ఇంజనీరింగ్ కాలేజీ ఎంపికలో ఏవి కీలకం
ABN, Publish Date - May 26 , 2025 | 05:24 AM
ఐఐటీ మినహా మిగిలిన ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ లేదంటే రాష్ట్ర స్థాయి సెట్‌లో సాధించిన ర్యాంకుతో కోరుకున్న కాలేజీలో సీటు వచ్చే విద్యార్థులకు...
ఐఐటీ మినహా మిగిలిన ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ లేదంటే రాష్ట్ర స్థాయి సెట్‌లో సాధించిన ర్యాంకుతో కోరుకున్న కాలేజీలో సీటు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి ర్యాంకు పొందిన వారికి పేరున్న సంస్థలోనే సీటు వస్తుంది. మధ్యస్థంగా ర్యాంకు వచ్చిన విద్యార్థులకే అసలైన కష్టం. కాలేజీ ఎంపికలో వారంతా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఒకసారి చేరిన తరవాత నాలుగేళ్లు చదవాలి. ఆపై సమున్నత కెరీర్ నిర్మించుకోవాలి. భావి జీవితం బాగా ఉండాలంటే, ముందస్తు కసరత్తు చాలా అవసరం. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏది మంచిదన్న ప్రశ్నతో ఈ ప్రక్రియ మొదలవుతుంది.
సాధారణంగా చాలా మంది విద్యార్థులు ఎంపిక విషయానికి వచ్చే సరికి ఓ పది ఇంజనీరింగ్ కాలేజీలను ఉజ్జాయింపుగా ఎంచుకొంటారు. ఆ క్రమంలోనే అక్కడి క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు జరిగిన తీరుతెన్నులు, వార్షిక ప్యాకేజీ వివరాలు తెలుసుకుంటారు. వాటికితోడు మరో రెండు అంశాలనూ పరిశీలించాలి. పేరున్న కాలేజీల్లో నాణ్యమైన విద్య లభిస్తుంది. ఏ కాలేజీలో ఎలాంటి విద్యను అందిస్తున్నారో, వాటి ప్రమాణాలు ఏమిటో క్యాంపస్ ప్లేస్‌మెంట్ కోసం వచ్చే సంస్థలకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. అసలు అలాంటి కాలేజీలకే వారు వెళ్తారు.
బ్రాండ్ ఇమేజ్
సాధారణంగా పేరున్న కాలేజీలు(బ్రాండ్ ఇమేజ్) అనగానే ఐఐటీ లాంటివి గుర్తుకు వస్తాయి. అక్కడ నాణ్యమైన విద్య లభిస్తుంది. పూర్వ విద్యార్థుల ప్రతిభ, అక్కడి ప్రొఫెసర్లు - విద్యార్థుల పరిశోధనలు ప్రామాణికంగా ఉంటాయి. మరికొన్ని కాలేజీలకూ బాగానే పేరుంటుంది. అవి ప్రామాణికాంశాలతో కాకుండా తమ ప్రచారంతో సంపాదించినవి. చిన్న కాలేజీలు, కొత్తగా ఏర్పాటైనవి ఆ స్థాయిలో ప్రచారానికి వ్యయం చేయలేవు. అందుకే కొన్ని చిన్న కాలేజీలు నాణ్యమైన విద్యను అందించినా ఆ స్థాయి ప్రచారాన్ని అందుకోలేక ‘వెనుకబాట’ పడతాయి. అందువల్లే కొత్త, చిన్న కాలేజీలు రిక్రూటర్లను పెద్దగా ఆకర్షించలేవు.
ఫ్యాకల్టీ
ఒక కాలేజీలోని ఫ్యాకల్టీ విద్యార్హతలు ఏమిటన్నది తప్పక పరిశీలించాలి. మొత్తం అధ్యాపకుల్లో పిహెచ్‌డి ఎంత మందికి ఉందన్నది తెలుసుకోవాలి. ఆ డిగ్రీ లేనప్పటికీ కొందరు మంచి అధ్యాపకులు ఉంటారు. అయితే, వారి సంఖ్య స్వల్పం. ఎం.టెక్ పూర్తి చేసిన వారు ఎందరున్నారన్నదీ పరిశీలించాలి. ఎందుకంటే, ఇటీవల చాలా కాలేజీల్లో బీ.టెక్ లేదంటే ఎమ్మెస్సీ పూర్తి చేసిన వారిని అధ్యాపకులుగా నియమిస్తున్నారు. అలాంటి కాలేజీల్లో నాణ్యమైన విద్యను ఆశించలేం. అధ్యాపకులు వారి ఉన్నత విద్యను ఎక్కడ పూర్తి చేశారన్నదీ చూడాలి. ప్రముఖ సంస్థల్లో విద్యాభ్యాసం చేసిన వారి నుంచి నాణ్యమైన విద్య తప్పకుండా లభిస్తుంది. అలాగే ఆ కాలేజీలో బీటెక్ వరకు చదివి, తదనంతరం ఉన్నత విద్యను ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పూర్తి చేసుకొని ఉంటే ఆలోచించాల్సిన అవసరం లేదు.
