How Art Therapy Transforms: అభిరుచితో అధిగమించా
ABN, Publish Date - Jul 30 , 2025 | 03:05 AM
మతిస్థ్థిమితం లేని పిల్లగా ముద్ర పడిన ఒక అమ్మాయి, చిత్రకళతో మానసిక ఆరోగ్యం మీద పైచేయి సాధించింది. అంతటితో ఆగిపోకుండా, ‘ది రెడ్ డోర్’ అనే ఆన్‌లైన్ వేదిక ద్వారా...
మతిస్థ్థిమితం లేని పిల్లగా ముద్ర పడిన ఒక అమ్మాయి, చిత్రకళతో మానసిక ఆరోగ్యం మీద పైచేయి సాధించింది. అంతటితో ఆగిపోకుండా, ‘ది రెడ్ డోర్’ అనే ఆన్‌లైన్ వేదిక ద్వారా తనలాంటి మానసిక రోగులకు బాసటగా నిలుస్తోంది. ఆమే పూణేకు చెందిన 22 ఏళ్ల రేష్మా వల్లియప్పన్. స్కిజోఫ్రేనియా(ఎవరో ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు ఊహించుకునే మానసిక రుగ్మత)ను అధిగమించి కళారంగం వైపు సాగిన రేష్మా ప్రయాణం ఆమె మాటల్లోనే...
‘‘మా నాన్నది తమిళనాడు. అమ్మది మహారాష్ట్ర. ఇంట్లో నిరంతరం గొడవలు జరుగుతుండేవి. అమ్మతో నాకు ఏదో ఒక విషయంలో వాదులాట జరిగేది. దాంతో ప్రశాంతత లేకుండా పోయేది. మరోపక్క ఏదో భయం నన్ను వెంటాడుతుండేది. ఎవరో పక్కన ఉన్నట్లు, మాట్లాడుతున్నట్లు అనిపించేది. దాంతో నరకం అనుభవించా. వీటికితోడు పాఠశాలలో సీనియర్ అబ్బాయిల నుంచి లైంగిక వేధింపులు. వీటన్నిటినీ తప్పించుకోవాలని 14 ఏళ్ల వయసులోనే ఇంట్లో నుంచి పారిపోయా. అమ్మాయి అని తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని అబ్బాయిలా జుట్టు కత్తిరించుకుని, టీ షర్ట్, ప్యాంట్ వేసుకున్నా. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అత్యాచారానికి బలయ్యాను. ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థంకాక చాలా రోజులు నాలో నేనే కుమిలిపోయా. తిరిగి ఇంటికి వచ్చాక కూడా మానసికంగా కుంగిపోయా.
జబ్బు బయటపడిందిలా...
వయసు పెరుగుతోంది. కానీ గత అనుభవాల నేపథ్యంలో భయం నన్ను వెంటాడుతూనే ఉంది. నాలో నేనే మాట్లాడుతుండడం చూసి స్నేహితులు నవ్వుకునేవారు. వెక్కిరించేవారు. ఈ అవమానాలు, అవహేళనలు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించా. కానీ బతికి బయటపడ్డా. ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఆస్పత్రిలో ఉన్నప్పుడే నాకు స్కిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధి ఉందని వైద్యులు గుర్తించారు. దీని నుంచి బయటపడేందుకు చాలా మందులు వాడాను. ఆ మందుల వలన రోజుకు దాదాపు 20 గంటలు నిద్రపోయేదాన్ని. ఎన్నో ప్రతికూల ప్రభావాలు కూడా ఎదుర్కొన్నా. చివరికి మందులన్నీ మానేయాలని నిర్ణయించుకున్నా. అప్పుడు మా నాన్న తోడుగా నిలిచారు. నాలో నాకు వినిపించే మాటలే నన్ను బొమ్మలు వేయమని ప్రోత్సహించాయి. దాంతో మందులను పక్కన పెట్టి నాకిష్టమైన చిత్రకళ మీద దృష్టి సారించి, నా ఆలోచనలకు బొమ్మల రూపం ఇవ్వడం ప్రారంభించా. ఆ బొమ్మలను గమనించిన మా నాన్న బొమ్మలు వేయడానికి అవసరమైన వస్తువులను కొనుక్కొచ్చి ఇచ్చారు. కాలం గడిచే కొద్దీ చిత్రకళతో నాలో మార్పు వచ్చింది. స్కిజోఫ్రేనియా నుంచి బయటపడ్డా. నేను గీసిన చిత్రాలను పూణే, ఢిల్లీ, నేపాల్‌లలో జరిగిన పలు ఎగ్జిబిషన్లలో ప్రదర్శించా.
