ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ రేడియో జన జీవన వాణి

ABN, Publish Date - Jul 03 , 2025 | 03:11 AM

గర్భంతో ఉన్నప్పుడు ఉపవాసం చేయవచ్చా? మానేస్తే... నిర్ణీతమైన రోజుల్లో కచ్చితంగా ఉపవాసం పాటించాలనే సంప్రదాయానికి భంగం కలిగించినట్టా? కొనసాగిస్తే మరి తనకు, తనలోపల పెరుగుతున్న బిడ్డకు పోషణ ఎలా?..

గ్రామీణ జీవితాల్లో మార్పు కోసం చిన్న ప్రయత్నంగా 15 ఏళ్ల క్రితం అర్చనాకపూర్‌ ప్రారంభించిన స్మార్ట్‌ కమ్యూనిటీ రేడియో... విశ్వసనీయ సమాచారం అందించడంతో పాటు ప్రతి సమస్యకు సహేతుకమైన పరిష్కారాన్ని సూచించే మాధ్యమంగా ఎదిగింది. వినోదం నుంచి విజ్ఞానం వరకూ రోజూ పధ్నాలుగు గంటల ప్రసారాలతో జనం కోసం జనమే నిర్వహించుకుంటున్న ఈ నెట్‌వర్క్‌ లక్షలాది జీవితాలతో పెనవేసుకుంది.

గర్భంతో ఉన్నప్పుడు ఉపవాసం చేయవచ్చా? మానేస్తే... నిర్ణీతమైన రోజుల్లో కచ్చితంగా ఉపవాసం పాటించాలనే సంప్రదాయానికి భంగం కలిగించినట్టా? కొనసాగిస్తే మరి తనకు, తనలోపల పెరుగుతున్న బిడ్డకు పోషణ ఎలా?... హరియాణాలోని ఒక గర్భిణిని ఈ ప్రశ్నలు సతమతం చేశాయి. తనకు దగ్గర్లో ఉన్న రేడియో కమ్యూనిటీ సభ్యులకు తన సందేహాన్ని ఆమె వివరించారు. వారు వెంటనే తమ రేడియోలో ఈ విషయాన్ని ప్రసారం చేశారు. కొద్దిసేపటికే స్థానిక మత పెద్ద స్పందించారు. ‘‘నిర్ణీతమైన రోజుల్లో ఉపవాసాలు తప్పనిసరి అయినప్పటికీ... గర్భిణులు దాన్ని పాటించకపోయినా అపచారం కాదు’’ అని స్పష్టం చేశారు. ఇదొక్కటే కాదు... ఆరోగ్య, వ్యవసాయ సమస్యలు, స్త్రీ-పురుష సంబంధాలు, గృహహింస, మహిళలపై వేధింపులు వాతావరణ మార్పులు, వివిధ కార్యక్రమాల్లో పౌర భాగస్వామ్యం... ఇలా ఎన్నో అంశాలకు ‘స్మార్ట్‌ కమ్యూనిటీ రేడియో నెట్‌వర్క్‌’ ఒక చర్చాస్థలి, పరిష్కార వేదిక. ఢిల్లీకి చెందిన అర్చనాకపూర్‌ స్థాపించిన ఈ నెట్‌వర్క్‌ వచ్చే సెప్టెంబర్‌కు పదిహేనేళ్ళు పూర్తి చేసుకోబోతోంది.

అందుకే ఎంచుకున్నా...

అర్చనాకపూర్‌ ఒక సామాజిక కార్యకర్త, రచయిత, పుస్తక ప్రచురణకర్త, ఫిలిమ్‌ మేకర్‌. ఆమె, ఆమె బృందం హరియాణాలోని సుమారు వంద గ్రామాల్లో విద్య, జీవనోపాధికి సంబంధించి వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో స్వచ్ఛందంగా పని చేసేవారు. అయితే... ప్రభుత్వ పాజెక్టుల్లో ఎన్జీవోల భాగస్వామ్యాన్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ఏది ఏమైనప్పటికీ గ్రామీణ ప్రజలకు సేవలందించాలనే సంకల్పంతో... 2010 సెప్టెంబర్‌లో ‘రేడియో మేవాట్‌’ను ఆమె ప్రారంభించారు. ‘‘మేవాట్‌ (ప్రస్తుతం నెహ్‌ జిల్లా) సామాజికంగా, అక్షరాస్యతపరంగా... ఇలా అన్ని విధాలా వెనుకబడిన జిల్లా. సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు ఎక్కువ. రోజులో సగం సమయం విద్యుత్‌ సరఫరాకు కూడా జనం నోచుకొనేవారు కాదు. ఆరోగ్యాలు అంతంతమాత్రమే. వారి జీవితాల్లో మార్పుకోసమే ఆ జిల్లాను ఎంచుకున్నాను’’ అని చెబుతారు అర్చన. మొదట్లో రెండు గంటల ప్రసారాలతో ఈ కమ్యూనిటీ రేడియో ప్రారంభమయింది. ఇప్పుడు రోజూ పధ్నాలుగు గంటల సేపు వివిధ స్థానిక అంశాలపై కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెహ్‌ జిల్లాలోని 168 గ్రామాలకు చెందిన దాదాపు ఆరున్నర లక్షల మంది శ్రోతలు నిత్యం దీనితో మమేకం అవుతున్నారు.