అధ్యాపకుల సంఖ్య
నాణ్యమైన విద్యను పొందేందుకు అధ్యాపక- విద్యార్థి నిష్పత్తి అతి ముఖ్యమైంది. విద్యార్థుల సగటు సంఖ్య తక్కువగా ఉండే తరగతి గదుల్లో నాణ్యమైన విద్య లభిస్తుంది. అంటే సరిపడా అధ్యాపకులున్న కాలేజీల్లో మాత్రమే తరగతి గదిలో విద్యార్థుల సగటు సంఖ్య తక్కువగా ఉంటుంది. అలా కాకుండా విద్యార్థుల సంఖ్యతో పొంతన లేకుండా అధ్యాపకులు తగ్గిన పక్షంలో అది వారి పని భారాన్ని పెంచుతుంది. దాంతో వారు స్వీయ పరిశోధనకు సమయం కేటాయించుకోలేరు. సరైన రీతిలో అసైన్‌మెంట్లను, ప్రాజెక్టు వర్క్‌ను విద్యార్థులకు ఇవ్వలేరు. అలాగే వాటికి గ్రేడింగ్ ఇవ్వడమనేది వారికి అత్యంత భారంగా మారుతుంది.
పరిశోధనల తీరుతెన్నులు..
కాలేజీ అధ్యాపకులు ఎవరైనా పరిశోధన చేస్తుంటే వారికి సదరు రంగాల్లో వస్తున్న మార్పులపై సరైన అవగాహన ఉంటుంది. వారు మంచి బోధనను అందిస్తారు. గొప్పగొప్ప సంస్థల్లో పరిశోధన కొనసాగిస్తున్న వారే కానవసరం లేదు. పరిశోధన రంగంలో ఉంటే బాగా బోధిస్తారని అంచనా వేయవచ్చు. పరిశోధనకు పూర్తిగా దూరంగా ఉండే వారి నుంచి మాత్రం ఉత్తమ బోధనను ఆశించడం కష్టమే. వీలైతే మొత్తం కాలేజీ కార్యక్రమాలను లేదా కనీసం తాము ఎంచుకోవాలని భావించే శాఖ పనితీరును చూడాలి. సెమినార్లు, వర్క్‌షా్‌పలు నిర్వహిస్తున్నారా అఏ విషయాన్నీ చూడాలి.
వసతులు
ఇది మరో ముఖ్యమైన అంశం. చేరాలనుకునే విభాగంలో ల్యాబ్‌ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆధునిక పరికరాలు ఉన్నాయా? ఉంటే విద్యార్థులంతా ఒకేసారి ప్రయోగాలు చేసేందుకు సరిపడా ఉన్నాయా? లేకుంటే ఏదో మొక్కుబడిగా డిమాన్‌స్ట్రేటర్ చేసి చూపిస్తారా అన్నవి తెలుసుకోవాలి. మొత్తంగా కాలేజీలో వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించాలి. విద్యార్థుల సంఖ్యతో పోల్చినప్పుడు సగటున ఎన్ని పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయో కనుక్కోవాలి. లైబ్రరీకి ‘ఈ-జర్నల్స్’ ఎన్ని అందుబాటులో ఉన్నాయి? ఎంత తలసరి బ్యాండ్ విడ్త్ ఉంది? తరగతి గదిలో కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, స్ర్కీన్‌లు, ఆడియో సౌకర్యం ఉందా? క్రీడల నిర్వహణ ఎలా ఉంది లాంటి అంశాలను కేవలం ఆ కాలేజీల వెబ్‌సైట్ల నుంచి మాత్రమే పొందలేం. అందుకోసం ప్రస్తుత లేదా తెలిసిన నమ్మకమైన పూర్వ విద్యార్థులతోనైనా సంభాషించడం ఉత్తమం. వీలైతే వాటి పరిశీలనకు ఆ కాలేజీని సందర్శించడం మరో మార్గం.
