ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Puttapaka Sarees: ప్రకృతి రంగుల పుట్టపాక చీర

ABN, Publish Date - Aug 04 , 2025 | 03:44 AM

సహజసిద్ధమైన రంగులు... సంప్రదాయ డిజైన్లు... నవీనతకు సాక్ష్యాలు పుట్టపాక చేనేతలు. తేలియా రుమాల్‌... డబుల్‌ ఇక్కత్‌ పట్టు చీరలు... ఇక్కడి కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న వస్త్రాలు... వేటికవే ప్రత్యేకతను...

విభిన్నం

సహజసిద్ధమైన రంగులు... సంప్రదాయ డిజైన్లు... నవీనతకు సాక్ష్యాలు పుట్టపాక చేనేతలు. తేలియా రుమాల్‌... డబుల్‌ ఇక్కత్‌ పట్టు చీరలు... ఇక్కడి కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న వస్త్రాలు... వేటికవే ప్రత్యేకతను చాటే అపురూపాలు. ఈ అరుదైన కళను విశ్వవ్యాప్తం చేసి... చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తేవడంలో విశేష కృషి చేస్తున్నారు గజం నర్మదానరేందర్‌. ఇందుకుగానూ ఆమెకు ఇటీవల కేంద్ర చేనేత, జౌళి శాఖ మార్కెటింగ్‌ విభాగంలో జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ‘జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌’ (జీఐ) కూడా పొందిన పుట్టపాక వస్త్రం విశేషాల సమాహారం ‘నవ్య’కు ప్రత్యేకం.

యాదాద్రి భువనగిరి జిల్లా... సంస్థాన్‌నారాయణపురం మండలం... పుట్టపాక గ్రామం. ఇక్కడ వెయ్యి కుటుంబాలు చేనేత పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రాచీన కాలంనాటి తేలియా రుమాలుతో పాటు డబుల్‌ ఇక్కత్‌ పట్టు చీరలు ఈ ప్రాంతంలో తయారవుతున్నాయి. ఇక్కడ ప్రతి కార్మికుడూ ఒక అద్భుత కళాకారుడే. మగ్గంపై నేసే ప్రతి వస్త్రమూ దేనికదే ప్రత్యేకతను చాటుతుంది. సృజనాత్మక డిజైన్లను రూపొందించడంలో ఇక్కడి కార్మికులు దిట్టలు. ప్రస్తుతం చీరలతోపాటు దుపట్టాలు, డ్రెస్‌ మెటీరియల్స్‌ ఇక్కడ తయారు చేస్తున్నారు.

ఆరు నెలల శ్రమ...

తేలియా రుమాల్‌ చీర తయారీకి నాణ్యమైన పత్తి నుంచి తీసిన నూలు ఉపయోగిస్తారు. కరక్కాయ పొడి లాంటి ప్రకృతిసిద్ధమైన పదార్థాలతో ఆ నూలును శుద్ధి చేస్తారు. బంతి పూలు, దానిమ్మ పండ్లు, కొత్తిమీర, ఉల్లిగడ్డ పొట్టు, వివిధ మొక్కల ఆకులు, వేర్లు, వనమూలికలతో రంగులు తయారు చేస్తారు. సహజసిద్ధమైన రంగులను మల్బరీ పట్టు దారానికి అద్ది... తేలియా రుమాల్‌తో పట్టుచీర రూపొందిస్తారు. డబుల్‌ ఇక్కత్‌ పద్ధతిలో డిజైన్లు, కొన్ని చిహ్నాలను ఎంపిక చేసుకుని గ్రాఫ్‌ తయారు చేస్తారు. డిజైన్లు గడుల్లో ఇమిడి, ఏడు గజాల చీర పొడవునా రావడానికి... 135 పాయలతో చిటికి తయారు చేస్తారు. అంగుళానికి 72 పోగులు వచ్చేలా చూస్తారు. ఎంతో శ్రద్ధగా, ఓపిగ్గా చేయాల్సిన ప్రక్రియ ఇది. ఒక చీర రూపొందించడానికి ఆరు నెలల సమయం పడుతుంది. వైవిధ్యమైన తేలియా రుమాల్‌కు భౌగోళిక సూచీ (జీఐ: జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌) కూడా లభించడం మరో విశేషం.

