Healthy Indian Food: సంప్రదాయ వంటలతో ఆరోగ్యం
ABN, Publish Date - Jul 23 , 2025 | 02:41 AM
ఆహారంలోనే ఆరోగ్యం దాగి ఉంటుంది. కానీ ఎలాంటి ఆహారం తినాలో, ఎలా వండుకుని తినాలో, ఏ పాత్రల్లో వండుకుని తినాలో ఎంతమందికి తెలుసు? కాలక్రమేణా సంప్రదాయ వంటలు...
వినూత్నం
ఆహారంలోనే ఆరోగ్యం దాగి ఉంటుంది. కానీ ఎలాంటి ఆహారం తినాలో, ఎలా వండుకుని తినాలో, ఏ పాత్రల్లో వండుకుని తినాలో ఎంతమందికి తెలుసు? కాలక్రమేణా సంప్రదాయ వంటలు కనుమరుగైపోతున్న క్రమంలో, స్వాదిష్టం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా, తెలుగు వంటకాల పట్ల ఆరోగ్యాన్నీ, అవగాహననూ పెంచే ప్రయత్నం చేస్తున్నారు శ్రీకాకుళానికి చెందిన సౌజన్య నర్సీపురం. ఆ స్వాదిష్టమైన వంటల ప్రయాణం ఆమె మాటల్లోనే...
చిన్నప్పటి నుంచి అమ్మ చేస్తే తిని పెట్టడమే తప్ప స్వయంగా వండింది లేదు. కానీ బిటెక్ పూర్తి చేసి, ఉద్యోగరీత్యా చెన్నైలో ఉండవలసివచ్చినప్పుడు, అమ్మ చేతి వంట విలువ తెలిసొచ్చింది. స్వయంగా వండుకోవాలనే ఆలోచనకు అది నాందిగా మారింది. ఆ క్రమంలో వంటకాల పట్ల ఆసక్తి కూడా పెరిగింది. స్వతహాగా పుస్తకాలు చదివే అలవాటు ఉండడంతో వంటల పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అలా డాక్టర్ జి.వి. పూర్ణ చందు గారి పుస్తకాలు చదివి, వంటకాల పట్ల మరింత అవగాహన, ఆసక్తి పెంచుకున్నాను. రెండు వందల ఏళ్ల నాటి వంటకాలకూ నేటి వంటకాలకూ ఏమాత్రం పొంతన లేదనే విషయం ఆయన పుస్తకాలు చదివిన తర్వాత అర్థమైంది. మన వంటకాల్లో ఇంతటి మార్పు ఎందుకొచ్చింది? మనం మన సంప్రదాయ వంటకాలకు ఎందుకు దూరమవుతున్నాం?
ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సంప్రదాయ తెలుగు వంటకాలు మరుగున పడిపోయే ప్రమాదం ఉంది కదా?... ఇలా నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అలా వంటకాల పట్ల నా పరిశోధన మొదలుపెట్టాను.
లోతైన అవగాహన ఏర్పరుచుకుని...
ఎన్నో పుస్తకాలు చదివాను. ఎంతోమందిని విచారించాను. పెద్దలను సంప్రతించాను. తెలియని వంటకాల గురించి వీలున్న ప్రతి మార్గంలో ఆరా తీయడం మొదలుపెట్టాను. కూరగాయల సంతకు వెళ్లినప్పుడు ఏదైనా కొత్త కూరగాయ కనిపిస్తే, దాన్నెలా వండాలో అమ్మేవాళ్లను అడిగేదాన్ని. వాళ్లు చెప్పిన ఆ కొత్త వంటకాన్ని గుర్తుపెట్టుకుని ఇంట్లో వండే ప్రయత్నం చేసేదాన్ని. అయితే ఇలా వండే వంటకాలన్నిటినీ భద్రపరుచుకోవాలనే ఆలోచనతో 2020లో స్వాదిష్ఠం అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను మొదలుపెట్టాను. నిజానికి ఇది నా కోసం నేను సృష్టించుకున్న వేదిక. దీని ద్వారా ఎంతో మంది సంప్రదాయ వంటకాల పట్ల అవగాహనను పెంచుకోవడం నాకెంతో సంతృప్తిని కలిగిస్తోంది. వంట వండే విధానంతో పాటు, ఆ వంటకం వెనకున్న కథ, దాన్లోని పోషకాలు, పాత్రల గురించి వివరిస్తూ ఉండడంతో, క్రమేపీ అభిమానులు పెరిగారు. నాలా ఆలోచించే వాళ్లను కలిసిన ప్రతిసారీ ఈ రంగంలో నేను చేయవలసిన కృషి ఇంకా ఎంతో ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఈ దిశగా నేనొక అడుగు ముందుకు వేశాననే చెప్పాలి. ఇటీవలే ఓనమాలు అనే ఇనీషియేటివ్‌లో భాగం పంచుకున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరుగున పడిన సంస్కృతులు, సంప్రదాయ వంటకాలను తిరిగి వాడుకలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సంస్థ అది. ఈ సంస్థ తరఫున ఉత్తరాంధ్రలో నేనొక కుకింగ్ షోను ప్రదర్శించాను.
