Rainy Season Garden: వర్షాకాలంలో మొక్కలు పదిలంగా
ABN, Publish Date - Jul 23 , 2025 | 02:14 AM
మనం ఇంటి చుట్టూ, బాల్కనీలో, మేడపైన రకరకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. పెద్ద పెద్ద చినుకులు పడినా, గాలి బలంగా వీచినా ఈ మొక్కలకు నష్టం కలుగవచ్చు....
మనం ఇంటి చుట్టూ, బాల్కనీలో, మేడపైన రకరకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. పెద్ద పెద్ద చినుకులు పడినా, గాలి బలంగా వీచినా ఈ మొక్కలకు నష్టం కలుగవచ్చు. కాబట్టి వర్షాకాలంలో మొక్కల సంరక్షణకు సంబంధించి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
నిరంతరం కురిసే వర్షాల వల్ల ఒక్కోసారి కాండం, ఆకులు, పువ్వులు కుళ్లిపోవడాన్ని చూస్తూ ఉంటాం. వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. లేదంటే క్రిమికీటకాలు చేరి మొక్కను బలహీనపరుస్తాయి.
గాలి బలంగా వీస్తే మొక్కలు, వాటి కొమ్మలు వంగిపోతుంటాయి. అలాకాకుండా మొక్కలకు సమీపంలో పొడవైన కర్ర లేదా చెక్కను ఆధారంగా నిలబెట్టాలి. సన్నని దారంతో దానికి మొక్కను జతచేయాలి.
వర్షాకాలంలో తరచూ మొక్కలకు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. కుండీల్లో అయితే నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుండీ అడుగున ఉండే రంధ్రం మూసుకుపోకుండా చూడాలి.
ఇంటి చుట్టూ, మేడ మీద తోట పెంచుతున్నట్లయితే మొక్కల మొదళ్లలో నీరు నిలవకుండా చూసుకోవాలి. వర్షపు నీరు ఎక్కడా ఆగకుండా ప్రవహించేలా ఏర్పాటు చేసుకోవాలి.
వర్షాలు కురవగానే మొక్కలకు చిగుర్లు వస్తుంటాయి. ఈ సమయంలో పండ్లు, కాయగూరల నుంచి వచ్చే వ్యర్థాలతో సేంద్రీయ ఎరువు తయారు చేసి మొక్కలకు అందించాలి. వాడేసిన కాఫీ, టీ పొడులను ఒకసారి మంచినీళ్లతో కడిగి మట్టిలో కలపవచ్చు. ఇలా చేయడం వల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది.
ఆగకుండా కురిసే వర్షాల వల్ల మొక్కల మొదట్లో మట్టి పక్కకు జరుగుతుంది. దీంతో మొక్కల వేళ్లు బయటికి వచ్చేస్తుంటాయి. అలాంటప్పుడు వర్షం తగ్గగానే వేళ్లమీదికి మట్టిని జరపాలి. అలాగే తేలికపాటి ఎరువులను కూడా అందించాలి.
ఆకుకూరలు, పూలమొక్కలు ఎక్కువగా వర్షానికి ప్రభావితమవుతాయి. ఇంటి చుట్టూ లేదా మిద్దె తోటలో ఈ మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే వాటిమీద వర్షం పడకుండా నెట్‌షీట్‌తో కూడిన రెయిన్ కవర్‌ను ఏర్పాటు చేయాలి. వర్షం తగ్గగానే రెయిన్ కవర్ తొలగిస్తే నెట్ షీట్ ద్వారా మొక్కలకు సూర్యరశ్మి అందుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 02:14 AM