Self Elevation Through Inner Strength: స్వశక్తితోనే సాధ్యం
ABN, Publish Date - Oct 10 , 2025 | 01:50 AM
దాదాపు పన్నెండు వందల ఏళ్ళ క్రితం చైనాలో ఒక జెన్ గురువు ఉండేవాడు. ఆయన పేరు జోషు జుషిన్. ఆయన ఉపన్యాసాల ద్వారా ఎవరికీ, ఏదీ బోధించేవాడు కాదు.....
దాదాపు పన్నెండు వందల ఏళ్ళ క్రితం చైనాలో ఒక జెన్ గురువు ఉండేవాడు. ఆయన పేరు జోషు జుషిన్. ఆయన ఉపన్యాసాల ద్వారా ఎవరికీ, ఏదీ బోధించేవాడు కాదు. జోషు శిష్యులు ఆయనతోపాటే ఉంటూ... ఆయనను నిరంతరం గమనిస్తూ, నిశితంగా పరిశీలిస్తూ నేర్చుకోవాల్సిందే. ప్రశ్నలు వేసి, జవాబులు రాబట్టి, ఉపన్యాసాలు ఏర్పాటు చేసి ఆయన బోధను తెలుసుకొనే వీలు ఉండేది కాదు. ఎవరైనా జోషును ప్రశ్నించినా... ఆయన సూటిగా, అర్థమయ్యేలా సమాధానం చెప్పేవాడు కాదు.
ఒకసారి ఒక సన్యాసి జోషును ‘‘కుక్కలో కూడా బుద్ధత్వం ఉంటుందా?’’ అని అడిగాడు.
జోషు వెంటనే ‘‘మూ-మూ’’ అన్నాడు. అంతేకాని, ఉంటుందని కానీ, ఉండదని కానీ నేరుగా చెప్పలేదు. చైనా భాషలో ‘మూ’ అన్నా, ‘వూ’ అన్నా ‘శూన్యం’, ‘ఖాళీ’ అనే అర్థం ఉంది. శూన్యవాదాన్ని బోధించే బౌద్ధం ప్రకారం... కుక్కలో కూడా బుద్ధత్వం ఉంటుందని అనుకోవాల్సి వస్తుంది. శునకంలోను, దాని మాంసం తినేవాడిలోనూ జ్ఞానులు ఒకే తత్త్వాన్ని చూస్తారని భగవద్గీత చెబుతోంది. హిందూ ధర్మం ‘పూర్ణం’, ‘బ్రహ్మం’ అని దేనినైతే అంటుందో, బౌద్ధ మతం దాన్నే ‘శూన్యం’ అంటుంది. కుక్కలో ‘బ్రహ్మం ఉంటుంది’ అన్నా, ‘శూన్యం ఉంటుంది’ అని అన్నా అర్థం ఒకటే. ‘మూ-మూ’ అనడంలో జోషు భావం అదే కావచ్చు. ఆయన బోధించే పద్ధతి అలా ఉండేది.
ఒకసారి జోషు నడుస్తూ నడుస్తూ, మంచులో జారిపడ్డాడు. ‘‘సహాయం చేయండి, లేపండి’’ అని గట్టిగా అరిచాడు. ఆ సమీపంలో వెళ్తున్న ఆయన ప్రియశిష్యుడు ఒకడు పరుగుపరుగున వచ్చాడు. ‘‘లేపండి, లేపండి’’ అంటూ తన చేతులు పైకెత్తి అరుస్తున్న జోషు దగ్గరకు చేరుకున్నాడు. ఆయన పక్కనే తాను కూడా పడుకున్నాడు. వెంటనే జోషు నవ్వుతూ పైకి లేచి ‘‘శభాష్! నా బోధను బాగా గ్రహించావు. నీవు చాలా తెలివైన శిష్యుడివి. నిన్ను చూసి సంతోషిస్తున్నా’’ అన్నాడు.
ఎవరైనా పడిపోతే... వారు తమ స్వశక్తితోనే లేచి నిలబడాలి. ఎవరు పతనమయ్యారో వారే స్వయం శక్తితో తమనుతాము ఉద్ధరించుకోవాలి. అంతేతప్ప ఇతరుల మీద ఆధారపడకూడదు. ‘ఉద్ధరేదాత్మనాత్మానాం... ఆత్మను ఆత్మే ఉద్ధరించుకోవాలి’ అంటూ భగవద్గీతలో కృష్ణపరమాత్మ ఇదే చెప్పాడు.
రాచమడుగు శ్రీనివాసులు
Updated Date - Oct 10 , 2025 | 01:50 AM