పాత్రలు కూడా ప్రధానమే!
పోషక అవసరతల ఆధారంగానే వంటకాలు రూపొందుతూ ఉంటాయి. పాత్రల పట్ల అవగాహన లేక, తోచిన పాత్రల్లో వండేసుకుంటున్నాం. ఇనుప పాత్రలో వండుకుంటే రక్తహీనత తొలగిపోయే మాట వాస్తవమే! కానీ చింతపండు లాంటి పుల్లని పదార్థాలు ఇనుప పాత్రల్లో వండుకోవడం వల్ల అవసరానికి మించిన ఇనుము శరీరంలోకి చేరుకుంటుందని ఎంతమందికి తెలుసు? కాబట్టి ఏ పాత్రలో, ఏ పదార్థాలు వండుకోవాలో అందరూ తెలుసుకోవాలి. దద్దోజనం ఆరోగ్యకరమైన ఆహారమే, కానీ సైనసైటిస్ ఉన్నవారు ఈ ఆహారం తినకూడదు. ఇలాంటి విషయాల పట్ల మరింత అవగాహన పెరిగేలా, పురాతన గ్రంథాలు చదవడం కోసం సంస్కృతం కూడా నేర్చుకున్నాను. మన సంప్రదాయ వంటకాల గురించి ఎంత నేర్చుకున్నా నేర్చుకోవలసింది ఇంకా ఉంటూనే ఉంటుంది. తెలుగింటి వంటల పట్ల ఆసక్తినీ, మక్కువనూ పెంచుతూ అందర్నీ ఆరోగ్యం వైపు నడిపించాలన్నదే నా లక్ష్యం. త్వరలో సంప్రదాయ వంటకాలతో ఒక ఈటరీ మొదలుపెట్టి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు జీవనవిధానానికి కూడా ప్రచారం కల్పించాలనే ఆలోచన ఉంది.
గోగుమళ్ల కవిత
‘ఉప్పిండి’ అనే వంటకం నుంచే ఉప్మా అన్న పదం పుట్టింది. ఉప్మా వండడానికి పది నిమిషాలు పట్టొచ్చు. కానీ ఉప్పిండిని ఐదు నిమిషాల్లో వండుకోవచ్చు. పెసరపప్పు, బియ్యం నూక, పోపుతో చిటికెలో తయారైపోయే ఇలాంటి వంటకాలు ఆరోగ్యకరం, సులభతరం. అన్నం, పెసరపప్పుతో తయారు చేసే పులగం కూడా ఇలాంటిదే! వంట కోసం హైరానా పడిపోవలసిన అవసరం లేదు. అనవసరపు మసాలాలు, పొడులు జోడించి దాని నామరూపాలు మార్చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇలాంటి సులభతరమైన వంటకాలను ఎంచుకుంటే సమయం ఆదా అవుతుంది. ఆరోగ్యం కూడా నిక్షేపంగా ఉంటుంది.
ప్రస్తుతం భోగాపురంలో ఉంటున్నాను. అమ్మ సూర్యకుమారి, గృహిణి. నాన్న వెంకట రమణ మూర్తి, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్‌గా పని చేశారు. మా వారు లీలా వినయ్ ఇటీవలే విజయనగరంలో సహజ వ్యవసాయంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతానికి నాలుగు రకాల దేశీ బియ్యంతో పాటు స్థానిక కూరగాయలన్నీ పండిస్తున్నారు. మాకు గిర్, పుంగనూరు మొదలైన దేశీయ ఆవులు కూడా ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 02:42 AM