Parvati Tirkie: సంస్కృతి పరిరక్షణ కోసం
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:01 AM
సొంతవాళ్లే ‘చదువు అవసరమా’ అన్నారు. అయినా సరే చదువుకుని అధ్యాపకురాలిగా మారారు జార్ఘండ్‌కు చెందిన పార్వతీ తిర్కీ. అంతేకాకుండా కవితలతో ఆదివాసీ సంస్కృతిని కాపాడాలని...
సంకల్పం
సొంతవాళ్లే ‘చదువు అవసరమా’ అన్నారు. అయినా సరే చదువుకుని అధ్యాపకురాలిగా మారారు జార్ఘండ్‌కు చెందిన పార్వతీ తిర్కీ. అంతేకాకుండా కవితలతో ఆదివాసీ సంస్కృతిని కాపాడాలని కృషి చేస్తున్నారు. ఆదివాసీల జీవిత నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూ రాసిన ‘ఫిర్ ఉగ్నా’ అనే కవితా సంకలనానికిగాను ప్రతిష్ఠాత్మక సాహిత్య అకాడమీ యువ పురస్కారం- 2025కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్వగతమిది...
‘‘మాది జార్ఘండ్ గుమ్లా జిల్లాలో ఓ మారుమూల ప్రాంతం. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీవిరమణ పొందారు. అమ్మ గృహిణి. నాకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ఓ సోదరుడు ఉన్నారు. పాఠశాల విద్య మా ప్రాంతంలో పూర్తి చేశాను. ఉత్తరప్రదేశ్‌లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో హిందీలో గ్రాడ్యుయేషన్, పీజీ , పీహెడ్‌డీ పూర్తి చేశా. మాది ఆదివాసీ కుటుంబం. జాతరకు తప్పనిసరిగా హాజరు కావాలి. కాబట్టి చిన్నప్పుడు బడికి వెళ్తా అన్న ప్రతిసారీ, ‘నువ్వు బడికి వెళ్తే, జాతరుకు ఎవరెళ్తారు?’ అని అమ్మమ్మ అంటుండేది. అయినా వీలున్న ప్రతిసారీ జాతరకు హాజరవుతూ, అమ్మమ్మను నొప్పించకుండా చదువును కొనసాగించా! ప్రస్తుతం రాంచీలోని రామ్ లఖన్ కళాశాలలో హిందీ అస్టిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా. వర్సిటీలో చదువుకునేటప్పుడే ఆదివాసీ సంస్కృతిని అందరికీ తెలిసేలా చేయాలని నిర్ణయించుకున్నా. చిన్నప్పుడు ప్రతి ఏడాది సర్కుల్ అనే ఆదివాసీ పండుగ సమయంలో మా తాతతో కలిసి పాటలు పాడేదాన్ని. ఆ పాటల ద్వారానే నాకు మా కురుఖ్ సంస్కృతి గురించి తెలిసింది. మా పెద్దల మాటలు, పాటల ద్వారా నేర్చుకున్న ఆదివాసీ సంస్కృతిని అందరికీ తెలిసేలా చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా. అందులో భాగంగానే కవితా సంకలనం ‘ఫిర్ ఉగ్నా’ రాశా. ఇందులో కురుఖ్ తెగ జీవన శైలి, వారి సంస్కృతి, సంప్రదాయలను తెలియజేసే ప్రయత్నం చేశా. ఇటీవల ‘ఫిర్ ఉగ్నా’కుగాను సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికయ్యాను. అకాడమీ నుంచి ఫోన్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఇలాంటి ఒక పురస్కారం వస్తుందని నేను ఊహించలేదు. రావాలని ఆశించనూ లేదు. కానీ ఈ గుర్తింపు వలన ఆదివాసీ సంస్కృతి గురించి మరింత మందికి తెలుస్తుందని అనుకుంటున్నా.
సాహిత్యం మీద మక్కువ
నాకు చిన్నప్పటి నుంచి కూడా సాహిత్యం అంటే చాలా ఇష్టం. అందుకే కవితలు రాస్తుంటా. మా తెగల్లో మేమే పాటలు కంపోజ్ చేసి పాడుతుంటాం. అలానే ‘ఫిర్ ఉగ్నా’ రాశా. ఇందులోని కవితల్లో ఆదివాిసీ తెగలకు నీరు, అడవి, అందులోని జంతువులతో ఉన్న అనుబంధాన్ని వివరించా. అడవులు నీటిని పరిరక్షించాల్సిన అవసరాన్ని కూడా తెలియజేశా. అడవి అనేది ఆదివాిసీలకు ఓ వనరు మాత్రమే కాదనీ, వారికి దానితో విడదీయలేని అనుబంధం ఉంటుందని అందులో వివరించే ప్రయత్నం చేశా. మా ఆదివాసీ ప్రాంతంలోనే కాదు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ నివసించాను. అలా ఇప్పటి వరకు 40-50 గ్రామాలు తిరిగాను. ఆ క్రమంలో ఎంతో మందిని కలిశాను. వారి మాటలు, అక్కడి వాతావరణం మొదలైనవన్నీ ఈ కవితలు రాయడానికి నాకొక ప్రేరణగా మారాయి. వారిని కలవకపోతే నేనీ కవితలు రాయలేకపోయేదాన్నేమో అనిపిస్తోంది.
భాషలు అంతరించకూడదు..
అనేక ఆదివాసీ భాషలు, సంస్కృతులు అంతరించిపోతున్నాయి. ‘ధూంకుడియా’ అనేది మా సంప్రదాయ అభ్యాస వ్యవస్థ. ఇది ప్రస్తుతం అంతరించిపోయింది. దాంతో ఆ శైలిలో మేం సాహిత్యాన్ని సృష్టించలేకపోతున్నాం. ఇలాగే ఇంకా కొన్ని తెగలకు ఇలాంటి అభ్యాస విధానాలు ఉన్నాయి. వీటి ద్వారా ఆదివాసీలు వారి జ్ఞానాన్ని, జీవన విధానాలను తెలుసుకుంటారు. ఈ ఆదివాిసీ భాషలు, సంస్కృతుల గురించి విద్యా సంస్థల్లో నేర్పరు. కాబట్టి వాటిని కాపాడాలి. అందు కోసమే నేను కృషి చేస్తున్నా. ప్రస్తుతం మన చుట్టూ సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా జరుగుతున్న మార్పుల గురించి కూడా కవితలు రాస్తున్నాను.’’
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
రాష్ట్రపతుల పేర్లు తప్పుగా పలికిన ఖర్గే.. క్షమాపణకు బీజేపీ డిమాండ్
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 05:01 AM