సంతానోత్పత్తి సాధనాల సారం ఎంత
ABN, Publish Date - Jul 15 , 2025 | 01:56 AM
వేర్వేరు ఊళ్లలో ఉద్యోగాలు, ఉరుకులు పరుగుల జీవితాలు... కారణాలు ఏవైనా, దంపతుల మధ్య లైంగిక దూరం పెరుగుతోంది. దాంతో గర్భం దాల్చే వెసులుబాట్లను వెతుక్కోవలసిన అవసరత ఏర్పడి, పలు రకాల...
గర్భధారణ
వేర్వేరు ఊళ్లలో ఉద్యోగాలు, ఉరుకులు పరుగుల జీవితాలు... కారణాలు ఏవైనా, దంపతుల మధ్య లైంగిక దూరం పెరుగుతోంది. దాంతో గర్భం దాల్చే వెసులుబాట్లను వెతుక్కోవలసిన అవసరత ఏర్పడి, పలు రకాల సంతానోత్పత్తి పరికరాలు వాడుకలోకొచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న ఆ ఉత్పత్తుల ప్రామాణికత ఏ మేరకు? వాటితో లాభనష్టాలేంటి? వైద్యులేమంటున్నారు? తెలుసుకుందాం!
వ్యక్తిగత కారణాలతో పెళ్లి, పిల్లలను వాయిదా వేసే ధోరణి పెరిగింది. దాంతో ప్రత్యేకించి మహిళల్లో అండాల కొరత ఏర్పడి, గర్భధారణ అవకాశాలు క్షీణిస్తున్నాయి. దురలవాట్లు, ఒత్తిళ్లు, పర్యావరణ మార్పులు, ఆహారపుటలవాట్లు కూడా స్త్రీపురుషుల్లోని పునరుత్పత్తి వ్యవస్థలను నీరుగారుస్తున్నాయి. దాంతో పెళ్లవగానే పిల్లలు పుట్టే పరిస్థితులు అడుగంటాయి. ఇది నాణేనికి ఒక పార్శ్వ్యం మాత్రమే! ఉదయం లేచినప్పటి నుంచి ఇంటి పనులు, ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేకుండా గడపడం, రాత్రయ్యేటప్పటికి అలసిపోయి పడక మీద వాలిపోవడం పరిపాటైపోయింది. వారాంతాల్లో తీరిక దొరికినా, ఆ సమయాన్ని ఇతరత్రా పనులకు కేటాయిస్తూ ఉండడంతో, దంపతులు దాంపత్య జీవితానికి సరిపడా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. వేర్వేరు ఊళ్లలో ఉద్యోగాలు చేస్తూ, దీర్ఘ సెలవుల్లోనే కలుసుకునే దంపతుల పరిస్థితి మరీ దారుణం. ఇన్ని ప్రతికూలతలు నెలకొని ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ అనుకూలించి గర్భం దాల్చడం కష్టమే! కాబట్టే గర్భధారణ అవకాశాలను మెరుగు పరచడం కోసం పలు రకాల పరికరాలు అందుబాటులోకొచ్చాయి. అవేంటంటే...
ఓవ్యులేషన్ కిట్
ఊపిరి పీల్చుకోలేని పనులతో సతమతమయ్యే మహిళలకు నెలసరిని గుర్తుపెట్టుకుని, అండం విడుదలయ్యే రోజును కచ్చితంగా కనిపెట్టే తీరిక ఉండకపోవచ్చు. ఇలాంటి మహిళల కోసం అందుబాటులోకొచ్చినదే ఓవ్యులేషన్ కిట్. ఇది ప్రెగ్నెన్సీ కిట్ లాంటిదే! సాధారణంగా అండం విడుదలకు ముందు ల్యుటినైజింగ్ అనే హార్మోన్ మూత్రంలోకి విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి మూత్రాన్ని పరీక్షించడం ద్వారా అండం విడుదలను కనిపెట్టే గ్యాడ్జెట్ ఇది. ఈ కిట్‌లో ఉండే స్ట్రిప్స్‌ను మూత్రంలో ముంచి, మారిన రంగును బట్టి తర్వాతి 24 గంటల్లో అండం విడుదల కాబోతున్నట్టు నిర్థారించుకోవచ్చు. ఆ సమయంలో కలిస్తే గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు, ఓవ్యులేషన్ కిట్‌ను ఎప్పుడు వాడుకోవచ్చో తెలిపే యాప్ కూడా అందుబాటులో ఉంది. అదే ఓవ్యులేషన్ ట్రాకర్. ఈ యాప్, మూడు నెలల నెలసరి వివరాలను అందించడం ద్వారా అండం విడుదలయ్యే రోజును కచ్చితంగా లెక్కించి అప్రమత్తం చేస్తుంది.