అవగాహన కల్పించేందుకు..
అసలు చాలామందికి స్కిజోఫ్రేనియా గురించి తెలియదు. ఈ సమస్య ఉన్నవారిని పిచ్చివాళ్లని చూసినట్లు చూస్తారు. అందుకే నాలా మానసిక సమస్యలతో బాధపడేవారికి అండగా నిలవాలని మానసిక రుగ్మతలపై అవగాహన కల్పించేందుకు ‘ది రెడ్ డోర్’ అనే వేదికను నెలకొల్పా. ఇందులో వర్క్‌షా్‌పలు, నిఫుణుల ద్వారా మానసిక సమస్యలపై అవగాహన కల్పిస్తా. అంతే కాకుండా నా చిత్రకళలను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించి, అక్కడి వారితో నా అనుభవాలు పంచుకుంటా. ఇలా ప్రజల్లో మానసిక రుగ్మతలపై అవగాహన కల్పిస్తున్నా. ప్రజలు మా వద్దకు వచ్చి రుగ్మతల గురించి తెలుసుకోవాలని వేచి ఉండకుండా, మేం వారి వద్దకు వెళ్లి వివరిస్తాం. అలాగే మానసిక సమస్యలున్న వారు, వాటిని అధిగమించిన వారు తమ అనుభవాలను పంచుకునేందుకు ‘మైండ్ ఆర్క్స్’ అనే ఆన్‌లైన్ వేదిక ఏర్పాటు చేశా. ‘మై టీరస్ ఆఫ్ లైఫ్’, ‘ట్విన్ బుదా’్ధ.. వంటి నా ప్రసిద్ధ చిత్రకళలు నేను ఎదుర్కొన్న గాయాలను, పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. ఇక స్కిజోప్రేనియా నేపథ్యంలో చిత్రీకరించిన ‘ఏ డ్రాప్ ఆఫ్ సన్‌షైన్’ అనే డాక్యుమెంటరీలో నటించా. ఈ డాక్యుమెంటరీకి బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ విభాగంలో జాతీయ అవార్డు కూడా దక్కింది.’’
అభిరుచితో సాధ్యమే!
‘‘అభిరుచులు మానసిక సమస్యలను దూరం చేయడంలో ఎంతో ఉపయెగపడతాయి. ఇష్టమైన పని చేస్తే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఈ ప్రశాంతత మరే చికిత్స తీసుకున్నా లభించదు. నాకు ఇష్టమైన చిత్రకళ నాకు ఓ థెరపీలా పని చేసింది. అయితే అందరికీ బొమ్మలు గీయడం ఇష్టం ఉండకపోవచ్చు. ఎవరికి నచ్చిన పని వారు చేసి ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. కానీ అసలు అన్నింటి కన్నా పెద్ద సమస్య ఏంటంటే చాలా మంది తమకు మానసిక సమస్య ఉందని ఒప్పుకోవడానికి గానీ, ఎవరికీ చెప్పడానికి గానీ ఇష్టపడరు. తెలిస్తే అందరూ ఏమనుకుంటారో, ఏమంటారో అనే భయం. కానీ నిజానికి సమస్యలను పంచుకున్నప్పుడే అందరిలో మానసిక సమస్యల గురించి ఉన్న అపోహలు, భయాలు దూరమవుతాయి. సరైన చికిత్స అందుతుంది.’’
ఇవి కూడా చదవండి..
సిందూర్ శపథాన్ని నెరవేర్చాం.. అందుకే ఈ విజయోత్సవం
కశ్మీర్‌లో అంతా ప్రశాంతతే ఉంటే పహల్గాం దాడి ఎలా జరిగింది: ప్రియాంక
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం
Updated Date - Jul 30 , 2025 | 03:05 AM