True Vision meditation: అంతటా ఆయనే
ABN, Publish Date - Jul 18 , 2025 | 03:14 AM
ఏ సుఖశాంతుల కోసం అన్వేషిస్తున్నామో అవి తమలోనే ఉన్నాయనే విషయం చాలామందికి తరచుగా అర్థం కాదు. శాంతిని పొందాలంటే ప్రత్యేకంగా ఏదో చెయ్యాలనుకుంటారు. అందువల్లనే నా దగ్గరకు వచ్చేవారిలో చాలామంది...
చింతన
ఏ సుఖశాంతుల కోసం అన్వేషిస్తున్నామో అవి తమలోనే ఉన్నాయనే విషయం చాలామందికి తరచుగా అర్థం కాదు. శాంతిని పొందాలంటే ప్రత్యేకంగా ఏదో చెయ్యాలనుకుంటారు. అందువల్లనే నా దగ్గరకు వచ్చేవారిలో చాలామంది ‘‘మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని అడుగుతూ ఉంటారు. కానీ సమస్త సృష్టిని రచించిన ఆ దివ్యశక్తి హస్తం తమపై ఉందని వారు గుర్తించడం లేదు. నక్షత్రాలను, సూర్య చంద్రులను, ఈ భూమిని సృష్టించినవాడి ఆశీర్వాదం అందరి వెంటా ఉంది. మీలోనికి శ్వాస వస్తూ, పోతున్నంతకాలం ఆయన చెయ్యి మీ తలపై ఉన్నట్టే! కాబట్టి ఏ ఇతర ఆశీర్వాదం మీకు అవసరం లేదు. అన్నీ మీ సమక్షంలోనే ఉన్నాయి. కానీ మీ లోపలి నేత్రాలను తెరిచినప్పుడు మాత్రమే సత్యమేమిటో మీకు గోచరిస్తుంది. ఏదో చేయడం వల్ల శాంతి చేకూరదు. చాలామందికి ఈ విషయంలో ఎన్నో అపోహలు ఉంటాయి. ఏ శాంతికోసం మీరు అన్వేషిస్తున్నారో... అది బయట ఎక్కడో లేదనీ, మీలోనే ఉందనే విషయాన్ని హృదయంతో మీరు గ్రహించలేనప్పుడు... మీకు అన్నీ ఉన్నప్పటికీ ఏదీ సాధించలేరు.
తప్పు అక్కడే ఉంది...
నేను మీకొక చిన్న కథ చెబుతాను. పూర్వం ఒక వ్యక్తి ఒక కొండమీద చిన్న పూరి గుడిసెలో ఉండేవాడు. పొద్దున్నే పక్షుల కిలకిలరావాలను విని నిద్రలేచి, తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఒక రోజు అతను లేచేసరికి ఏదీ కనిపించడం లేదు. ‘సూర్యుడు ఇంకా ఉదయించడం లేదు’ అనుకున్నాడు. అంతా చీకటిగా ఉందని అగ్గిపుల్ల వెలిగించాడు. కానీ ఆ వెలుగు కూడా కనిపించలేదు. బయటకు వెళ్ళాక ఎండ తగిలింది, కానీ సూర్యుడు కనిపించలేదు. ‘ఈ రోజు సూర్యుడు ఎందుకో వెలుగు ఇవ్వడం లేదు’ అనుకున్నాడు. ఇంతలో ఒక సాధువు అటువైపు వెళ్తూ... ఇతన్ని పలకరించాడు. ఆయనకు తన సమస్యను ఈ వ్యక్తి చెప్పుకున్నాడు. ‘‘సూర్యుడి వెలుగు లేకపోవడం కాదు, నీ కళ్ళలో ఏదో లోపం ఉంది’’ అన్నాడు ఆ సాధువు. అప్పుడు తప్పు ఎక్కడ ఉందో ఆ వ్యక్తికి తెలిసింది. అతనికి కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం వల్లనే సూర్యుడి వెలుగు కనిపించలేదు. అంతా చీకటిగా అనిపించింది.
ఆ సంగతి మరువకండి...
మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో భగవంతుడితో ‘‘నువ్వంటూ ఉంటే నా ముందుకు రా!’’ అని సవాలు చేసే ఉంటారు. కానీ కష్టనష్టాలు ఎదురైనప్పుడు మాత్రమే మనం భగవంతుడివైపు చూస్తాం. అంతకుముందు మన దైనందిన కార్యకలాపాలలో లీనమై ఉంటాం. ఈ ప్రపంచంలో భగవంతుడు లేని చోటంటూ ఏదైనా ఉందేమో చెప్పగలరా? ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. మీరు అంతర్ముఖంగా చూస్తే... అక్కడ మీకు ఆయన కనిపిస్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు... ఆయన సదా మనతోనే ఉన్నప్పటికీ ఆయనను మనం ఎప్పుడూ చూడలేదని, అందుకే ఈ ప్రాపంచిక జంజాటాలనే భారాన్ని మోస్తున్నామని మనకు బోధపడుతుంది. ఆయనను గుర్తించలేకపోతే... ఉత్త చేతులతో వచ్చిన మనం ఉత్త చేతులతోనే మిగిలిపోతాం. ఈ ప్రపంచంలో ‘జీవితం’ అనే పువ్వు నుంచి మకరందాన్ని సేకరించే మార్గాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలియకపోతే ఇలాగే ఉండిపోయి ఆకలితో అలమటిస్తాం. మీ జీవితంలో ఏది జరిగినప్పటికీ... మీరు ఎంతో సౌభాగ్యశీలులు అనే విషయం మాత్రం ఎన్నటికీ మరువకండి.
ప్రేమ్‌రావత్
9246275220
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్
Updated Date - Jul 18 , 2025 | 03:22 AM