Emerald Jewelry: వీరికి మట్టితో పనిలేదు
ABN, Publish Date - Sep 24 , 2025 | 01:11 AM
స్నేహితులైన అశ్వంతి, జిష.. ఎర్నాకులంలో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌ను నడిపిస్తున్నారు. విజయవంతంగా సాగుతున్న కోచింగ్ సెంటర్, కొవిడ్ సమయంలో....
స్నేహితులైన అశ్వంతి, జిష.. ఎర్నాకులంలో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌ను నడిపిస్తున్నారు. విజయవంతంగా సాగుతున్న కోచింగ్ సెంటర్, కొవిడ్ సమయంలో మూతపడడంతో వాళ్లిద్దరూ ఆన్‌లైన్ తరగతులకే పరిమితం కావలసి వచ్చింది. ఆ తరగతులు సంతృప్తిని ఇవ్వలేకపోవడంతో, కొత్తగా ఏదైనా వ్యాపారంలోకి ప్రవేశించాలని వాళ్లిద్దరూ భావించారు. ‘‘కొత్త ప్రాజెక్ట్ అనగానే మాకు వ్యవసాయమే గుర్తొచ్చింది. నిజానికి వ్యవసాయం సులభతరమైన ఆదాయ మార్గం కాదు. కానీ దానికి ఆధునిక కోణాన్ని జోడించి, సాంకేతికతను ఆవిష్కరించి, దానికి తగ్గట్టు నడుచుకోగలిగితే కచ్చితంగా విజయం సాధించవచ్చు. ఈ ఆలోచనతో మేమిద్దరం వ్యవసాయాన్ని ఎంచుకున్నాం’’ అంటూ చెప్పుకొస్తున్నారు బిటెక్ చదివిన అశ్వంతి, సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చేసిన జిష. ఆ క్రమంలో మట్టితో పని లేకుండా కేవలం కంకర, ఇసుక, నీళ్లను ఉపయోగించి సాగు చేసే హైడ్రోపోనిక్ వ్యవసాయ విధానాన్ని ఎంచుకున్నారు. మొక్కల పెంపకం కోసం ఒక చిన్న స్థలాన్ని లీజుకు తీసుకుని, గ్రీన్‌కోపియా ఫామ్స్‌ను స్థాపించి, దాన్లో లెట్యూస్, కేల్, సెలరీ లాంటి మూలికా మొక్కలు, మైక్రోగ్రీన్స్... ఇలా ఏకంగా 15 రకాల ఆకుకూర మొక్కలను సాగు చేయడం మొదలుపెట్టారు.
పురుగుమందులు వాడని పంటలు
చేస్తున్నది తొలి వ్యాపారం. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్న అశ్వంతి, జిషలు మొక్కల కోసం ఎంచుకునే విత్తనాల పట్ల కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించారు. అధునాతన హైడ్రోపోనిక్ పరిశోధనకు కేంద్రమైన ఇజ్రాయెల్ నుంచి విత్తనాలు సేకరించారు. ఆ విత్తనాలు మొలకెత్తే సమయం కూడా భిన్నంగా ఉంటుంది. లెట్యూస్ విత్తనాలు రెండు రోజులకే మొలకెత్తితే, సెలరీ విత్తనాలు మొలకెత్తడానికి రెండు వారాల సమయం పడుతుంది. మొలకెత్తిన తర్వాత, వాటి వేర్లను బలపరచడం కోసం పోషకాలను అందించారు. విదేశీ పంటల మార్కెట్ విలువ ఎంతో ఎక్కువగా ఉంటుంది. పంటలన్నీ నాలుగు నుంచి ఆరు వారాల్లోగా చేతికందుతాయి. ఆ తర్వాత, ప్రతి వారం వాటిని కోసుకుని, విక్రయించుకోవచ్చు. పైగా ఒక్కొక్క బెడ్ నుంచి 15 కిలోల పంట చేతికందుతూ ఉండడంతో ఆ స్నేహితులిద్దరి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ‘‘ఊటీ, మున్నార్, బెంగుళూరుల నుంచి లెట్యూస్ కొచ్చికి చేరుకుంటూ ఉంటుంది. కిలో వంద రూపాయల ధర పలికే ఈ లెట్యూ్‌సల పెంపకంలో పురుగుమందులను భారీగా ఉపయోగిస్తారు. అయినా హోటళ్లు, రెస్టారెంట్లకు వాటిని కొనడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండదు. నిజానికి బహిరంగ ప్రదేశాల్లో చీడపీడలు లేకుండా ఈ మొక్కలను పెంచడం చాలా కష్టం. అయినా మేం ఆ బెడద లేకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించి, పురుగుమందులు ఉపయోగించని లెట్యూ్‌సను పెంచగలిగాం. దాంతో మా లెట్యూ్‌సకు గిరాకీ పెరిగింది. నేరుగా కొనుక్కునేవాళ్లు మా లెట్యూ్‌సను కిలోకు 450 రూపాయలు చెల్లిస్తున్నారు. రెస్టారెంట్లు కిలోకు 390 రూపాయలు చెల్లిస్తున్నాయి. అలాగే రకరకాల లెట్యూ్‌సలకు, మూలికలు, మైక్రోగ్రీన్స్‌ను జోడించిన రెడీ టు ఈట్ సలాడ్స్ మా ఫామ్స్‌లో విపరీతంగా అమ్ముడవుతూ ఉంటాయి. పురుగుమందుల వాడకానికి మేం దూరంగా ఉండడమే, మా ఉత్పత్తులకు గిరాకీ పెరగడానికి ప్రధాన కారణం’’ అంటూ తమ ఉత్పత్తుల విజయ రహస్యాన్ని వివరించారు అశ్వంతి, జిష.
నీటి ద్వారా పోషకాలను అందిస్తూ...
హైడ్రోపోనిక్ ఫార్మింగ్ ప్రత్యేకత, ప్రయోజనాల గురించి వివరిస్తూ... ‘‘సంప్రదాయ సేద్యంతో రైతులు ఒకే ప్రదేశానికి పరిమితమైపోతూ ఉంటారు. వాతావరణ మార్పులు, రుతువులు, తెగుళ్లు.. ఇలా పంట దిగుబడి పలు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకే ఒక్క పొరపాటు రైతు శ్రమనంతటినీ తుడిచిపెట్టేస్తుంది. కానీ హైడ్రోపోనిక్స్‌కు ఈ బెడద ఉండదు. మొక్కలు మట్టికి బదులుగా నీటిలో పెరుగుతాయి. దాంతో మొక్కలకు పోషకాలు నేరుగా అందుతాయి.
అవే నీటికి మేం పదే పదే పోషకాలు జోడించి వాడుకుంటూ ఉంటాం. కాబట్టి మొక్కలన్నీ ఆరోగ్యంగా ఎదుగుతాయి’’ అంటూ వివరించిన ఈ స్నేహితురాళ్లు హైడ్రోపోనిక్ ఫామింగ్‌ను సుస్థిరమైన, ప్రయోజనకరమైన వ్యవసాయంగా విస్తరించడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Updated Date - Sep 24 , 2025 | 01:11 AM