ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Memory Loss Causes: మతిమరుపు మతలబు ఇదే

ABN, Publish Date - Jul 29 , 2025 | 05:36 AM

మతిమరుపు మామూలు విషయమే! అయితే కొన్ని సందర్భాల్లో అంతర్గత ఆరోగ్య సమస్యలకు అదొక సంకేతం కూడా! కాబట్టి మతిమరుపును తేలికగా కొట్టిపారేయకుండా, దాని మూల కారణాలను వెతికి వాటిని...

మెమరీ

మతిమరుపు మామూలు విషయమే! అయితే కొన్ని సందర్భాల్లో అంతర్గత ఆరోగ్య సమస్యలకు అదొక సంకేతం కూడా! కాబట్టి మతిమరుపును తేలికగా కొట్టిపారేయకుండా, దాని మూల కారణాలను వెతికి వాటిని సరిదిద్దుకోవాలంటున్నారు వైద్యులు.

పైబడే వయసుతో జ్ఞాపకశక్తి నెమ్మదిగా క్షీణించడం సహజమే! అలాగే అడపాదడపా మనందర్లో కూడా అప్పుడప్పుడూ స్వల్ప మతిమరుపు తలెత్తుతూ ఉంటుంది. తాళాలు ఎక్కడ పెట్టామో గుర్తు లేక వెతుక్కుంటూ ఉంటాం. ఒక్కోసారి కళ్లజోడు ఎక్కడ పెట్టామో గుర్తుండదు. అయితే ఇలాంటి చిన్నా చితకా మతిమరుపులకు కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ మునుపటి కంటే మతిమరుపు పెరిగినా, దాంతో దైనందిన జీవితంలో ఇబ్బందులు తలెత్తినా ఈ సమస్యను తీవ్రంగానే పరిగణించాలి. అయితే మెదడులోని నాడీ కణాల క్షీణత వల్ల, మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాలు మార్పులకు గురవడం వల్ల పెద్ద వయసులో అల్జీమర్స్‌ వేధిస్తుంది. తేదీలు మర్చిపోవడం, దారులను గుర్తు పెట్టుకోలేకపోవడం, ఒక చోటకు వెళ్లి తిరిగొచ్చే దారిని గుర్తు తెచ్చుకోలేకపోవడం లాంటివన్నీ అల్జీమర్స్‌ లక్షణాలు. ఈ సమస్యను పూర్తిగా సరిదిద్దడం కష్టమే!

జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలివే...

హైపోథైరాయిడిజం: ఈ సమస్యలో జ్ఞాపకశక్తి తగ్గుతుంది.

విటమిన్‌ బి12: శాకాహారుల్లో ఈ విటమిన్‌ లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది.

లాంగ్‌ కొవిడ్‌: కొవిడ్‌ సోకిన వ్యక్తుల్లో దీర్ఘకాలం పాటు ఆ ప్రభావం కొనసాగి మతిమరుపు సమస్య వేధిస్తుంది.

మాదకద్రవ్యాలు: వీటి వాడకం వల్ల మెదడు ప్రభావితమై జ్ఞాపకశక్తి తగ్గుతుంది.

మందుల ప్రభావం: ఆందోళన, మానసిక కుంగుబాటు, నిద్రలేమి మందులతో మతిమరుపు తలెత్తుతుంది.

మద్యపానం: మద్యపాన ప్రియుల్లో బి6 విటమిన్‌ లోపించి, తత్ఫలితంగా మతిమరుపు మొదలవుతుంది.

మెదడులో గడ్డలు: మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రాల్లో క్యాన్సర్‌ రహిత గడ్డలు, క్యాన్సర్‌ గడ్డలు, క్షయ తలెత్తడం వల్ల జ్ఞాపకశక్తి లోపిస్తుంది.

సబ్‌డ్యురల్‌ హెమటోమా: మెదడు ఉపరితలంలో రక్తం గడ్డకట్టే సమస్య ఇది. పెద్దల్లో కనిపిస్తూ ఉంటుంది. తలకు చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు, అవి అంత తీవ్రమైనవి కాకపోయినా, వీరిలో సబ్‌డ్యురల్‌ హెమటోమా తలెత్తి, ఫలితంగా మతిమరుపు మొదలవుతుంది.

ధూమపానం: ఈ అలవాటు వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, బ్రెయిన్‌ స్ట్రోక్‌ లేదా స్మాల్‌ వెజెల్‌ ఇస్ఖీమియాలతో జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది అయితే ఇవన్నీ సరిదిద్దే వీలున్న సమస్యలు. వీటి మూలకారణాలను సరిదిద్దుకోగలిగితే కోల్పోయిన జ్ఞాపకశక్తిని తిరిగి పొందవచ్చు.

తలకు దెబ్బలు తగిలినప్పుడు...

