హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవచ్చా
ABN, Publish Date - Jun 05 , 2025 | 06:06 AM
హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకుతుంది. ఈ వ్యాధి లైంగిక క్రీడ ద్వారా సంక్రమిస్తుంది. తీవ్రమైన లక్షణాలు కనబరచని ఈ వ్యాధిని...
కౌన్సెలింగ్
డాక్టర్! నాకు 42 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలున్నారు. ఇప్పుడు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా టీకా తీసుకోవచ్చా?
ఒక సోదరి, హైదరాబాద్
హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకుతుంది. ఈ వ్యాధి లైంగిక క్రీడ ద్వారా సంక్రమిస్తుంది. తీవ్రమైన లక్షణాలు కనబరచని ఈ వ్యాధిని మన సహజసిద్ధ రోగనిరోధక వ్యవస్థ సమర్థంగానే అడ్డుకోగలుగుతుంది. అయితే 16 నుంచి 18 ఏళ్ల వయసున్న యువతుల్లో ఈ ఇన్‌ఫెక్షన్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు 3 నుంచి 7 సంవత్సరాల సమయం పట్టవచ్చు. హెచ్‌పివి వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌తో పాటు యోని క్యాన్సర్, జననాంగ, మలద్వార క్యాన్సర్లు, నోటి, గొంతు, పురుషాంగ క్యాన్సర్లు కూడా రావచ్చు. జెనైటల్ వార్ట్స్ కూడా తలెత్తవచ్చు. హెచ్‌పివి వ్యాక్సిన్ ఈ క్యాన్సర్లన్నింటినీ సమర్థంగా అడ్డుకుంటుంది. ఈ వ్యాక్సిన్‌ను తొమ్మిదేళ్ల బాలికల నుంచి 45 ఏళ్ల మహిళల వరకూ అందరూ తీసుకోవచ్చు. 9 - 14 ఏళ్ల బాలికలు ఈ టీకా రెండుసార్లు తీసుకోవాలి. మొదటి టీకా తీసుకున్న ఆరు నుంచి 12 నెలల లోపు రెండో టీకా తీసుకోవాలి. 15 - 45 ఏళ్ల యువతులు, మహిళలు మూడు సార్లు తీసుకోవలసి ఉంటుంది. మొదటి టీకా తీసుకున్న రెండు నెలలకు రెండవ టీకా, తర్వాత ఆరు నెలలకు మూడవ టీకా తీసుకోవాలి.
టీకా తీసుకున్నప్పటికీ...
ఈ టీకాలు పెళ్లికి ముందే తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌లో అన్ని రకాల హెపివి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ దక్కదు. కాబట్టి సురక్షితమైన లైంగిక పద్ధతులు పాటిస్తూ, కండోమ్స్ వాడుకోవడం వల్ల అన్ని విధాలా రక్షణ దక్కుతుంది. అలాగే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను కనిపెట్టే పాప్‌స్మియర్ పరీక్ష కూడా క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. 45 ఏళ్ల మహిళలు కూడా నిర్భయంగా మూడు డోసుల హెచ్‌పివి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు స్ర్కీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 50 ఏళ్ల వయసు వరకూ ప్రతి మూడు సంవత్సరాలకోసారి, ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకోసారి... ఇలా 60 వరకూ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. పిల్లలు కలిగిన మహిళలు, భవిష్యత్తులో పిల్లలను వద్దనుకుంటే ఇన్‌ఫెక్షన్లను అడ్డుకునే కండోమ్స్ వాడుకోగలిగితే హెచ్‌పివి నుంచి శాశ్వత రక్షణ పొందే వీలుంటుంది.
డాక్టర్ ప్రమత శిరీష
కన్సల్టెంట్ అబ్‌స్ట్రెట్రిక్స్ అండ్ ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,
బర్త్‌రైట్ బై రెయిన్‌బో, సికింద్రాబాద్
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 06:06 AM