How to Help Kids: ఒత్తిడికి లోనవుతున్నారా
ABN, Publish Date - Jul 09 , 2025 | 04:54 AM
ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దలే కాదు పిల్లలు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు...
పేరెంటింగ్
ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దలే కాదు పిల్లలు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
బడికి వెళ్లే పిల్లలు రోజూ.... హోంవర్క్, పరీక్షలు, ట్యూషన్లు అంటూ చదువులోనే పూర్తిగా నిమగ్నమై ఉంటున్నారు. సెలవు రోజుల్లో కూడా స్మార్ట్ ఫోన్ చూస్తూ అందులోనే ఆటలు ఆడుతూ సమయం గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల తెలియకుండానే పిల్లల్లో ఒత్తిడి ప్రారంభమవుతుంది. అలా కాకుండా రోజూ సాయంత్రం పిల్లల చేత ఆటలు ఆడించాలి. ఆటల్లో భాగంగా పరుగెత్తడం, నవ్వడం, అరవడం వల్ల పిల్లల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని దూరంచేసి సంతోషాన్ని కలిగిస్తాయి. సైకిల్ తొక్కడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం లాంటి వాటిని పిల్లలకు అలవాటు చేయాలి.
సొంత పనుల్లో మునిగిపోయి పట్టించుకోకపోతే పిల్లల్లో ఒంటరితనం అనే భావన మొదలవుతుంది. ఇది క్రమంగా ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి పిల్లలతో తరచూ మాట్లాడుతూ ఉండాలి. వాళ్లతో స్నేహపూర్వకంగా మెలగాలి. బడి సంగతుల గురించి అడిగి తెలుసుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయాన్ని పిల్లలతో గడపాలి.
పిల్లలకు రోజూ పోషకాహారం పెట్టాలి. అందులో పాలు, నెయ్యి, తాజా పండ్లు, గింజలు, ఆకుకూరలు, కూరగాయలు ఉండేలా చూడాలి. వీటివల్ల శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తి పెరిగి ఒత్తిడి దరిచేరదు. అప్పుడప్పుడూ డార్క్ చాక్లెట్ తెచ్చి ఇస్తుంటే పిల్లల సంతో షానికి అవధులు ఉండవు.
పిల్లలపై కోపాన్ని ప్రదర్శించకూడదు. అలాగని అతిగా గారాబం చేయకూడదు. ప్రతి విషయాన్ని వాళ్లకు అర్థమయ్యే రీతిలో ఓపికగా వివరించి చెప్పాలి. సందర్భానుసారం చక్కగా ప్రవర్తించినప్పుడు పిల్లలను మనస్ఫూర్తిగా ప్రశంసించాలి. దీనివల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్నపాటి పొగడ్తల వల్ల మెదడులో డోపమైన్ స్థాయి పెరుగుతుంది. దీంతో పిల్లల మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఆటలు, సంగీతం, పాటలు పాడడం, నృత్యం చేయడం, చిన్న కథలు రాయడం లేదా చెప్పడం, బొమ్మలు వేయడం ఇలా ఆసక్తి ఉన్న అంశాన్ని నేర్చుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లలకు మానసిక ఆనందం కలుగుతుంది. ఒత్తిడీ దరిచేరదు.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
రాష్ట్రపతుల పేర్లు తప్పుగా పలికిన ఖర్గే.. క్షమాపణకు బీజేపీ డిమాండ్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 04:54 AM