తొలి సువార్తికుడు
ABN, Publish Date - Jun 06 , 2025 | 04:58 AM
ఏసు క్రీస్తు జీవిత విశేషాలు కలిగిన గ్రంథాలను ‘కొత్త నిబంధన’గా పేర్కొంటారు. ఈ కొత్త నిబంధన గ్రంథావళికి శ్రీకారం చుట్టినవాడు మత్తయి. కొత్త నిబంధనలోని నాలుగు సువార్తలను తొలి గ్రంథాలుగా పరిగణిస్తారు....
దైవమార్గం
ఏసు క్రీస్తు జీవిత విశేషాలు కలిగిన గ్రంథాలను ‘కొత్త నిబంధన’గా పేర్కొంటారు. ఈ కొత్త నిబంధన గ్రంథావళికి శ్రీకారం చుట్టినవాడు మత్తయి. కొత్త నిబంధనలోని నాలుగు సువార్తలను తొలి గ్రంథాలుగా పరిగణిస్తారు.
ఈ సువార్తా చతుష్టయంలో ‘మత్తయి సువార్త’ మొదటి గ్రంథం. క్రీస్తు జననం మొదలు ఆయన పునరుత్థానం, మోక్షావరోహణల వరకూ అన్ని విషయాలు ఈ గ్రంథంలో నిక్షిప్తమయ్యాయి.
మత్తయి సువార్త రచన ప్రాథమికంగా గ్రీకు భాషలో జరిగింది. అది కూడా అప్పటి సాధారణ ప్రజల భాష అయిన కోయిన్ గ్రీకు భాషలో.
మత్తయి... ఇశ్రాయేలీయ కపెర్నాం ప్రాంతానికి చెందినవాడు. ఒక సంపన్నుడు. ప్రజలను బాధించి పన్నులు వసూలు చేసే వ్యక్తి. ఒక రోజు ఆ ప్రాంతానికి వచ్చిన ఏసు క్రీస్తు... మత్తయిని ‘లేవీ’ అని పిలిచాడు. ఆ చల్లటి పిలుపునకు పరవశించిన మత్తయి... తన సంపదలన్నీ విడిచిపెట్టాడు. ప్రభువును అనుసరించాడు. తన మనసు మార్చుకున్నాడు. ఏసుకు శిష్యుడై పోయాడు. తను రచించిన గ్రంథంతో క్రీస్తు జీవన రేఖలను లోకానికి అందించాడు.
మత్తయి సువార్త 29 అధ్యాయాల గ్రంథం. దీనిలో ఏసును ముఖాముఖిగా పటం గీసినట్టు అనిపిస్తుంది. క్లిష్టమైన వేదాంతంతో సహా అందులో ఎన్నో విషయాలున్నాయి. చక్కటి కథన శైలితో... సామాన్యులకు కూడా సులువుగా అర్థమయ్యేలా కథల రూపంలో, చక్కటి ఉపమానాలతో ఇది నడుస్తుంది. ఏసు శిష్యులను ఏర్పరచుకోవడం, కొండపై ప్రసంగించడం, అద్భుతాలు చేయడం, లోకం కోసం తనను తాను సమర్పించుకోవడం, శిష్యులను వాక్యబోధకు పంపడం లాంటి ఎన్నో అంశాలు ఈ సువార్తలో కనిపిస్తాయి.
సౌవార్తికులైన నలుగురిలో ఒక్కొక్కరికీ ఒక్కొక్క ప్రత్యేక చిహ్నం ఉండడం విశేషం. మత్తయికి పవిత్రమైనమ మహా మానవమూర్తి చిహ్నం. మిగిలినవారిలో మార్కుకు రెక్కల సింహం, లూకాకు వృషభం, యోహానుకు ఎగురుతున్న గ్రద్ద చిహ్నాలుగా ఉన్నాయి. ఈ చిహ్నాల గురించి ‘యెహెజ్కేలు’ గ్రంథంలో పేర్కొన్నారు.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్
9866755024
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 06 , 2025 | 04:58 AM