Rainy Season Skin Tips: వానల్లో చర్మం ఇలా క్షేమం
ABN, Publish Date - Jul 29 , 2025 | 05:29 AM
వానాకాలంలో అడపా దడపా తడుస్తూ ఉంటాం. వర్షపు నీళ్లలో తడుస్తూనే పనులు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇలా నీళ్లలో ఎక్కువగా తడవడం, నానుతూ ఉండడం వల్ల ఈ కాలంలో కొన్ని చర్మ సమస్యల ముప్పు పొంచి ఉంటుంది...
స్కిన్ కేర్
వానాకాలంలో అడపా దడపా తడుస్తూ ఉంటాం. వర్షపు నీళ్లలో తడుస్తూనే పనులు చేసుకుంటూ ఉంటాం. అయితే ఇలా నీళ్లలో ఎక్కువగా తడవడం, నానుతూ ఉండడం వల్ల ఈ కాలంలో కొన్ని చర్మ సమస్యల ముప్పు పొంచి ఉంటుంది. వాటి గురించిన అవగాహన కలిగి ఉండడం అత్యవసరం అంటున్నారు చర్మ వైద్యులు.
వానలో తడవడం మనందరం ఇష్టపడతాం! వాతావరణంలోని కాలుష్య కారకాలు, సూక్ష్మక్రిములు వాన నీళ్లలో కలుస్తాయి, వాటి వల్ల చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వానలో తడిచిన వెంటనే శుభ్రంగా స్నానం చేయడం మంచిది. అలాగే వానలో తడిచిన దుస్తుల్లో ఎక్కువ సమయం పాటు ఉండిపోవడం వల్ల జ్వరం, చర్మం మీద దద్దుర్లు వేధిస్తాయి. అలాగే బాహుమూలలు లాంటి ప్రదేశాల్లోని చర్మపు ముడతల్లో తేమ నిల్వ ఉండిపోయి, ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువ. కాబట్టి ఆయా ప్రదేశాలను కూడా ఈ కాలంలో పొడిగా ఉంచుకోవాలి. వానలో దుస్తులతో పాటు బూట్లు, సాక్సులు కూడా తడిచిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతి రోజూ సాక్స్ మారుస్తూ ఉండాలి. అలాగే ఈ కాలంలో గాలి ధారాళంగా చొరబడే సాక్సులు ఎంచుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్నప్పటికీ చెప్పులు వేసుకునే నడుస్తూ ఉండాలి.
పాదాలు పాచితే?
నీళ్లలో ఎక్కువగా నానినప్పుడు పాదాలు, వేళ్లు పాచిపోతూ ఉంటాయి. ఇలాంటి ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు దూరంగా ఉండాలంటే తడిచిన పాదాలను వెంటనే పొడి వస్త్రంతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. రాత్రి పడుకోబోయే ముందు పాదాలకూ, వేళ్లకూ మాయిశ్చరైజర్ పట్టించడం మంచిది. ఒకవేళ పాదాలకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకితే యాంటీ ఫంగల్ క్రీమ్‌ను పూసుకోవాలి. దీంతో ఇన్‌ఫెక్షన్ మరింత తీవ్రమవకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలతో కూడా ఇన్‌ఫెక్షన్ అదుపులోకి రానప్పుడు చర్మ వైద్యులను కలవాల్సి ఉంటుంది. యాంటీ ఫంగల్ మాత్రలతో ఈ తరహా ఇన్‌ఫెక్షన్లు సమర్థంగా అదుపులోకి వస్తాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే, అన్ని వేళ్లకూ పాకి, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కూడా సోకి సమస్య మరింత క్లిష్టమవుతుంది. కాబట్టి వెంటనే అప్రమత్తమవుతూ ఉండాలి.
