Motherhoods True Grandeur: అమ్మతనానిదే ఆ గొప్పతనం...
ABN, Publish Date - Oct 09 , 2025 | 03:31 AM
అమ్మను అయ్యాకే నాకు తల్లి పాల విశిష్టత, విలువ తెలిసింది. నా కుమార్తెకు సరిపడినన్ని చనుబాలు ఇచ్చాక కూడా అదనంగా మిగిలే పాలతో మొదట్లో ఇబ్బంది పడ్డాను....
‘అమ్మను అయ్యాకే నాకు తల్లి పాల విశిష్టత, విలువ తెలిసింది. నా కుమార్తెకు సరిపడినన్ని చనుబాలు ఇచ్చాక కూడా అదనంగా మిగిలే పాలతో మొదట్లో ఇబ్బంది పడ్డాను. ఈ విషయం గురించి నాకు తెలిసిన వైద్యురాలు విష్ణుతను సంప్రదిస్తే... చనుబాలను దానం చేయవచ్చని చెప్పారు. ఇటీవలి కాలంలో నెలలు నిండకుండానే ప్రసవించే వారి సంఖ్య పెరిగిందని, అలాంటి తల్లులు వారం రోజుల వరకు బిడ్డకు చనుబాలు ఇవ్వలేని స్థితిలో ఉంటారనీ, మార్కెట్‌లో దొరికే పాలను పిల్లలకు పట్టించడం వల్ల వారికి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిసింది. తల్లి పాలు సమయానికి అందక చనిపోయిన పిల్లల గణాంకాలు చూసి విస్తుపోయాను. అలాంటి వారికి ‘బ్రెస్ట్ ఫీడ్ మిల్క్ బ్యాంక్స్’ ద్వారా తల్లి పాలను అందించవచ్చనని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నా కుమార్తెకు ఇవ్వగా మిగిలిన పాలను టెట్రా ప్యాకెట్లలో నింపి, ఇంట్లోని డీప్ ప్రీజర్‌లో భద్రపరిచి దానం చేస్తున్నాను. తొలి రెండు నెలల్లో 14.5 లీటర్లు, గడిచిన నాలుగు నెలల్లో దాదాపు 30 లీటర్లు చనుబాలను దానం చేశాను. పేద తల్లులు, వారి బిడ్డలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరాలనే ఆశయంతో నా పాలను ప్రభుత్వాసుపత్రుల్లో మిల్క్ బ్యాంక్‌లు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థలకే ఇస్తున్నాను. ‘అమృతం ఫౌండేషన్’ ద్వారా చెన్నై ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో, ‘ధాత్రి ఫౌండేషన్’ ద్వారా హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న మిల్క్ బ్యాంకులకు అందిస్తున్నాను. చనుబాల దానంతో నాబిడ్డతో పాటు ఎంతోమంది చిన్నారులకు అమ్మనయ్యే అదృష్టం కలిగింది.
విస్తృతంగా అవగాహన కల్పించాలి..
హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి విషయానికొస్తే ఏటా అక్కడ సుమారు తొమ్మిది వేలమంది పసిబిడ్డలు తల్లి పాలు లభించక ఇబ్బంది పడుతుంటారని తెలిసింది. వీరిలో కొంతమంది ఇక్కడే పుట్టినవారు కాగా మరికొందరు ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో అక్కడికి చికిత్స కోసం వస్తుంటారు. నెలలు నిండకుండా పుట్టిన, తక్కువ బరువుతో జన్మించే పిల్లలకు తల్లి పాలు కాకుండా పాల పిండితో తయారు చేసిన పాలు, మార్కెట్‌లో దొరికే సాధారణ పాలు పట్టించడం వల్ల ‘నెక్రోటైజింగ్ ఎంటరోకోలైటిస్’ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల పేగుల్లో చీము పట్టి, పొట్ట లోపల అవి అతుక్కుపోవడంతో వారం, పది రోజుల తర్వాత ఆ పాలు తాగలేక పిల్లలు చనిపోయే ప్రమాదం పొంచి ఉందట. ఈ మరణాలను అరికట్టడానికి ఉన్న ఏకైక మార్గం వారికి చనుబాలను అందించడమే. తల్లి పాలలోని ఔషధ గుణం కలిగిన కొన్ని అణువులు ఇలాంటి పిల్లలకు ప్రాణధారం. పాలిచ్చే తల్లలు తమ పిల్లలకు ఇవ్వగా... అదనంగా మిగిలే పాలను వృధాగా నేలపాలు చేయకుండా ప్రభుత్వ ఆస్పుత్రులకు దానం చేసే... ఇతర బిడ్డల ఆకలి తీర్చిన వారు, ప్రాణం పోసిన వారు అవుతారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంత అభివృద్ధి చెందాక కూడా దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం బాధనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వార్తా సంస్థలు ఈ విషయం గురించి ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి.
కులం ప్రాణం పోయదు...
