Room Fresheners: ఇంట్లో ఆరోగ్యకరమైన పరిమళాలు
ABN, Publish Date - Aug 19 , 2025 | 04:17 AM
ఆహ్లాదకరమైన వాసనలు వెదజల్లే రూమ్ ఫ్రెష్‌నర్స్‌లో ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన రసాయనాలుంటాయి.
వానాకాలం తేమ, తడి వల్ల ఇంట్లో ముక్కిపోయిన వాసనలు పేరుకుపోతూ ఉంటాయి. వీటిని వదిలించుకోవడం కోసం రూమ్ ఫ్రెష్‌నర్స్ వాడుకుంటున్నారా? అయితే వాటి దుష్ప్రభావాల పట్ల అవగాహన పెంచుకుని, ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించడం నేర్చుకుందాం!
ఆహ్లాదకరమైన వాసనలు వెదజల్లే రూమ్ ఫ్రెష్‌నర్స్‌లో ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన రసాయనాలుంటాయి. ఇవి ఊపిరితిత్తులను నష్టపరచడమే కాకుండా హార్మోన్లను అస్తవ్యస్థం చేసేంత ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి. వీటిని దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల ప్రత్యేకించి పెంపుడు జంతువులు, పిల్లలకు, శ్వాసకోస సమస్యలున్న వారికీ రెట్టింపు చేటు జరుగుతుంది. రూమ్ ఫ్రెషనర్స్‌లో దాగి ఉన్న ప్రమాదాలు ఏవంటే...
అస్థిర సేంద్రీయ సమ్మేళనాలు: గాల్లో కలిసిపోయే పరిమళాలు వెదజల్లే అస్థిర సేంద్రీయ సమ్మేళనాలు రూమ్ ఫ్రెషనర్స్‌లో ఉంటాయి. ఇవి గదులను పరిమళభరితం చేసినప్పటికీ, వీటిలోని అసిటోన్, ఇథనాల్, లైమోనిన్ రసాయనాలు కళ్లు, గొంతు, ఊపిరితిత్తులను ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలం పాటు వీటికి బహిర్గతం అవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ అస్థిర సేంద్రీయ సమ్మేళనాలు గాలితో ప్రతిచర్య జరిపి ఫార్మాల్డిహైడ్ అనే క్యాన్సర్ కారకంగా మారతాయి.
హార్మోన్లు అస్తవ్యస్థం: సువాసన ఎక్కువ సమయం పాటు నిలిచి ఉండడం కోసం రూమ్ ఫ్రెష్‌నర్స్‌లో థాలేట్స్ కలుపుతారు. ఈ రసాయనాలు అంతఃస్రావ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తాయి. వీటికి క్రమం తప్పక బహిర్గతం కావడం వల్ల, పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా గర్భిణులు, పసికందులకు వీటితో ప్రమాదం ఎక్కువ. ‘సహజసిద్ధ’ లేదా ‘అన్‌సెంటెడ్’ అని పేర్కొనే ఉత్పత్తుల్లో సైతం థాలేట్స్ ఉంటాయి.
ఉబ్బసం: ఉబ్బసం లేదా శ్వాసకు సంబంధించిన సమస్యలున్నవారు రూమ్ ఫ్రెష్‌నర్స్‌కు బహిర్గతమైనప్పుడు, వారి లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. వాటిలోని పరిమళాలు, రసాయనాల వల్ల దగ్గు, పిల్లికూతలు, శ్వాసలో ఇబ్బందులు తలెత్తవచ్చు. వీటికి అల్ప స్థాయిలో బహిర్గతమైనప్పటికీ, పిల్లలు, పెద్దల్లో ఉబ్బసం ముప్పు పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
ఇంటి కాలుష్యం: బయటి కాలుష్యంలాగే ఇంటి కాలుష్యం కూడా ప్రమాదకరమైనదే! బెంజీన్, టోలిన్, ఫార్మాల్డిహైడ్‌లను ఇళ్లలో విడుదల చేయడం ద్వారా రూమ్ ఫ్రెష్‌నర్స్ ఇంటిని కలుషితం చేస్తాయి. ఇంట్లోకి ధారాళంగా గాలి చొరబడే వీలు లేనప్పుడు, ఈ రసాయనాలు గాల్లో అదృశ్యమైపోకుండా, అక్కడే నిలిచి ఉండి, వాతావరణాన్ని కలుషితం చేస్తాయి.
పెంపుడు జంతువులు: గాల్లో కలిసే రసాయనాలు పెంపుడు జంతువులకు రెట్టింపు ప్రమాదకరమైనవి. కుక్కలు, పిల్లులు ప్రత్యేకించి పక్షులు ఈ రసాయన సమ్మేళనాల ప్రభావానికి ఎక్కువగా గురవుతాయి. తుమ్ములు, దగ్గులు, చర్మపు దురదలు లేదా ప్రవర్తనల్లో మార్పులు పెంపుడు జంతువుల్లో కనిపిస్తాయి.
ప్రత్యామ్నాయాలు: రూమ్ ఫ్రెష్‌నర్స్ చెడు వాసనలను కప్పేస్తాయి తప్ప, వాటిని తొలగించవు. బూజు, పొగ, పెంపుడు జంతువుల విసర్జకాల వాసనలు ఇంట్లోని గాలి నాణ్యతను దెబ్బతీస్తాయి. ఇవన్నీ దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. కాబట్టి దుర్వాసనలకు మూల కారణాలను కనిపెట్టే ప్రయత్నం చేయాలి. గాలి, వెలుతురు ధారాళంగా చొరబడేలా కిటికీలు, తలుపులను తెరచి ఉంచాలి. వెడల్పాటి పాత్రలో నీళ్లు నింపి, గులాబీలు లాంటి సువాసన వెదజల్లే పూలతో నింపుకుంటే, గదిలో పరిమళాలు పరుచుకుంటాయి. లెమన్, లావెండర్, యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్స్, బేకింగ్ సోడా, నీళ్లు కలిపి, రూమ్ ఫ్రెష్‌నర్‌లా స్ర్పే చేసుకోవచ్చు.
Updated Date - Aug 19 , 2025 | 04:18 AM