Swati Yarru Turns to Organic Farming: సేంద్రియమే ఆరోగ్యరక్ష
ABN, Publish Date - Oct 23 , 2025 | 03:10 AM
పంటల సాగులో పురుగుల మందులను, రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తే ప్రాణాలకే ముప్పు. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట....
‘‘పంటల సాగులో పురుగుల మందులను, రసాయన ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తే ప్రాణాలకే ముప్పు. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట’’ అంటున్నారు యర్రు స్వాతి.గుంటూరు జిల్లాకు చెందిన ఆమె బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డారు. కలుషితమైన పదార్థాలే దీనికి కారణమని గుర్తించి, సేంద్రియ సేద్యాన్ని చేపట్టారు.నాణ్యమైన ఉత్పత్తులతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాదు... ఇటీవల ప్రధాని మోదీ ప్రశంసలనూ అందుకున్న స్వాతి స్ఫూర్తిమంతమైన ప్రయాణం ఇది.
‘‘ఇంట్లో వండేవి, తినేవీ అన్నీ సహజసిద్ధమైనవే అయి ఉండాలి... ఇది పదేళ్ల క్రితం నేను తీసుకున్న నిర్ణయం. నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని వైద్యులు నిర్ధారించిన తరువాత... దానికి కారణం ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం చేశాను. దిగ్ర్భాంతికరమైన వాస్తవాలు ఎన్నో తెలిశాయి. మనకు వచ్చే అనారోగ్యాలలో చాలావాటికి మనం తీసుకునే ఆహారమే కారణం. వ్యవసాయంలో పురుగు మందులను మితిమీరి వాడడం, విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వినియోగంతో దాదాపు ప్రతీ పదార్థమూ కలుషితమవుతోంది. ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. నాకు వచ్చిన బెయిన్ ట్యూమర్‌కు కూడా ఇదే కారణమని గుర్తించాను. ప్రకృతి సాగుతో భూసార పరిరక్షణ జరుగుతుంది. అది భవిష్యత్ తరాలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది. అందుకే సేంద్రియ పద్ధతితో వ్యవసాయం చేపట్టి, సహజసిద్ధమైన పంటలు పండించాలని నిర్ణయించుకున్నాను. నా భర్త యర్రు సత్యనారాయణ నా ఆలోచనను ప్రోత్సహించారు.
ఖర్చు తక్కువ... నాణ్యత ఎక్కువ
వ్యవసాయం చేయడం సవాళ్లతో కూడుకున్న పని. ఎన్నో వ్యయ ప్రయాసను భరించి సాగు చేసినా... ప్రకృతి కరుణిస్తే తప్ప రైతు గట్టెక్కే పరిస్థితి లేదు. పంటలను మార్కెట్ యార్డుకు తరలించినా గిట్టుబాటు ధరకు హామీ లేదు. కనీసం పెట్టుబడి అయినా దక్కితే చాలనే దుస్థితి ఉంది. దీంతో పెద్ద పెద్ద రైతులే సాగు చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో... అరకొర చదువు, అంతంత మాత్రం ఆర్థిక స్తోమత ఉన్న నా నాలాంటి ఒక మహిళకు ఇది సాహసం అనే చెప్పాలి. అయినా ధైర్యం చేశాను. మాది గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామం. మాకున్న రెండు ఎకరాల మాగాణితో పాటు... కౌలుకు తీసుకున్న పది ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేపట్టాను. జిల్లా రైతు సాధికార సంస్థ సహకారాన్ని తీసుకున్నాను. నవారా, బ్లాక్‌రైస్, మైసూర్ మల్లిక, కాలాబట్టి తదితర దేశీయ వంగడాలను సాగు చేయడం ప్రారంభించాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు బదులు జీవామృతం, కషాయాలు వినియోగించాను. వాటిని నేనే స్వయంగా తయారు చేస్తాను. ఇలా తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన పంటలు పండిస్తున్నాను. నా సాగు పద్ధతులు జాతీయ స్థాయిలో వ్యవసాయ నిపుణులు, రైతుల దృష్టిని ఆకర్షించాయి. మా ప్రాంతంలో పర్యటించిన బ్రెజిల్ బృందం... నన్ను ప్రత్యేకంగా అభినందించింది.
మరపురాని జ్ఞాపకం
మా జిల్లాలో సేంద్రియ సాగు చేపట్టిన మొదటి మహిళా రైతును నేనే. మా కుటుంబం మొత్తం ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో ఉంది. మాకు కావలసిన కాయగూరలు, ఆకుకూరలు మా పొలం గట్ల మీద, ఇంటి పెరట్లో పండిస్తున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా... ఆరోగ్యకరమైన ఆహారంతో బ్రెయిన్ ట్యూమర్‌ను నేను జయించాను. నా కృషికి గుర్తింపుగా... ఇటీవల ఢిల్లీలో... ‘ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ సంస్థ’ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘పీజీఎస్ నేచురల్ ఫామ్ సర్టిఫికెట్’ను అందుకున్నాను. ప్రధానితో ముఖాముఖిగా మాట్లాడడం, ప్రశంచలు పొందడం నా జీవితంలో మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
Updated Date - Oct 23 , 2025 | 03:10 AM