Islamic Wisdom: రాజుకన్నా గొప్పవారు
ABN, Publish Date - Jul 11 , 2025 | 04:58 AM
‘‘ధార్మిక విశ్వాసం కలిగిన విద్వాంసులను అనుసరించండి. ఎందుకంటే వారు ఇహ-పరలోకాలకు కాంతి లాంటివారు. భూమిపైన, సముద్రాల్లో పయనిస్తున్న వ్యక్తులు నక్షత్రాల ద్వారా మార్గాన్ని...
సందేశం
‘‘ధార్మిక విశ్వాసం కలిగిన విద్వాంసులను అనుసరించండి. ఎందుకంటే వారు ఇహ-పరలోకాలకు కాంతి లాంటివారు. భూమిపైన, సముద్రాల్లో పయనిస్తున్న వ్యక్తులు నక్షత్రాల ద్వారా మార్గాన్ని తెలుసుకుంటారు. ఒకవేళ నక్షత్రాలు మాయమైపోతే... వాటిని అనుసరించేవారు మార్గం తెలియక తప్పిపోతారు. ఆకాశంలో ఉన్న ఆ నక్షత్రాల్లాంటివారే భూమిపై ఉన్న విద్వాంసులు, పండితులు’’ అని అంతిమ దైవప్రవక్త మహమ్మద్ చెప్పారు.
జ్ఞానులకు, పండితులకు పూర్వం ప్రజల్లో ఎంత విలువ ఉండేదో వివరించే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఖలీఫా అయిన హారూన్ రషీద్ తన సైన్యంతో వచ్చి ఒక నగరంలో బస చేశాడు. అదే సమయంలో విద్వాంసుడైన హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ అక్కడకు వస్తున్నారనే వార్త నగరమంతా వ్యాపించింది. ప్రజలు సంతోషించారు. నగర శివార్లలోనే బిన్ ముబారక్‌కు సాదరంగా స్వాగతం పలకడానికి తండోపతండాలుగా బయలుదేరారు. ఆయనను ప్రత్యక్షంగా చూడాలనే కోరిక వారిని అక్కడకు చేర్చింది. ఖలీఫాకు బానిసగా ఉన్న ఒక మహిళ దీన్ని గమనించింది. ‘‘ఏం జరుగుతోంది?’’ అని ఇక్కడ ఉన్నవారిని అడిగింది. ‘‘బిన్ ముబారక్‌గారు వస్తున్నారు. ఆయనను స్వాగతించడానికి జనం పోటీ పడుతున్నారు’’ అని వారు చెప్పారు. అప్పుడు ఆ బానిస స్త్రీ ‘‘ఖలీఫా హారూన్ రషీద్ కోసమైతే ప్రజలను బలవంతంగా రప్పించవలసి వచ్చేది. ఇక్కడ ఎలాంటి బలవంతమూ లేదు. కేవలం చిన్న వార్తతోనే నగరమంతా బిన్ ముబారక్ కోసం కదిలి వచ్చింది. దైవసాక్షిగా... అసలైన రాజు అంటే ఆయనే’’ అంది.
ఇలాంటి మరో సంఘటన... ఖాజా హసన్ బస్రీ గొప్ప జ్ఞానిగా ప్రాచుర్యం పొందాడు. ఆయన అంటే ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలు చూపించేవారు. ఆ రోజుల్లో బస్రాకు గవర్నర్‌గా క్రూరుడు, కఠినాత్ముడు అయిన హజ్జాజ్ బిన్ యూసఫ్ ఉండేవాడు. పుర ప్రముఖుడు, పండితుడు అయిన ఖాలిద్ బిన్ సఫ్వాన్‌తో ఒక రోజు యూసఫ్ మాట్లాడుతూ ‘‘బస్రా నగరానికి సర్దార్ ఎవరు?’’ అని అడిగాడు. తన పేరును ఖాలిద్ చెబుతాడని అతను ఆశించాడు. కానీ దానికి భిన్నంగా ‘‘హసన్ బస్రీ’’ అని ఖాలిద్ సమాధానం ఇచ్చాడు. యూసఫ్ ఆశ్చర్యపోతూ ‘‘అదెలా సాధ్యం? హసన్ బానిస వంశానికి చెందినవాడు కదా?’’ అన్నాడు.
‘‘హసన్ ప్రజల నాయకుడు. ధర్మం విషయంలో ప్రజలకు ఆయన అవసరం ఉంది కానీ... ప్రాపంచిక విషయాల్లో ఆయనకు ఎవరి అవసరమూ లేదు. సామాన్యులు కావచ్చు, ధనవంతులు కావచ్చు... హసన్ ప్రసంగాలు వినడానికి, తద్వారా జ్ఞానం పొందడానికి అందరూ తహతహలాడుతారు. ఆయనతో సన్నిహితంగా ఉండాలనుకుంటారు’’ అని చెప్పాడు ఖాలిద్. అసలైన నాయకుడంటే ఎవరో, ప్రజలు ఎటువంటివారిని గౌరవిస్తారో బిన్ యూస్‌ఫకు అర్థమయింది. అందుకే ‘విద్వాన్ సర్వత్ర పూజ్యతే’’ అన్నారు పెద్దలు.
మహమ్మద్ వహీదుద్దీన్
ఇవి కూడా చదవండి
ఇన్‌కం ట్యాక్స్ 2025 కొత్త రూల్స్.. ఈ అప్‌డేట్ ప్రక్రియ తప్పనిసరి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 11 , 2025 | 04:58 AM