New Covid Variants: తిరగబెట్టిన కొవిడ్ కథ
ABN, Publish Date - Jun 03 , 2025 | 05:06 AM
ఇటీవల భారత్‌లో NB.1.8.1, LF.7 అనే రెండు కొత్త కొవిడ్ వేరియెంట్లు వెలుగులోకి వచ్చాయి. తీవ్రమైన ప్రమాదం లేకపోయినా, అలెర్జీ లాంటి లక్షణాలతో బయటపడుతున్న ఈ వేరియెంట్లపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొవిడ్ కథ ముగిసిందని సంబరపడేలోపే కొత్త వేరియెంట్స్ పుట్టుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు ఊపందుకుంటున్న నేపథ్యంలో, తాజా కొవిడ్ వేరియెంట్లు, వాటి ప్రభావాల గురించి తెలుసుకుందాం!
వ్యాక్సిన్లు, బూస్టర్లతో కొవిడ్ రక్షణ పొందినప్పటికీ, ఆరోగ్య భద్రతా చర్యలు పటిష్ఠంగా పాటిస్తున్నప్పటికీ, కొత్త కొవిడ్ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచడం అత్యవసరం. ఇప్పటివరకూ మన దేశంలో రెండు రకాల కొత్త వేరియెంట్లు వెలుగులోకొచ్చాయి. అవేంటంటే...
ఎన్‌బి.1.8.1: ఢిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా కనిపిస్తున్న వేరియెంట్ ఇది. ఒమైక్రాన్‌తో సన్నిహిత సంబంధం కలిగిన ఈ వేరియెంట్, స్పైక్ ప్రొటీన్‌పరంగా స్వల్ప ఉత్పరివర్తనాలను కలిగి ఉంది. తేలికపాటి లక్షణాలతో బయల్పడుతున్న ఈ వైరస్, వ్యాక్సిన్ తోసుకోని పెద్దల్లో వేగంగా విస్తరిస్తోంది
ఎల్‌ఎఫ్.7: ఈ వైరస్ దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో బయల్పడింది. 2022కు ముందు కొవిడ్-19 బారిన పడిన పెద్దల వ్యాధినిరోధకశక్తికి, ఈ వైరస్ ఎక్కువ నిరోధకతను కలిగి ఉండవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి.
అయితే ప్రస్తుతానికి ఈ రెండు వేరియెంట్లలో ఏ ఒక్కదాన్నీ ఆందోళనకరమైన వేరియెంటుగా వర్గీకరించడం జరగలేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాబట్టి వ్యాక్సిన్లు తీసుకున్న వారిని ఈ వేరియెంట్లు తీవ్ర అస్వస్థతకు గురి చేయలేవు. అయితే గొంతు నొప్పి, పొడి దగ్గు, నీరసం ఈ కొత్త వేరియెంట్ల ప్రధాన లక్షణాలు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. రుచి, వాసన కోల్పోవడం, లాంటి కొవిడ్ సంప్రదాయ లక్షణాలేవీ లేకుండానే ప్రస్తుతం పాజిటివ్ ఫలితాలు వెలువడుతున్నాయి. వీటికి బదులుగా అలర్జీ, సాధారణ జలుబును తలపించే లక్షణాల రూపంలోనే తాజా కొవిడ్ వేరియెంట్లు బయల్పడుతున్నాయి.
వీటి మీద కన్నేసి...
జ్వరం, లేదా చలి
ముక్కు దిబ్బెడ, ముక్కు నుంచి నీరు కారడం
గొంతు నొప్పి
పొడి దగ్గు
తలనొప్పి, నీరసం
జీర్ణసంబంధ సమస్యలు (డయేరియా)
ఒంటి నొప్పులు
ఈ లక్షణాలు కనిపిస్తే?
ఇంటి పట్టునే శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ మోతాదులను పరీక్షించుకోవాలి
బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఇంటికే పరిమితమైపోవాలి
ఆర్‌టి-పిసిఆర్ లేదా యాంటిజెన్ పరీక్షలు చేయించుకోవాలి
3 నుంచి 4 రోజుల్లో లక్షణాలు అదుపులోకి రాకపోతే వైద్యులను కలవాలి
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 03 , 2025 | 05:06 AM