Art For Livelihood: బతుకు చిత్రాన్ని మార్చుకుంది
ABN, Publish Date - Jul 31 , 2025 | 01:30 AM
ఆమె నేపథ్యం... పేదరికం. భారం దించుకొందామని తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లికి బలవంతం పెట్టినా... తలొగ్గలేదు. సామాజిక కట్టుబాట్లను కాదని... మధ్యలో ఆగిన చదువును కొనసాగించి... నేడు తన కాళ్లపై...
ఆమె నేపథ్యం... పేదరికం. భారం దించుకొందామని తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లికి బలవంతం పెట్టినా... తలొగ్గలేదు. సామాజిక కట్టుబాట్లను కాదని... మధ్యలో ఆగిన చదువును కొనసాగించి... నేడు తన కాళ్లపై తాను నిలబడింది. రచన కుమారి... 23 ఏళ్ల ఈ యువతి చిత్రకళలో వినూత్న పంథాను చొప్పించి... విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగి... మరికొందరికి ఉపాధి మార్గమైంది.
‘‘ఊహ తెలిసినప్పటి నుంచీ ఒకటే కల... బాగా చదువుకోవాలి. నేను, నా కుటుంబం ఉన్నతంగా బతకాలి. కానీ పేదరికం ప్రతి అడుగులోనూ అవరోధంగా మారింది. దానికి సామాజిక కట్టుబాట్లు తోడై... చదువుకోవాలన్న నా ఆకాంక్షను మధ్యలోనే తుంచేశాయి. ఉత్తరప్రదేశ్ బహ్రైజ్ జిల్లా చితాన్‌పూర్వ గ్రామం మాది. అమ్మానాన్న చిన్న చిన్న పనులు చేసేవారు. కానీ వారి సంపాదన ఏమాత్రం సరిపోయేది కాదు. తినడానికి తిండి లేక పస్తులున్న సందర్భాలు ఎన్నో. అవాంతరాలు ఎన్ని ఎదురైనా ఏ రోజూ నేను బడి మానేయలేదు. పదో తరగతిలోకి వచ్చేసరికి... ఉన్నట్టుండి ఇంట్లోవాళ్లు బడి మాన్పించేశారు. కారణం... స్కూలు కోసం వేరే ఊరు వెళ్లాలి. పెరుగుతున్న అమ్మాయిని అంత దూరం పంపించడానికి మా కమ్యూనిటీ అభ్యంతరం చెప్పింది. నేను ఎంత మొర పెట్టుకున్నా మా పెద్దలు కూడా ఒప్పుకోలేదు. అలాగని ఊళ్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలో చదివించే స్థోమత మాకు లేదు. చేసేది లేక ఇంటికే పరిమితమయ్యాను.
పెళ్లి తప్పించుకొని...
పదిహేడేళ్ల వయసులో అమ్మానాన్న నాకు పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నారు. నేను ససేమిరా అన్నాను. ఇప్పుడే పెళ్లి వద్దని, ఒకరిపై ఆధారపడకుండా జీవించే స్థాయికి ఎదగాలని కోరుకొంటున్నానని చెప్పాను. అవేవీ వాళ్లు వినలేదు. పెళ్లి చేసుకోవాల్సిందేనని బలవంతం పెట్టారు. ఎన్నో ఘర్షణల తరువాత... నా దారిన నన్ను వదిలేశారు. అదే సమయంలో ‘అగాఖాన్ ఫౌండేషన్’ (ఏకేఎఫ్) వారు మా ఊళ్లో పలు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారని తెలిసింది. వారిని సంప్రతించాను. గోధుమ గడ్డితో రూపొందించే కళాకృతులు నన్ను బాగా ఆకర్షించాయి. అందులో శిక్షణ తీసుకున్నా.
కళాకృతులు చేసి...
శిక్షణ పూర్తయ్యాక మా ఊళ్లోని మార్కెట్ ప్రాంతంలో ఒక చిన్న షాపు అద్దెకు తీసుకున్నా. అందులో గోధుమ గడ్డితో తయారైన కళాకృతుల విక్రయం ప్రారంభించాను. చూడగానే విభిన్నంగా ఉండటంతో మార్కెట్‌కు వచ్చిపోయే వారందరినీ నా చిత్రాలు విశేషంగా ఆకర్షించాయి. దాంతో కొద్ది కాలంలోనే చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా దీని గురించి తెలిసింది. ఊహించిన దానికంటే తక్కువ సమయంలోనే మంచి డిమాండ్ ఏర్పడింది. ఖర్చులు పోనూ కొంత మిగులు కనిపించింది. ఇది నాలో ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చింది.
నాలాంటివారి కోసం...
చిత్రాల ద్వారా ఆదాయం పెరగడంతో కొత్త ఆలోచన వచ్చింది. నాలానే పేదరికంలో మగ్గుతూ, ఏ ఆధారం లేక ఇబ్బందులు పడుతున్న ఔత్సాహిక బాలికలకు ఈ కళలో శిక్షణ ఇవ్వాలని అనుకున్నా. అదే సమయంలో చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నా. బీఏలో చేరా. ప్రస్తుతం మూడో సంవత్సరం. చదువుకొంటూనే షాపు చూసుకొంటున్నా. ఆసక్తి గల అమ్మాయిలకు చిత్రకళ నేర్పిస్తున్నా. వారి నుంచి నామమాత్రపు ఫీజు తీసుకొంటున్నా. వారానికి ఆరు రోజులు శిక్షణ ఇస్తున్నా. పన్నెండు నుంచి పదిహేడేళ్ల మధ్య వయసుగల ఇరవైమంది బాలికలు ఇప్పుడు నా దగ్గర నేర్చుకొంటున్నారు. నెల రోజుల ఈ శిక్షణ పూర్తిచేసుకున్న కొందరు తమ చిత్రాల ద్వారా ఆదాయం కూడా పొందుతున్నారు. ఇలాంటి మార్పే నేను కోరుకున్నది. ఆడపిల్ల ఒకరిపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలి. కట్టుబాట్ల పేరుతో తల్లిదండ్రులు వారి ఆశయాలు, ఆలోచనలను మొగ్గలోనే చిదిమేయకుండా... ప్రోత్సహిస్తే అసాధ్యమనేది ఏదీ ఉండదని అర్థం చేసుకోవాలి.’’
రెండు వందలకు పైనే...
గత ఏడాది షాపు ప్రారంభించాను. ఇప్పటివరకు నేను తయారు చేసిన రెండు వందలకు పైగా చిత్రాలు అమ్ముడయ్యాయి. ఒక్కొక్కటీ వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు ధర పలికింది. ఒక చిత్రం రూపొందించడానికి పది గంటలకు పైనే సమయం పడుతుంది. గోధుమ గడ్డిని సన్నని తీగల్లా చేసి, దాన్ని వస్త్రంపై చిత్రంలా తీర్చిదిద్దాలి. ఎంతో శ్రమతో కూడుకున్న పని ఇది. నా ప్రతిభను, విజయాలను గుర్తించిన అగాఖాన్ ఫౌండేషన్ వారు నన్ను తమ సంస్థలో శిక్షకురాలిగా నియమించారు. ఈ జీతం, నా షాపుపై వచ్చే ఆదాయంతో మా కుటుంబం ఇప్పుడు ఎంతో సంతోషంగా జీవిస్తోంది.
ఇవి కూడా చదవండి
రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..
అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
Updated Date - Jul 31 , 2025 | 01:30 AM