Sawan Dutta: ఆరోగ్యకరమైన గుండె కోసం..
ABN, Publish Date - May 19 , 2025 | 04:29 AM
సంగీతం ద్వారా పర్యటనలు, వంటలు, వాతావరణం వంటి విషయాలను వినోదాత్మకంగా ప్రజలకు అందిస్తున్న సావన్ దత్తా, ఇప్పుడు గుండె పోటుపై అవగాహన కల్పించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. గుండె ఆరోగ్యానికి సహాయపడే వంటల్ని పాటల రూపంలో పరిచయం చేస్తున్నారు.
సావన్ దత్తా భాష సంగీతం. పర్యటనలు, కమ్మని వంటలు, వాతావరణ మార్పులు... ఇలా ఏ అంశాన్నైనా పాటగా మార్చి, సంగీతం కూర్చి ప్రేక్షకులకు అందించడం ఆమెకు సరదా. వ్లోగర్‌గా సోషల్ మీడియాలో ప్రఖ్యాతి పొందిన ఈ కోల్‌కతా మహిళ ఇప్పుడు గుండె పోటు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు... గుండె ఆరోగ్యానికి దోహదం చేసే రెసిపీలను పరిచయం చేస్తున్నారు. తన కొత్త ప్రయాణం గురించి సావన్ ఏం చెబుతున్నారంటే...
‘‘సంగీతం అంటే నాకు ప్రాణం.. దానికి దోహదం చేసింది మా తాతయ్య. నాకు మూడేళ్ళ వయసున్నప్పుడు ఆయన ఒక చిన్న హార్మోనియం బహుమతిగా ఇచ్చారు. దానికి రంగురంగుల మెట్లుండేవి. మేలుకొని ఉన్నంతసేపు నచ్చినట్టు దాన్ని వాయించడమే నా పని. నేను పుట్టింది పెరిగింది కోల్‌కతాలో. మా కుటుంబంలో అందరూ సంగీతాభిమానులే కాదు, కొద్దోగొప్పో సంగీతంలో ప్రవేశం ఉన్నవాళ్ళు కూడా. మా అమ్మ హవాలియన్ గిటార్ వాయించేది. సహజంగానే నా జీవితంలో కూడా సంగీతం విడదీయలేని భాగమైపోయింది.
ప్రయోగాలంటే ఇష్టం..
నేను పూర్తిస్థాయి సంగీత కళాకారిణిగా మారడానికి పునాది నాకు పదకొండేళ్ళ వయసున్నప్పుడు పడింది. మ్యూజీషియన్స్ కావాలనే ఆలిండియా రేడియో ప్రకటన చూసి, అమ్మ ప్రోత్సాహంతో అప్లై చేశాను. హవాలియన్ గిటార్‌లో ఆడిషన్ ఇచ్చి, ‘రెగ్యులర్ పెయిడ్ లైవ్ పెర్ఫార్మర్’గా ఎంపికయ్యాను. నా తొలి సంపాదనను అప్పుడే అందుకున్నాను. ఆ తరువాత ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్’లో డిగ్రీ చేస్తున్నప్పుడు... సొంతంగా రాక్‌బాండ్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. అలాగే పలు వాయిద్యాల్లో శిక్షణ పొంది నైపుణ్యం సాధించాను. అనేక మ్యూజిక్ బాండ్స్‌తో కలిసి దేశ విదేశాల్లో నా సంగీతాన్ని వినిపించాను. నిరంతరం ప్రేక్షకుల ముందు ఉండడం, సంగీతంతో కొత్త కొత్త ప్రయోగాలు చేసి వారికి వినిపించడం నాకు ఇష్టం. దానికి సోషల్ మీడియా చక్కటి సాధనం. ప్రదర్శనలు లేని సమయంలో... నా సొంత స్టూడియోలో తీసిన వీడియోలను అప్‌లోడ్ చేస్తూ వచ్చాను. సాధనతో సాధించలేనిది ఏదీ లేదంటారు. మ్యూజిక్ కంపోజింగ్, పాటలు రాయడం, పాడడం... ఇలా అన్నీ నేనే చెయ్యడం క్రమంగా అలవాటయిపోయింది. వంటల తయారీ, పర్యటనల్లో అనుభవాలు, వాతావరణ మార్పుల గురించి అవగాహన, కొవిడ్ వచ్చినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ఇలా ప్రతి అంశాన్నీ నేను సంగీతాన్ని మేళవించి, వినోదభరితంగా చెప్పడం ప్రేక్షకులకు నచ్చింది. మంచి గుర్తింపు సైతం వచ్చింది. హాయిగా సాగిపోతున్న నా జీవితంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
తెలిసింది చాలా తక్కువ...
