British Collector Devotion: పీటర్ పాదుకలు
ABN, Publish Date - Jul 25 , 2025 | 03:07 AM
బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించే కాలంలో... తమిళనాడులోని మదురై జిల్లాకు రౌస్ పీటర్ అనే వ్యక్తి 1812 నుంచి 1828 వరకు కలెక్టర్‌గా పని చేశాడు. పీటర్ కార్యాలయానికి, అతను నివసిస్తున్న ఇంటికి...
తెలుసుకుందాం
బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించే కాలంలో... తమిళనాడులోని మదురై జిల్లాకు రౌస్ పీటర్ అనే వ్యక్తి 1812 నుంచి 1828 వరకు కలెక్టర్‌గా పని చేశాడు. పీటర్ కార్యాలయానికి, అతను నివసిస్తున్న ఇంటికి మధ్యలో మీనాక్షి అమ్మవారి ఆలయం ఉండేది. అతను తన కార్యాలయానికి రోజూ అమ్మవారి ఆలయం ముందు నుంచే వెళ్ళేవాడు. ఆలయం సమీపించగానే గుర్రం మీద నుంచి దిగి, తన కాళ్ళకు ఉన్న చెప్పుల్ని తీసేసి, నడిచి వెళ్తూ... తన భక్తిప్రపత్తులను చాటుకొనేవాడు.
తప్పిన ప్రమాదం
ఒక రోజు రాత్రి ఉరుములు, మెరుపులతో పెద్ద గాలి వాన వచ్చింది. తన ఇంట్లో పడుకున్న పీటర్‌కు పెద్ద శబ్దం వినిపించి... ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా ఒంటినిండా ఆభరణాలతో ఒక బాలిక నిలబడి ఉంది. ‘‘ఎవరమ్మా నువ్వు?’’ అని పీటర్ ఆమెను అడిగాడు. ఆ బాలిక బయటకు వెళుతూ... ‘రారమ్మ’ని పీటర్‌ను పిలిచింది. పీటర్ ఇంటి బయటకు వచ్చాడు. ఆ తరువాత ఆ బాలిక వర్షంలో వడివడిగా నడుస్తూ వెళ్ళి అదృశ్యం కావడం, ఆ సమయంలో ఆమె కాళ్ళకు పాదరక్షలు లేకపోవడం పీటర్ గమనించాడు. ఇంతలో అతను నివసిస్తున్న ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది. నిర్ఘాంతపోయిన పీటర్ కొంతసేపటికి తేరుకున్నాడు. బాలిక రూపంలో ఆ అర్ధరాత్రి వచ్చి, తనను బయటకు పిలిచి, ఘోర ప్రమాదం నుంచి కాపాడినది సాక్షాత్తూ మధుర మీనాక్షి అమ్మవారే అని గ్రహించాడు. చేతులెత్తి నమస్కరించాడు.
ఉత్సవమూర్తికి అలంకారంగా...
మర్నాడు అతను మీనాక్షి ఆలయానికి వెళ్ళాడు. ముందురోజు రాత్రి జరిగిన సంఘటనను అక్కడి అర్చకులకు తెలియజేశాడు. ‘‘అయ్యా! రాత్రి నాకు దర్శనం ఇచ్చిన మీనాక్షి అమ్మవారి కాళ్ళకు పాదరక్షలు లేవని గమనించాను. నేను అమ్మవారికి బంగారు పాదరక్షలు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు అంగీకరించి నాకు అవకాశాన్ని కల్పించండి’’ అని కోరాడు. ఆలయ నిర్వాహకులు అందుకు అంగీకరించడంతో... 412 కెంపులు, 72 పచ్చలు, 80 వజ్రాల సహితంగా అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను మీనాక్షి అమ్మవారికి కలెక్టర్ పీటర్ సమర్పించాడు. ఆ పాదుకలను ‘పీటర్ పాదుకలు’ అని పిలుస్తారు. నేటికీ... ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో నిర్వహించే చిత్తిరై పండుగ సందర్భంగా... అమ్మవారి ఉత్సవ మూర్తి పాదాలకు ఆ పాదుకలను అలంకరించి ఊరేగిస్తున్నారు. అన్యమతస్తుడైనా... అమ్మవారిపై పీటర్‌కు ఉన్న భక్తి విశ్వాసాలకు తార్కాణంగా ఈ సంఘటన నిలిచిపోయింది.
సి.ఎన్.మూర్తి
8328143489
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్
Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..
Read latest AP News And Telugu News
Updated Date - Jul 25 , 2025 | 03:07 AM