Constipation Relief: మలబద్ధకం వదలాలంటే
ABN, Publish Date - Sep 09 , 2025 | 05:23 AM
ఉదయాన్నే కాలకృత్యాలు తీరకపోతే రోజంతా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు మన ఆహారశైలి కారణంగా...
ఉదయాన్నే కాలకృత్యాలు తీరకపోతే రోజంతా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు మన ఆహారశైలి కారణంగా మలబద్ధకం తలెత్తి, తిరిగి రెండో రోజుకి సర్దుకుంటుంది. కానీ ఇదే ఇబ్బంది పదే పదే తలెత్తుతున్నా, రోజుల తరబడి వేధిస్తున్నా సుఖ విరేచనం జరిగేందుకు తోడ్పడే పదార్థాలను తీసుకోవాలి.
కలబంద:
కలబందలో ఉండే ‘ఆంథ్రాక్వినోన్స్’ అనే కాంపౌండ్లు పెద్ద పేగుల్లో నీరు ఊరేలా చేసి, మ్యూక్‌సను ఉత్పత్తి చేసి, పేగుల కదలికలను పెంచుతాయి. దాంతో తేలికగా విరేచనం జరిగి మలబద్ధకం వదులుతుంది. కాబట్టి అర కప్పు కలబంద గుజ్జు పరగడుపునే తీసుకుంటే ఫలితం ఉంటుంది.
సబ్జా:
నీళ్లతో కలిస్తే సబ్జా జిగురులా తయారవుతుంది. ఆ తత్త్వం కారణంగా సబ్జా పేగుల్లో తేలికగా కదిలి మలబద్ధకాన్ని వదిలిస్తుంది. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన సబ్జా విత్తనాలను పరగడుపునే తాగితే విరేచనం తేలికగా జరుగుతుంది.
అవిసెలు:
వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం ఉన్నవారు వంటకాల్లో అవిసె గింజల పొడి కలుపుకుని తింటే, తగినంత పీచు శరీరానికి అందుతుంది. ఇది మలంతో కలిసి పేగుల్లో తేలికగా జారేందుకు సహాయపడుతుంది.
ఆకు కూరలు:
ఆకు కూరల్లో ఉండే మెగ్నీషియమ్‌కు మలాన్ని మెత్తబరిచే గుణం ఉంటుంది. అంతేకాదు. పేగుల్లో నీరు ఊరేలా చేయగల శక్తి మెగ్నీషియమ్‌కు ఉంటుంది. ఈ గుణాల వల్ల ఆకు కూరలు తింటే విరేచనం తేలికగా జరుగుతుంది.
తాజా పళ్లు:
కొందరికి తాజా పళ్లు సుఖ విరేచనానికి సహాయపడతాయి. ఆకలి తీరటంతోపాటు మలబద్ధకం తలెతకుండా ఉండాలంటే రోజుకి కనీసం 3 రకాల పళ్లు తినాలి. రాత్రి నిద్రకు ముందు మగ్గిన అరటి పండు తిన్నా ఉదయాన్నే సుఖ విరేచనం అవుతుంది.
కొబ్బరి నీళ్లు:
వీటిలో ఉండే ఎలక్ర్టొలైట్లు మలబద్ధకానికి కారణమయ్యే డీహైడ్రేషన్‌ను తొలగించి, మూత్రనాళాన్ని శుభ్రం చేస్తాయి. ఫలితంగా మలబద్ధకం వదులుతుంది.
Updated Date - Sep 09 , 2025 | 05:23 AM