అయిదేళ్ళ క్రితం... నా భర్త అరుణ్‌కు తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది. ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. అప్పటివరకూ హాయిగా తిరిగిన అరుణ్‌కు హఠాత్తుగా ఆలా కావడం నన్ను చాలా భయపెట్టింది. గుండె సమస్యల గురించి, వాటికి దారి తీసే కారణాల గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకున్నాను. గుండె ధమనుల్లో పూడికలు ఏర్పడినా... ఎలాంటి లక్షణాలు ముందుగా కనిపించవు. గుండె పోటు వచ్చేవరకూ ఈ సమస్య ఉందని తెలుసుకోవడం కష్టం. యుక్తవయస్కులు కూడా ఎక్కువ సంఖ్యలో దీని బారిన పడుతున్నారు. కానీ ఈ విషయంలో ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. నా భర్తకు ఈ సమస్య వచ్చేదాకా నాకు కూడా దాని గురించి పెద్దగా తెలీదు. నా పరిజ్ఞానం పెంచుకోవడానికి ఎన్నో గంటల సేపు కార్డియాలజిస్టులతో మాట్లాడాను. శస్త్ర చికిత్సల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులతో చర్చించాను. తద్వారా అరుణ్ ఆరోగ్యం కోసం అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకున్నాను. ఈ క్రమంలో మనం తీసుకొనే ఆహారానికి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో అర్థమయింది. గుండె ఆరోగ్యం, గుండె పోటు నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అవసరం అనిపించింది. అలా ‘హార్ట్ హెల్త్ ఫర్ డమ్మీస్’ అనే నా తాజా ఇన్‌స్టాగ్రామ్ సిరీ్‌సకు బీజం పడింది.
రుచిగా, ఆరోగ్యంగా...
ఈ సిరీ్‌సలో నేను సంగీతాన్ని ప్రధానంగా తీసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే గుండె ఆరోగ్యం అనేది సీరియస్ విషయం. దాన్ని పాట పరిధిలోకి కుదించడం కష్టం. అలాగే ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ నిడివి పూర్తి పాటకు సరిపోదు. కాబట్టి వీక్షకులు నా నుంచి ఆశించే వినోదం వీటిలో కాస్త తక్కువే. కానీ అంతకన్నా విలువైన విషయాలను వీటిలో చెబుతున్నాను. పసుపు, వెల్లుల్లి, నీరుల్లి, నట్స్, సీడ్స్, ఆకు కూరలు, మిల్లెట్స్... ఇలా గుండెను ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పదార్థాలు మన వంటింట్లోనే ఉన్నాయి. నూనెల వాడకం తగ్గించడం, కొలెస్ట్రాల్ ఎక్కువ కాకుండా చూసుకోవడం లాంటివి గుండె ఆరోగ్యానికి కీలకం. మనకు ఇష్టమైన రుచులను ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో చెప్పే వంటలను పరిచయం చేస్తున్నాను. ‘హార్ట్ హెల్దీ’ చికెన్ బిరియానీ మొదలు కాఫీ వరకు అనేక వంటకాలను వాటి తయారీ విధానాలతో సహా ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నాను.
ఎప్పటికప్పుడు కొత్త సమాచారంతో...
ఈ కొత్త ప్రయాణం చాలా ఆసక్తిదాయకంగా సాగుతోంది. ఎందుకంటే... వీక్షకులకు మరింత అవగాహన కల్పించడం కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నాను. మెడికల్ జర్నల్స్ నుంచి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తదితర సంస్థల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాను. గుండె సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? గుండె పోటు వస్తే అత్యవనసరంగా తీసుకోవాల్సిన చర్యలేమిటి? అనారోగ్యం బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శస్త్రచికిత్స జరిగితే... ఆ తరువాత అనుసరించాల్సిన పద్ధతులేమిటి?... ఇలా ఎన్నో విషయాలను చెబుతున్నాను. మరోవైపు నా సంగీత యాత్ర కూడా కొనసాగుతోంది. అయితే మునుపటికన్నా ఇప్పుడు నా జీవితం మరింత అర్థవంతంగా అనిపిస్తోంది.’’
పసుపు, వెల్లుల్లి, నీరుల్లి, నట్స్, సీడ్స్, ఆకు కూరలు, మిల్లెట్స్... ఇలా గుండెను
ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పదార్థాలు మన వంటింట్లోనే ఉన్నాయి. నూనెల వాడకం తగ్గించడం, కొలెస్ట్రాల్ ఎక్కువ కాకుండా చూసుకోవడం లాంటివి గుండె ఆరోగ్యానికి కీలకం. మనకు ఇష్టమైన రుచులను ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగో చెప్పే వంటలను పరిచయం చేస్తున్నాను.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 19 , 2025 | 04:35 AM