ఇన్‌సెమినైజేషన్ కిట్
నిర్దిష్ట రోజుల్లోనే కలిసి తీరే పరిస్థితి ఉన్నప్పుడు కొందరు పురుషుల్లో పర్‌ఫార్మెన్స్ ప్రెషర్ పెరిగిపోయి, అంగస్తంభన సమస్య తలెత్తుతుంది. ఇంకొందరికి స్వతహాగానే అంగ స్తంభన సమస్య ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో వీర్యాన్ని సేకరించి, జననావయవంలోకి ప్రవేశపెట్టుకునే వీలుండే కిట్ ఇది. అండం విడుదలయ్యే రోజు ఇలా ఈ కిట్‌ను వాడుకోవడం ద్వారా గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. ఈ కిట్‌లో, వీర్యాన్ని సేకరించే కప్పు, నీడిల్ లేని సిరంజి ఉంటాయి. శుభ్రత పాటించని సందర్భాల్లో మహిళలకు ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కిట్ వాడకంలో జాగ్రత్తలు పాటించాలి.
కన్‌సెప్షన్ కప్స్
అంగ ప్రవేశం తదనంతరం, వీర్యం బయటకు రాకుండా గర్భాశయ ముఖ ద్వారం దగ్గరే ఎక్కువ సమయం పాటు నిలిపి ఉంచే పరికరం ఇది. దీన్ని ఉపయోగించుకున్నప్పుడు, గర్భాశయ ముఖద్వారం దగ్గరే వీర్యం నిలిచి ఉంటుంది కాబట్టి వీర్యకణాలు అండాన్ని చేరుకునే అవకాశాలు సులభతరమవుతాయి.
గర్భధారణ కాలం ఎప్పుడు?
మహిళల్లో గర్భధారణ సజావుగా జరగడానికి అండాల విడుదల సక్రమంగా జరగాలి. నెలసరి అయిన రోజు మొదలు 14 నుంచి 16వ రోజు మధ్య ఎప్పుడైనా అండం విడుదల జరగవచ్చు. సాధారణంగా కొందరు నెలసరి ఆగినప్పటి నుంచి రోజులను లెక్కబెట్టి లైంగికంగా కలుస్తూ ఉంటారు. ఫలితంగా గర్భధారణ సాధ్యపడదు. కాబట్టి అండం విడుదలయ్యే రోజును కచ్చితంగా లెక్కించి అప్రమత్తం చేసే ఉపకరణాలు ఇలాంటి మహిళలకు ప్రయోజనాన్నిస్తాయి.
ఎవరికి నిష్ప్రయోజనం?
గర్భధారణ ఉపకరణాలు ఇన్‌ఫెర్టిలిటీని సరిదిద్దే మందులు కావు. ఇవి కేవలం గర్భధారణ అవకాశాలను మెరుగు పరిచే ప్రత్యామ్నాయాలు మాత్రమే అనే విషయం దంపతులు గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి గర్భధారణ కోసం వీటి మీదే గుడ్డిగా ఆధారపడడం అవివేకం! ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవని వైద్యులు నిర్థారించిన తర్వాత, గర్భధారణ కోసం నిర్దిష్ట కాలం పాటు మాత్రమే వీటి మీద ఆధారపడి, ఫలితం లేనప్పుడు, వైద్యులను సంప్రతించాలి. అలా కాకుండా, పునరుత్పత్తి సమస్యలు ఉన్నాయని తెలుసుకోకుండా, వాటిని సరిదిద్దుకోకుండా వీటి మీదే ఆధారపడడం వల్ల విలువైన గర్భధారణ సమయం వృథా అయిపోతుంది. ఉదాహరణకు థైరాయిడ్, పిసిఒడిల వల్ల నెలసరి సమస్యలు ఉన్న మహిళలు ఈ పరికరాలనే వాడుకుంటూ ఉండిపోవడం వల్ల ఆ సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వైద్యులు సూచించకుండా వీటిమీదే ఆధారపడడం అవివేకం.
ఎవరి కోసం?
గర్భధారణకు అడ్డుపడే ఆరోగ్య సమస్యలేవీ లేవని వైద్యులు నిర్థారించిన దంపతులు గర్భధారణ సాధనాలను ఆశ్రయించడంలో తప్పు లేదు. ఈ కోవకు చెందిన దంపతులతో పాటు...
వేర్వేరు ఊళ్లలో ఉంటూ, తరచూ శారీరకంగా కలుసుకునే వీలు లేని దంపతులు
అరుదుగా కలిసే సందర్భాల్లో పర్మార్మెన్స్ ప్రెషర్ వల్ల అంగస్తంభన సమస్యను ఎదుర్కొంటున్న వాళ్లు
భాగస్వామిలో ఒకరు ఆరోగ్య కారణాలతో మంచానికే పరిమితమై, ఆ ఖాళీ సమయంలో గర్భధారణ ప్రయత్నం చేయాలనుకునే దంపతులు
దంపతుల్లో ఒకరు రాత్రి వృత్తి, మరొకరు పగటి వృత్తి చేస్తూ, లైంగికంగా దగ్గరయ్యే వీలు లేని దంపతులు
డాక్టర్ రాహుల్ రెడ్డి
ఆండ్రాలజిస్ట్,
ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్,
జూబ్లీహిల్స్, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి
నీ వయస్సు అయిపోయింది.. అందుకే..
ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 15 , 2025 | 01:56 AM