ఇలాంటి చెప్పులు మేలు
ఈ కాలానికి తగ్గట్టు గాలి చొరబడే చెప్పులు, బూట్లు ఎంచుకోవాలి. తడిచిన చెప్పులు, బూట్లు పూర్తిగా ఆరిన తర్వాతే వేసుకోవాలి. ఈ కాలంలో రబ్బరు, ప్లాస్టిక్ చెప్పులను ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ వీటిలోకి చొరబడిన నీరు అక్కడే నిల్వ ఉండిపోయి, ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుంది. కాబట్టి వీటికి బదులుగా స్లిపాన్స్ లాంటి బ్రీతబుల్ చెప్పులు ఎంచుకోవాలి. అలాగే ప్రతి ఉదయం, రాత్రి నిద్రకు ముందు పాదాలకూ, వేళ్లకూ తేలికపాటి మాయిశ్చరైజర్ పూసుకుంటూ ఉండాలి.
ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు దూరంగా...
ఈ కాలంలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు అత్యంత సహజం. వాతావరణంలో పెరిగే తేమ, చమటల వల్ల చర్మపు ముడతల్లో, గోళ్ల అడుగున ఫంగల్ ఇన్‌ఫెక్షన్ తలెత్తుతుంది. దాంతో దురదలు మొదలవుతాయి. ఆ ప్రదేశంలో గోకడం వల్ల, గోళ్ల ద్వారా ఇన్‌ఫెక్షన్ ఇతర ప్రదేశాలకు సోకుతుంది. కాబట్టి ఈ ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండాలంటే పూర్తిగా ఆరిన దుస్తులే వేసుకోవాలి. వేసవిలో మాదిరిగా ధారాళంగా గాలి చొరబడే దుస్తులే వేసుకోవాలి. బిగుతుగా ఉండే జీన్స్ లాంటి వాటికి ఈ కాలంలో దూరంగా ఉండడమే మేలు. అలాగే చర్మపు ముడతల్లో యాంటీ ఫంగల్ పౌడర్లు వాడుకోవడం ద్వారా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్ పెరిగి ఆ ప్రదేశమంతా ఎర్రగా మారి, దురద పెడుతుంటే తప్పనిసరిగా చర్మ వైద్యులను కలవాల్సి ఉంటుంది.
ఇతరత్రా సమస్యలు కూడా...
వానాకాలంలో చర్మ సమస్యలతో పాటు ఇంకొన్ని సమస్యలు కూడా పెరుగుతాయి. అవేంటంటే...
మొటిమలు: ఈ కాలంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల చర్మంలోని నూనె గ్రంథులు ఎక్కువ నూనెలను స్రవించడం మొదలుపెడతాయి. దాంతో చర్మ రంథ్రాలు మూసుకుపోయి, బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఫలితంగా అప్పటికే ఉన్న మొటిమల సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. నాన్ గ్రీజీ మాయిశ్చరైజర్లు వాడుకోవాలి. అలాగే వానాకాలంలో ఎండ తక్కువగానే ఉన్నప్పటికీ సన్‌స్ర్కీన్ తప్పనిసరిగా వాడుకోవాలి.
చుండ్రు: ఈ కాలంలో వెంట్రుకల కుదుళ్లలో నూనె గ్రంథ్రులు ఎక్కువ నూనెలను స్రవించడం వల్ల, ఫంగస్ పెరిగి, దాంతో పాటు చుండ్రు సమస్య పెరుగుతుంది. వెంట్రుకలు కూడా ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఈ కాలంలో యాంటీఫంగల్ షాంపూలు వాడుకోవాలి.
కీటకాలతో తిప్పలు: ఈ కాలంలో కీటకాలు కూడా విజృంభిస్తూ ఉంటాయి. ఇవి శరీరం మీద వాలినప్పుడు, కుట్టినప్పుడు, వాటి నుంచి కొన్ని స్రావాలు వెలువడి చర్మం మీద దద్దుర్లు లాంటి ఇన్‌సెక్ట్ బైట్ రియాక్షన్లు తలెత్తుతాయి. కాబట్టి కీటకాలు ఇంట్లోకి చొరబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
డాక్టర్ కె. క్రాంతి వర్మ
కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్,
రెనోవా హాస్పిటల్స్,
సనత్ నగర్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
నాగ పంచమి... జస్ట్ ఇలా చేయండి..
‘కాలేజీలు ఖాళీ’ అంటూ ప్రచారం.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్
For More AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 29 , 2025 | 05:29 AM