Delicious Recipes with Spiny gourd: ఆ కాకరకాయ రుచే వేరు...
ABN, Publish Date - Aug 23 , 2025 | 04:36 AM
వర్షాకాలంలో విరివిగా దొరికే ఆకాకరకాయలను ఇష్టపడనివారు ఉండరు. వీటినే కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయలు..
వర్షాకాలంలో విరివిగా దొరికే ఆకాకరకాయలను ఇష్టపడనివారు ఉండరు. వీటినే కొన్ని ప్రాంతాల్లో బోడ కాకరకాయలు, బొంత కాకరకాయలని కూడా పిలుస్తుంటారు. వీటితో వేపుడు, ఇగురు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవికాక ఆకాకరకాయలతో తయారుచేసే విభిన్న వంటకాలు మీకోసం...
ఆకాకరకాయ చికెన్
కావాల్సిన పదార్థాలు
ఆకాకరకాయలు- పావు కేజీ, చికెన్- అర కేజీ, ధనియాలు- ఒక చెంచా, జీలకర్ర- అర చెంచా, గసగసాలు- ఒక చెంచా, లవంగాలు- అయిదు, యాలకులు- రెండు, దాల్చిన చెక్క- రెండు చిన్న ముక్కలు, అల్లం- ఒక పెద్ద ముక్క, వెల్లుల్లి రెబ్బలు- పది, నూనె- అయిదు చెంచాలు, పచ్చిమిర్చి- అయిదు, ఉల్లిపాయలు- మూడు, టమాటాలు- రెండు, కారం- ఒక చెంచా, పసుపు- పావు చెంచా, ఉప్పు- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం
ఆకాకరకాయలను శుభ్రంగా కడికి ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలను కూడా చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. చికెన్ ముక్కలను ఉప్పునీళ్లతో బాగా కడగాలి. మిక్సీలో ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పొడిని పళ్లెంలోకి తీయాలి. తరవాత మిక్సీలో అల్లం, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి పేస్టులా చేయాలి.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో నూనె వేసి వేడిచేయాలి. తరవాత మధ్యకు చీల్చిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరవాత టమాటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. అయిదు నిమిషాల తరవాత మూత తీసి చికెన్ ముక్కలు, వేసి కలిపి రెండు నిమిషాలు వేగనివ్వాలి. చికెన్ ముక్కలు కొద్దిగా మెత్తబడిన వెంటనే ఆకాకరకాయ ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాల పొడి వేసి బాగా కలపాలి. అందులో అర కప్పు నీళ్లు పోసి మూతపెట్టి పావుగంటసేపు మగ్గించాలి. తరవాత మూత తీసి కొత్తిమీర తరుగు చల్లి బాగా కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఇలా తయారుచేసుకున్న ఆకాకరకాయ చికెన్ కూర... వేడి అన్నం, చపాతీ, పుల్కాల్లోకి రుచిగా ఉంటుంది.
చిట్కాలు
ఆకాకరకాయ, చికెన్ ముక్కలను మరీ మెత్తగా ఉడికించకూడదు.
గ్రేవీ చిక్కగా కమ్మగా రావాలనుకుంటే కొద్దిగా జీడిపప్పు పేస్టు కలుపుకోవచ్చు.
ఆకాకరకాయ ఊరగాయ
కావాల్సిన పదార్థాలు
ఆకాకరకాయలు- పావు కేజీ, కారం- ముప్పావు కప్పు, ఉప్పు- పావు కప్పు, ఆవపిండి- పావు కప్పు, మెంతిపిండి- పావు చెంచా, వెల్లుల్లి రెబ్బలు- పది, నువ్వుల నూనె- ఒకటిన్నర కప్పులు, నిమ్మరసం- పావు కప్పు
తయారీ విధానం
ఆకాకరకాయలను నీళ్లతో శుభ్రంగా కడిగి తడిలేకుండా పొడి గుడ్డతో తుడవాలి. వీటిని ఒక రోజంతా ఆరనివ్వాలి. తరవాత ఒక్కోదాన్ని పొడవుగా నాలుగు ముక్కలుగా కోయాలి. ఒక గిన్నెలో కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి వేసి కలిపి ఉంచుకోవాలి.
