం, గోధుమల్లో లేని విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. కాబట్టి అందుబాటులో ఉన్న పలురకాల చిరుధాన్యాలను పిల్లలకు తినిపిస్తూ ఉండాలి.
రమ్యమైన రాగి బంతులు
చిరు ధాన్యాల్లో ఉండే ఇనుము, క్యాల్షియం, మెగ్నీషియం, బి విటమిన్లు పిల్లలు శక్తిని ఖర్చు చేసుకునే వేగాన్నీ, ఎముకల సాంద్రతనూ, రోగనిరోధకశక్తినీ పెంచుతాయి. వీటిలో గ్లూటెన్, అత్యధిక పీచు ఉంటుంది కాబట్టి పిల్లలకు తేలికగా జీర్ణమవుతాయి. వీటిలోని ఇనుము హార్మోన్ల పనితీరుకూ, ఎర్ర రక్తకణాల పెరుగుదలకూ తోడ్పడుతుంది. కాబట్టి పిల్లల ఆహారంలో చిరుధాన్యాలను చేర్చుకుంటే, ఎదుగుదల ఆరోగ్యకరంగా సాగుతుంది. అయితే చిరుధాన్యాలను పిల్లలకు తినిపించడం ఇబ్బందిగా మారితే, వాటిని ఇలా కొత్తగా కూడా వండి తినిపించవచ్చు.
కావలసిన పదార్థాలు:
రాగి పిండి: ఒక కప్పు
నీళ్లు: ఒకటిన్నర కప్పు
ఎండుమిరప: 2
కరివేపాకు: ఒక రెమ్మ
ఆవాలు: అర టీస్పూను
మినప్పప్పు: ఒక టీస్పూను
ఉప్పు: అవసరమైనంత
నూనె: రెండు టీస్పూన్లు
ఇలా వండుకోవాలి:
ప్యాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, మినప్పప్పు వేయించుకోవాలి. తర్వాత ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి, వేగిన తర్వాత, నీళ్లు, ఉప్పు వేసి కలపాలి.
నీళ్లు మరిగిన తర్వాత, మంట తగ్గించి, నెమ్మదిగా రాగి పిండి పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. రాగి పిండి పోయగానే అది ముద్ద కడుతుంది. అప్పుడు మంట తీసేసి, మిశ్రమాన్ని చల్లారబెట్టి, పొడిబారిపోకుండా వస్త్రం కప్పి ఉంచాలి.
ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు వేడి చేసి, ప్లేటుకు
నూనె పూసుకోవాలి. చేతులకు కూడా నూనె పట్టించి, పిండి ముద్ద వేడిగా ఉన్నప్పుడే, గుండ్రని బంతుల్లా చుట్టుకోవాలి.
ఈ రాగి బంతులను ఇడ్లీ ప్లేట్‌లో ఉంచి, 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత, క్యారెట్, లేదా టమాటో చట్నీతో కలిపి పిల్లలకు తినిపించాలి.
అరికల పాయసం కావలసిన పదార్థాలు:
అరికలు: పావు కప్పు
చక్కెర/బెల్లం: పావు కప్పు
చిక్కని పాలు: రెండు కప్పులు
జీడిపప్పు: పది
ఎండు ద్రాక్ష: 10
పాలు: అరకప్పు
యాలకుల పొడి: అర టీస్పూను
నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు
ఇలా వండుకోవాలి:
ప్యాన్‌లో నెయ్యి వేడి చేసి, జీడిపప్పు, ఎండు ద్రాక్షలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో అరికలను కమ్మని వాసన వచ్చేవరకూ వేయించుకోవాలి. తర్వాత నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ మీద మూత పెట్టి, అరికలు మెత్తబడేవరకూ ఉడికించుకోవాలి. చివర్లో అరకప్పు పాలు, బెల్లం, యాలకుల పొడి కలిపి, 5 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్ష కలిపి పిల్లలకు
తినిపించాలి.
పిల్లలకు చిరుధాన్యాలు ఇలా అలవాటు చేయాలి
పిల్లలకు అలవాటు చేసే ప్రతి పదార్థం విషయంలో కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. చిరుధాన్యాలకూ ఈ సూత్రం వర్తిస్తుంది. కాబట్టి చిరుధాన్యాలపరంగా అనుసరించవలసిన, అనుసరించకూడని అంశాల గురించి తెలుసుకుందాం!
ఇలా చేయాలి?
అలర్జీ తత్వాన్ని కనిపెట్టడం కోసం మూడు రోజుల నియమంలో భాగంగా మూడు రోజుల పాటు ఒకే ఆహారం తినిపించాలి. మొదట్లో చిన్న పరిమాణాల్లో తినిపించి, పిల్లల జీర్ణ వ్యవస్థ ఆ పదార్థానికి అలవాటు పడేలా చేయాలి. పోరిడ్జ్, కిచిడి, లేదా దోసె రూపాల్లో క్రమేపీ పిల్లలకు వాటిని అలవాటు చేయాలి.
సరైన రకం: రాగుల్లో క్యాల్షియం, ఖనిజ లవణాలు ఎక్కువ కాబట్టి పిల్లలకు మొదట వీటిని అలవాటు చేయాలి. తర్వాత కొర్రలు, ఊదలను పరిచయం చేయాలి
వండే విధానం: చిరుధాన్యాలను నానబెట్టి లేదా వేయించి వండుకోవాలి. ఇలా చేయడం వల్ల పోషకాల నష్టం తగ్గడంతో పాటు తేలికగా జీర్ణమవుతాయి. చిరుధాన్యాలను ప్రెషర్ కుక్కర్‌లో వండుకోవచ్చు. లేదా చిన్న మంట మీద మెత్తబడేవరకూ నెమ్మదిగా ఉడికించుకోవచ్చు
పదార్థాలతో కలిపి: పెరుగు, నెయ్యి, కూరగాయలతో కలిపి తినిపిస్తే, రుచి పెరుగుతుంది. అదనపు పోషకాలు అందుతాయి
ఆకర్షణీయమైన ఆకారాల్లో: కుకీస్, ప్యాన్‌కేక్స్, లడ్డు, పాయసం, ఇడ్లీ.. ఇలా ఆకర్షణీయమైన ఆకారాల్లో వండి తినిపిస్తే, పిల్లలు ఇష్టంగా తింటారు.
ఇవి కూడదు
అన్నం, గోధుమలకు బదులుగా: అన్నం, గోధుమలను పూర్తిగా తొలగించి చిరుధాన్యాలే తినిపించకూడదు. ప్రతి ధాన్యంలో ప్రత్యేకమైన పోషక నాణ్యతలుంటాయి. ప్రత్యేకించి చిన్న పిల్లలకు క్యాలరీల అవసరం ఎక్కువ కాబట్టి బరువు పెరగడం కోసం ఎదుగుదల కోసం భిన్నమైన పదార్థాలు తినిపిస్తూ ఉండాలి
భారీ పరిమాణాల్లో: తింటున్నారు కదా అని భారీ పరిమాణాల్లో తినిపిస్తే కడుపుబ్బరం, అసౌకర్యంతో పిల్లలు బాధపడతారు
నీరు సరిపడా: చిరుధాన్యాల్లో పీచు ఎక్కువ కాబట్టి పిల్లలకు సరిపడా నీళ్లు తాగిస్తూ ఉండాలి.
Updated Date - Aug 19 , 2025 | 04:26 AM