తలకు తగిలే దెబ్బలు కంకషన్‌, కంట్యూషన్‌, లాసిరేషన్‌ అనే మూడు రకాలుగా ఉంటాయి.

కంకషన్‌: కంకషన్‌లో తలెత్తే మతిమరుపు తాత్కాలికమైనది. ఆ సమయంలో ఏం జరిగిందో, ఎక్కడున్నారో గుర్తుండదు. ఇలా స్వల్ప కాలపు మతిమరుపును వైద్య పరిభాషలో ల్యూసిడ్‌ ఇంటర్వెల్‌ అంటారు. ఇది తాత్కాలిక మతిమరుపు మాత్రమే! తర్వాత మళ్లీ వాళ్ల జ్ఞాపకశక్తి మునుపటిలాగే మెరుగుపడుతుంది

కంట్యూషన్‌: కంకషన్‌కూ లాసిరేషన్‌కూ మధ్య స్థితి. మెదడు ఉపరితలానికి దెబ్బ తగిలి రక్తం గూడు కట్టుకోడాన్ని కంట్యూషన్‌గా భావించాలి. ఆ స్థితిలో కూడా మతిమరుపు తలెత్తుతుంది. ఈ దెబ్బ తగిలిన వ్యక్తుల్లో 70ు మందికి సర్జరీ అవసరం ఉండదు. మందులతోనే పరిస్థితి మెరుగుపడుతుంది. కంట్యూషన్‌ స్థితి తీవ్రమైన సందర్భాల్లో మిగతా 30ు మందికి మాత్రమే సర్జరీ అవసరమవుతుంది.

లాసిరేషన్‌: మెదడు ఉపరితలంతో పాటు మెదడు లోపలి భాగం కూడా దెబ్బతినే సమస్య ఇది. ఈ సమస్యలో మతిమరుపు ఉంటుంది. 70ు మేరకు సర్జరీతో మతిమరుపు సమస్యను కూడా సరిదిద్దవచ్చు. అయితే సర్జరీ ఆలస్యమైనా, పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నా, సర్జరీ తదనంతరం కోలుకున్న తర్వాత కూడా మతిమరుపు సమస్య పూర్తిగా తొలగిపోకపోవచ్చు.

పసికందుల్లో మెదడు సమస్యలు

కొందరు పసికందుల్లో పుట్టుకతోనే సెరిబ్రల్‌ హైపోక్సియా సమస్య వెంటతెచ్చుకుంటారు. ఈ సమస్యలో మెదడు ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈ పిల్లలు ఎదిగిన తర్వాత కూడా వీరిలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. మద్యపానం, ధూమపానం అలవాట్లతో గర్భం దాల్చిన సందర్భాల్లో పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుడుతూ ఉంటారు. ఈ పిల్లల్లో మెదడు ఎదుగుదల కూడా పూర్తి స్థాయిలో ఉండదు కాబట్టి తర్వాతి కాలంలో మతిమరుపు సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది.

మతిమరుపు నియంత్రణ ఇలా...

  • ఫ ధూమపానం మానేయాలి.

  • ఫ మద్యపానంలో మితం పాటించాలి.

  • ఫ పోషకాహారం తీసుకోవాలి.

  • ఫ క్రమం తప్పక వ్యాయామం చేయాలి.

  • ఫ మధుమేహం, అధిక రక్తపోటులను అదుపులో ఉంచుకోవాలి.

  • ఫ క్రమం తప్పక ఆరోగ్యపరీక్షలు చేయించుకోవాలి.

  • ఫ రోజుకు 7 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి.

మెదడు పదును పెరిగేలా...

మెదడును ఎంత చురుగ్గా ఉంచుకుంటే జ్ఞాపకశక్తి అంత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి మెదడుకు నిరంతరం పని పెడుతూ ఉండాలి. అందుకోసం....

  • ఫ కొత్త అభిరుచిని అలవరుచుకోవాలి.

  • ఫ డిజిటల్‌ డిటాక్స్‌ అనుసరించాలి.

  • ఫ కథలు, వ్యాసాలు చదవడం, విశ్లేషించడం చేయాలి.

  • ఫ సామాజిక సంబంధాలు కొనసాగించాలి.

  • ఫ పజిల్స్‌, సుడోకులు సాధన చేయాలి.

  • ఫ ఖాళీగా కూర్చునే బదులు మెదడుకు పని కల్పించే పనులకు పూనుకోవాలి.

డాక్టర్‌ రంగనాధం

సీనియర్‌ న్యూరో సర్జన్‌,

యాస్టర్‌ ప్రైమ్‌ హాస్పిటల్‌,

హైదరాబాద్‌.

ఈ వార్తలు కూడా చదవండి..

నాగ పంచమి... జస్ట్ ఇలా చేయండి..

‘కాలేజీలు ఖాళీ’ అంటూ ప్రచారం.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 29 , 2025 | 05:36 AM