వెడల్పాటి గిన్నెలో ఆకాకరకాయల ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కారం మిశ్రమం వేసి కలపాలి. తరవాత నువ్వుల నూనె పోసి ముక్కలకు కారం బాగా పట్టేలా కలపాలి. ముక్కల మీద నూనె తేలుతూ ఉండాలి. తరవాత నిమ్మరసం వేసి మరోసారి బాగా కలపాలి. ఈ గిన్నెమీద మూతపెట్టి ఒక రోజంతా ఊరనివ్వాలి. తరవాత ఉప్పు సరిచూసుకుని గాజు సీసాలో భద్రపరిస్తే ఈ ఆకాకరకాయ ఊరగాయ రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఊరినకొద్దీ దీని రుచి పెరుగుతుంది. వేడి అన్నం, ఇడ్లీ, దోశల్లోకి బాగుంటుంది.
చిట్కాలు
కల్లుప్పును కొద్దిసేపు ఎండలోపెట్టి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి కలిపితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నిమ్మరసాన్ని కూడా గంటసేపు ఎండలో ఉంచాలి.
ఆకాకరకాయ బిరియాని
కావాల్సిన పదార్థాలు
లేత ఆకాకరకాయలు- పావు కేజీ, బాస్మతి బియ్యం- రెండు కప్పులు, బిరియాని ఆకులు- రెండు, సాజీరా- ఒక చెంచా, దాల్చిన చెక్క- రెండు చిన్న ముక్కలు, లవంగాలు- అయిదు, యాలకులు- నాలుగు, అనాస పువ్వు- ఒకటి, ధనియాలు- ఒక చెంచా, జీలకర్ర- ఒక చెంచా, ఎండు మిర్చి- అయిదు, మిరియాలు- పావు చెంచా, ఎండు కొబ్బరి ముక్కలు- రెండు చెంచాలు, కసూరి మేతి- ఒక చెంచా, పెరుగు- పావు కప్పు, చింతపండు గుజ్జు- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, కారం- ఒక చెంచా, గరం మసాల పొడి- అర చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒకటిన్నర చెంచాలు, పచ్చిమిర్చి- రెండు, పసుపు- అరచెంచా, బ్రౌన్ ఆనియన్స్- కొద్దిగా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, పుదీనా- కొద్దిగా, నూనె- అయిదు చెంచాలు, నెయ్యి- నాలుగు చెంచాలు, కుంకుమ పువ్వు- కొద్దిగా, పాలు- అర కప్పు
తయారీ విధానం
బాస్మతి బియ్యాన్ని కడిగి నిండా నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి.
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మిరియాలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేపి చల్లార్చాలి. వీటితోపాటు కసూరి మేతిని కూడా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఆకాకరకాయలను శుభ్రంగా కడిగి వాటిని గుత్తుల్లా కోయాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి నాలుగు చెంచాల నూనె వేసి వేడిచేయాలి. అందులో ఆకాకరకాయలు వేసి చిన్న మంట మీద అయిదు నిమిషాలు దోరగా వేపి పళ్లెంలోకి తీయాలి.
వెడల్పాటి గిన్నెలో పెరుగు, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, గరం మసాల పొడి, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, పచ్చి మిర్చి వేసి బాగా కలపాలి. తరవాత వేయించి పెట్టుకున్న ఆకాకరకాయలు, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు వేసి జాగ్రత్తగా కలపాలి.
స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి సగానికిపైగా నీళ్లు పోసి చెంచా ఉప్పు, బిరియాని ఆకులు, సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాసపువ్వు, చెంచా నూనె వేసి కలపాలి. నీళ్లు మరిగాక ముందు గా నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి పలుకుల్లా ఉడికించాలి. తరవాత నీళ్లు వడగట్టాలి.
స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాన్ పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో ఆకాకరకాయల మిశ్రమం పరచాలి. కొన్ని నీళ్ల చుక్కలు చల్లాలి. దీనిమీద ముందుగా ఉడికించుకున్న బాస్మతి బియ్యం వేసి పైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు, కుంకుమ పువ్వు కలిపిన పాలు, రెండు చెంచాల నెయ్యి వేయాలి. మూతపెట్టి చిన్న మంట మీద పావుగంటసేపు మగ్గించాలి. ఇలా తయారు చేసుకున్న ఆకాకరకాయ బిరియానీని వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఏదైనా గ్రేవీ కర్రీ లేదా రైతాతో తింటే రుచిగా ఉంటుంది.
చిట్కాలు
ఆకాకరకాయలు పెద్దగా ఉంటే వాటిని ముక్కలుగా కోసి లోపలి గింజలు తీసివేయాలి.
బిరియాని మగ్గుతున్నప్పుడు కొన్ని కొబ్బరిపాలు చిలకరిస్తే రుచి మరింత పెరుగుతుంది.
Updated Date - Aug 23 , 2025 | 11:55 AM