ప్రాణాపాయ స్థితిలో రక్తం అవసరమైనప్పుడు కూడా ఇప్పటికీ కొందరు తమ కులం వారి రక్తం కోసం వెతుకులాడడం లాంటి విషయాలు సోషల్ మీడియాలో, ఇతరత్రా మాధ్యమాల ద్వారా నా దృష్టికి వచ్చినప్పుడు విస్మయం కలుగుతుంది. ఇదే తరహా ఆలోచన తల్లి పాల దానం విషయంలో కూడా ఉందని తెలిసి ఆశ్చర్యపోయా. మా పాలను వేరే వాళ్లకు ఎందుకు ఇవ్వాలనే వారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా.
ఈ సృష్టిలో మరొకరికి జన్మనిచ్చి ప్రాణం పోసే అవకాశం తల్లులకే ఉంటుంది. ఎవరూ పుట్టే ముందు ఇదే మతం, కులం, ప్రాంతంలో జన్మించాలని ఎంచుకొని పుట్టరు. కాబట్టి పండంటి పసిబిడ్డలు ఈ లోకాన్ని చూడాలంటే తల్లి మనసుతో ఆలోచించి, చనుబాలను దానం చేయడానికి ప్రతి మాతృమూర్తి ముందుకు రావాలి. వస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే అమ్మతనంలోని గొప్పతనం మహిళలను ఈ పని చేయిస్తుందని భావిస్తున్నా. ఇక పుట్టిన పిల్లలకు పాలిస్తే తమ అందం తరిగిపోతుందనే అపోహలు ఉన్నాయి. చనుబాలలోని ఔషధ గుణాలు మరే పాలల్లో ఉండదని శాస్త్రీయంగా నిరూపితమైంది. తల్లి పాలు తాగడం వల్ల పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి చనుబాల ఇవ్వడంలో తప్పేమిటి? ఒకవేళ నిజంగానే అందం పోతుందనే అనుకుందాం... మన బిడ్డలకన్నా అందం ముఖ్యం కాదు కదా! పెళ్లయ్యాక... ముఖ్యంగా గర్భం దాల్చాక అమ్మాయిల ఆలోచనల్లో, జీవన శైలిలో సహజంగా మార్పులు వస్తాయి. పిల్లలను కనడం, వారిని పెంచడంలో తండ్రి కంటే తల్లి పాత్ర ఎక్కువ ఉంటుంది. నేను షట్లర్‌గా కెరీర్ ముగించి, ఇప్పుడు తల్లి పాత్రలో ప్రవేశించాను. నా కుమార్తె (మీరా) పెరిగి పెద్దదై, తన నిర్ణయాలు తాను తీసుకునే పరిణతి వచ్చే వరకు తనను ముందుకు నడిపించడం, సంరక్షించడం నా బాధ్యత.
వాళ్లకు ఎన్ని అవార్డులు వచ్చినా వృధాయే...
నిజాన్ని నిర్భయంగా మాట్లాడలేని వారికి, అన్యాయాన్ని ప్రశ్నించలేని వారికి ఎన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు, బిరుదులు వచ్చినా నా దృష్టిలో వృధానే. కళ్ల ముందు తప్పు జరుగుతున్నప్పుడు, అది తప్పని తెలిసినప్పుడు కూడా స్పందించనినప్పుడు పేరు ముందు ‘పద్మశ్రీ’లు, ‘పద్మభూషణ్’లు పెట్టుకుని ఏం ఉపయోగం? నా దృష్టికి వచ్చిన సమస్యలపై నేను వెంటనే స్పందిస్తా. బాధితులకు నా మద్దతు తెలియజేస్తూ గొంతు విప్పుతా. నేను స్పందించాక కూడా బాధితులకు కానీ, నాకు కానీ మద్దతుగా ఇతర తెలుగు క్రీడాకారులు కనీసం స్పందించరు. రాజకీయ పార్టీలకు, క్రీడా సంఘాలలోని పెద్దలకు భయపడి నోరు విప్పరు. నా మాదిరిగా ప్రశ్నించే వారిమీద రెబల్, కమ్యునిస్టు, హేతువాది అని రకరకాల ముద్రలు వేసి అవార్డులు, రివార్డులు రాకుండా చేస్తారు. నాకు అవార్డులు ఇవ్వకపోవడం వారి దౌర్భాగ్యం తప్ప... అవార్డులు రాలేదని నేను
ఎప్పుడు బాధపడలేదు. పైరవీలు, సిఫార్సులు చేస్తే వచ్చే అవార్డులు నాకు అవసరం లేదు. 2011లో నాకు ‘అర్జున’ పురస్కారం ఇచ్చేముందు ఎవరైనా రాజకీయ నాయకులతో సిఫార్సు లేఖలు ఇప్పించాలని కొందరు సలహాలు ఇచ్చారు. నాకు అర్హత ఉంటే వస్తుంది కానీ అలాంటి పనులు చేయనని చెప్పా. ఇకపై కూడా అలానే ఉంటా.’’
-ఎస్.ఎస్.బి సంజయ్
Updated Date - Oct 09 , 2025 | 03:31 AM