ఇవీ ముఖ్యమే
సంస్థ స్థితి: ఆ సంస్థకు యూనివర్సిటీ స్థాయి ఉండే పక్షంలో అక్కడ కొత్త ఆలోచనలకు, అకడమిక్ స్వేచ్ఛకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎంతకాలంగా మనుగడలో ఉందన్నదీ ముఖ్యమే.
క్యాంపస్: పూర్తి రెసిడెన్షియల్ క్యాంపస్ అయితే నేర్చుకొనే వాతావరణం అధికంగా ఉంటుంది.
కరికులమ్: సిలబ్‌సను తరచుగా మారుస్తున్నారా? అక్కడ ఎన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి? వంటివీ తెలుసుకోవాలి. కొన్ని సంస్థల్లో అనేక కోర్సులుంటాయి. అయితే బోధన బాగా ఉండకపోవచ్చు.
పాఠ్య ప్రణాళిక ఎంపిక: అక్కడ ఎన్ని ఎలక్టివ్స్ అందుబాటులో ఉన్నాయి? అవి ఉద్యోగాలకు పనికి వచ్చేవా లేక ఉన్నత విద్యాభ్యాసానికి ఉపకరించేవా? ఆ సంస్థలోని విద్యార్థులు ఎక్కువగా ఉన్నత విద్యకు వెళ్తున్నారంటే - అక్కడ మంచి అభ్యసన వాతావరణం ఉన్నట్లే!
పోటీ పరీక్షలు: అక్కడి విద్యార్థులు గేట్/క్యాట్ లాంటి పరీక్షల్లో చూపిన ప్రతిభనూ గమనించాలి.
మనుగడ: ఆ కాలేజీ పది పదిహేనేళ్లుగా మనుగడలో ఉంటే, దాని పూర్వ విద్యార్థుల సంఘం ఉందా? ఉంటే మంచిది. లేదంటే.. ఆ కాలేజీని వారే పట్టించుకోనప్పుడు మనం ఎంచుకోవాల్సిన అవసరం ఉందా? అనేది నిర్ణయించుకోవాలి.
క్యాంపస్ ప్లేస్‌మెంట్: దీనిని పరిగణించాల్సిందే. కానీ ఈ ఒక్కదాన్నే పరిగణనలోకి తీసుకోవడం మాత్రం సరికాదు.
విద్యార్థుల కార్యక్రమాలు: నాలుగేళ్లు కేవలం తరగతి గది, ల్యాబ్‌లకే అంకితం కాలేము. కాబట్టి ఆ కాలేజీలో ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి.
విద్యార్థి భాగస్వామ్యం: కళాశాల నిర్వహణలో విద్యార్థులకు భాగస్వామ్యం కల్పిస్తే - అది వారిలోని నాయకత్వ లక్షణాలను వెలికితీస్తుంది. కాబట్టి దానినీ పరిశీలించాలి.
ఇంత సమాచారం కనుగొనడం చాలా కష్టమని మీరు భావించవచ్చు. అయితే అన్ని కాలేజీల సమాచారం సేకరించాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ఎంచుకోవాలని భావించే కాలేజీల గురించి సేకరిస్తే చాలు. అప్పుడు అదంత కష్టం కాబోదు. కాలేజీ వెబ్‌సైట్ కూడా ఈ విషయంలో తోడ్పడుతుంది. అందులో సమాచారం మరీ తక్కువగా ఉంటే ఆలోచించాలి. ప్రతి ఒక్కరిలో సహజ మేధస్సు అంతర్లీనంగా ఉంటుంది. అది వికసించేందుకు భౌతిక వాతావరణం తోడవ్వాలి. కుటుంబ నేపథ్యం, ఉత్తమ సహచర్యం, లక్ష్యం, ఆ దిశలో పయనం లాంటివి వికాసానికి తోడ్పడుతాయి తప్ప ఏదో ఒక కాలేజీలో విద్యాభ్యాసం చేయడం మూలంగానే అన్నీ సాధ్యం కావు. అలా అని కాలేజీ ప్రాధాన్యం తగ్గించలేం. మంచి కాలేజీలోనే విద్యార్థి ప్రతిభ వికసిస్తుందన్నది నిగ్గుతేలిన నిజం. విద్యార్థి దశలోనే అవగాహన, విశ్లేషణ, అన్వయం అనేవి అలవడతాయి.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 26 , 2025 | 05:24 AM