అంతరంగంతో వినాలి
ABN, Publish Date - Jun 13 , 2025 | 01:24 AM
మంచి ఉపమానాలతో, సామాన్యులకైనా చక్కగా అర్థమయ్యేలా హితవు చెప్పేవాడు ఏసుక్రీస్తు. ఆయన బోధల్లో వెల్లడించే ఎంతటి నిగూఢ సత్యమైనా సులువుగా అవగతమయ్యేది. అలాంటి కథల్లో ఇది ఒకటి. ‘‘ఆధ్యాత్మిక విషయాలు...
దైవమార్గం
మంచి ఉపమానాలతో, సామాన్యులకైనా చక్కగా అర్థమయ్యేలా హితవు చెప్పేవాడు ఏసుక్రీస్తు. ఆయన బోధల్లో వెల్లడించే ఎంతటి నిగూఢ సత్యమైనా సులువుగా అవగతమయ్యేది. అలాంటి కథల్లో ఇది ఒకటి. ‘‘ఆధ్యాత్మిక విషయాలు మామూలు చెవులతో వింటే గ్రహించడం కష్టం. వాటిని ఆత్మీయమైన అంతరంగంతో వినాలి’’ అంటూ ఈ కథను ఆయన ప్రారంభించాడు.
ఒక రైతు తన భూమిని దున్ని, విత్తనాలు చల్లడానికి సిద్ధమయ్యాడు. అతను విత్తనాలు చల్లుతూ ఉంటే... వాటిలో కొన్ని దారి పక్కన పడిపోయాయి. పక్షులు వచ్చి వాటిని మింగేశాయి. మరి కొన్ని మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి. అవి ఎండకు మాడి పోయాయి. ఇంకొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఆ పొదలు వాటిని ఎదగనివ్వకుండా చేశాయి. మిగిలినవి సారవంతమైన నేల మీద పడ్డాయి. అవి ఒక్కొక్కటీ ముప్ఫై మొదలు నూరింతల వరకూ ఫలించాయి.
అలాగే ఒక వ్యక్తి ఎంతోమందికి నీతిసారాన్ని బోధిస్తున్నప్పటికీ... వాటిని గ్రహించే విషయంలో వ్యత్యాసాలు ఉంటాయి. అందరూ వాటిని వింటారు. కానీ కొందరి మనసుల్లో తిష్ట వేసుకొని ఉన్న చెడ్డ బుద్ధి వాటిని పక్కకు నెట్టేస్తుంది. దారి పక్కన పడిన విత్తనాలు అలాంటివే. మరి కొందరి మనసుసుల్లో ఆ మాటలు బాగా నాటుకోవు. అవి రాతి నేల మీద పడిన విత్తనాల్లాంటివి. ఇంకొందరు ఆ బోధలను విన్నప్పటికీ... ఐహిక బంధాలు, ధన వ్యామోహాలు వాటిని అణచివేస్తాయి. ఇవి ముళ్ల పొదల్లో పడిన విత్తనాలు. బోధను చక్కగా విని, వాటిని బాగా అర్థం చేసుకొని, పాటించేవారు కొందరు ఉంటారు. వారు సారవంతమైన నేలలో పడిన విత్తనాల్లా ప్రయోజకులవుతారు. అందరూ ఆ విధంగా కావాలనేది ఏసు ఆకాంక్ష.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్
9866755024
ఇవి కూడా చదవండి
కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిపై సీఎం చంద్రబాబు ట్వీట్
మామా అన్నాడని దాడి.. కావాలిలో వైసీపీ నేత దాష్టీకం
Read latest AP News And Telugu News
Updated Date - Jun 13 , 2025 | 01:24 AM