సలహాల నుంచి అనుభవాల వరకూ...

ఈ కమ్యూనిటీ రేడియో నెట్‌వర్క్‌ అన్ని కార్యక్రమాల్లోనూ ప్రజలు తమ అభిప్రాయాలు వెల్లడించవచ్చు. వీలైనంత వరకూ అన్ని గ్రామాల్లోనూ కమ్యూనిటీ మెంబర్స్‌ వీటిని నడుపుతారు. గ్రామాల్లోని సమస్యలను స్థానికులు చెబితే... వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి, వారి సమాధానాలను కూడా ప్రసారం చేస్తారు. నిరక్షరాస్యుల కోసం రేడియో ట్యూషన్‌ ఉంది. వయోధికులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, అనుభవాలను వివరిస్తారు, సలహాలు ఇస్తారు. వైద్య సిబ్బంది ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాల గురించి, పిల్లల పెంపకం గురించి, గర్భిణులు, బాలింతలకు జాగ్రత్తల గురించి, నెలసరి సమస్యల పరిష్కారం గురించి, మానసిక ఆరోగ్యం గురించి వివరిస్తారు. గృహహింస, మహిళల పట్ల వేధింపులను కూడా ఇప్పుడు నిర్భయంగా చర్చించి, తగిన చర్యలు తీసుకుంటున్నారు. యువతకు పోటీ పరీక్షల గురించి, ఉద్యోగావకాశాల గురించి, రైతులకు వ్యవసాయ సంబంధమైన అంశాల గురించి సమాచారం అందిస్తున్నారు. పోషకాలతో కూడిన వంటల్లాంటి అంశాలు, కథలు, కవితలు, చిన్న నాటకాల్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు సరేసరి. రోడ్లు, మంచినీరు, పారిశుధ్యం, పాఠశాలల్లో సౌకర్యాలు... ఇలా ఎన్నో సమస్యలు కమ్యూనిటీ రేడియో ద్వారా అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్ళి పరిష్కరించుకుంటున్నారు.

అది మన బాధ్యత

‘‘ప్రస్తుతం పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, యునెస్కోతోపాటు అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌, గేట్స్‌ఫౌండేషన్‌ తదితర ప్రసిద్ధ సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లలో వారి సాయంతో ఎనభైకి పైగా రేడియో స్టేషన్లను నిర్వహిస్తున్నాం. మాకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ నుంచి రెండు జాతీయ పురస్కారాలు లభించాయి. యునెస్కో నుంచి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఇది మాకు గర్వకారణంగా భావిస్తున్నా. ‘రేడియో మేవాట్‌’ను మేము ప్రారంభించినప్పుడు సోషల్‌ మీడియా ఇంత విస్తృతంగా లేదు. ఇప్పుడు దాదాపు అందరి దగ్గరా స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి. దానిలో అవాంఛనీయమైన, అశాస్త్రీయమైన విషయాలెన్నో కనిపిస్తున్నాయి. అక్షరాస్యత, అవగాహన కొరవడిన గ్రామీణులపై ఇవి దుష్ప్రభావం చూపుతాయి. ఇలాంటి సమయాల్లో... ‘ఏది నిజం? దేన్ని నమ్మాలి?’ అనే మీమాంసలో ఉన్నవారికి విశ్వసనీయమైన దారి చూపడం మన బాధ్యత. ప్రధాన మీడియా పట్టించుకోని ఎన్నో గ్రామీణ సమస్యలను మా కమ్యూనిటీ రేడియో వెలుగులోకి తెస్తోంది. ఒక వ్యవస్థను నేను ఏర్పాటు చేశాను. ఇప్పుడు కంటెంట్‌ రూపకల్పనతో సహా ప్రతి బాధ్యతను స్థానికంగా ఉన్న ‘కమ్యూనిటీ మెంబర్స్‌’ చూసుకుంటున్నారు. ప్రజల జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ మా నెట్‌వర్క్‌ ప్రతిబింబిస్తుంది. అందుకే ఇది సమాచార మాధ్యమం మాత్రమే కాదు... ప్రజల జీవితాల్ని మార్చే సాధనం కూడా’’ అంటున్నారు అర్చన.

ఇవి కూడా చదవండి..

క్యాట్ ఆదేశాలను హైకోర్టులో సవాలు చేసిన కర్ణాటక సర్కార్

నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 03:11 AM