దేశవిదేశీ ప్రతినిధుల అధ్యయనం...

హైదరాబాద్‌ నగరానికి దగ్గరలో ఉన్న పుట్టపాక చేనేత కళను అధ్యయనం చేసేందుకు దేశవిదేశీ ప్రతినిధులు వస్తుంటారు. నిఫ్ట్‌ ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఫ్యాషన్‌ డిజైనర్లు వీరిలో ఉన్నారు. పుట్టపాకలో మగ్గంపై నేసిన వస్ర్తాన్ని... అపురూప కళాఖండాలను భద్రపరిచే లండన్‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అమెరికా అధ్యక్షుడి భవనం వైట్‌హౌ్‌సలో ఇక్కడ తయారు చేసిన వస్ర్తాన్ని అలంకరణకు ఉపయోగిస్తున్నారు. దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో జరిగే ఎగ్జిబిషన్లలో ఈ చేనేతలు ప్రదర్శిస్తుంటారు. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర తయారు చేసిన ఘనత ఇక్కడి కళాకారులది. గ్రామానికి చెందిన గజం గోవర్థన్‌, గజం సత్యనారాయణ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. పుట్టపాక నుంచి ఇప్పటివరకు 30మంది కళాకారులకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి.

మరో ఇద్దరికి...

ఇటీవలే పుట్టపాకకు చెందిన ఇద్దరు కళాకారులు కేంద్ర చేనేత, జౌళి శాఖ ప్రకటించిన జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు. ఇక్కత్‌ వస్త్రాల తయారీలో నూతన పద్ధతులు అవలంభించి, కొనుగోలుదారులను ఆకట్టుకొంటున్న గజం నర్మదానరేందర్‌కు చేనేత మార్కెటింగ్‌ విభాగంలో అవార్డు దక్కింది. అదేవిధంగా సహజసిద్ధమైన రంగులతో తేలియా రుమాల్‌, డబుల్‌ ఇక్కత్‌ డాబీబోన్‌ చీర, డబుల్‌ ఇక్కత్‌ డాబీ బోన్‌ దుప్పటి తయారు చేసిన గూడ పవన్‌ యంగ్‌ వీవర్‌ విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఆరు నెలల పాటు శ్రమించి... 6.25 మీటర్ల పొడవు, 46 ఇంచుల వెడల్పుతో పవన్‌ తయారు చేసిన ఈ చీరలో... తేలియా రుమాల్‌కు సంబంధించి 16 ఆకృతులు ఉన్నాయి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు.

యాదాద్రి, ఆంధ్రజ్యోతి

ఉపాధి కల్పిస్తూ...

కళను కాపాడుతూ...

చేనేత కళను కాపాడుతూ, నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నాను. అందులో భాగంగా మహిళల అభిరుచులకు తగ్గట్టు సంప్రదాయ డిజైన్లను నవీకరిస్తూ, విభిన్న శ్రేణుల చీరలు రూపొందిస్తున్నాం. తేలియా రుమాల్‌ వస్ర్తాలను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మార్కెటింగ్‌ చేయడంతో లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన మా వ్యాపారం ఇప్పుడు కోట్లల్లో టర్నోవర్‌ జరుగుతోంది. మా వద్ద రూ.10 వేల నుంచి రూ.75 వేల ధర పలికే చీరలు ఉన్నాయి. సీజన్‌, ఆర్డర్లను బట్టి చీరలు తయారు చేస్తాం. ప్రస్తుతం 300 మగ్గాలపై పని జరుగుతోంది. ఈ వృత్తిపై ఆధారపడిన చేనేత కుటుంబాలన్నీ ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు అవసరమైన పని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. నా సేవలు గుర్తించి, కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుకు ఎంపిక చేయడం గర్వంగా ఉంది. ఇది నా ఒక్కదాని ఘనత కాదు. నాకు చేయూత అందించిన నా భర్త, చేనేత రంగం గురువులు, కళాకారులు అందరిదీనని భావిస్తున్నాను.

గజం నర్మదానరేందర్‌

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్

ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్

For More AP News and Telugu News

Updated Date - Aug 04 , 2025 | 03:44 AM