Costume Designer Aishwarya: చిన్న తేడానైనా పసిగట్టేస్తున్నారు...
ABN, Publish Date - Jun 01 , 2025 | 04:02 AM
కళ్యాణ్‌గారు మితభాషి అయినా, సీవీఎల్‌ఎన్ ప్రసాద్ కాస్ట్యూమ్ డిజైనింగ్‌లో చూపిన పట్టుదల, నైపుణ్యాన్ని గౌరవించారు. ప్రసాద్‌కి ఈ ప్రశంస జీవితంలో అతి పెద్ద ప్రోత్సాహం.
సుమారు 300 ఏళ్ల క్రితం సాధారణ మనుషులు ఎలాంటి దుస్తులు ధరించేవారు? అవి ఏ రంగులో ఉండేవి? వాటిని ఎలా కుట్టేవారు? ఇలాంటివన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలు.చారిత్రాత్మక సినిమాలు చూసినప్పుడు వాటికి సంబంధించిన కొన్ని సమాధానాలులభిస్తాయి. ఈ నెల 12న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాకూడా ఈ కోవకు చెందినదే! ఈ సినిమాకు కాస్య్టూమ్ డిజైనర్‌గా వ్యవహరించిన ఐశ్వర్యను ‘నవ్య’ పలకరించినప్పుడు ఆమె అనేక అంశాలను వెల్లడించారు. చారిత్రాత్మక సినిమాలకు దుస్తులను డిజైన్ చేయటం ఒక సవాలు కదా... మీరు ఈ ప్రాజెక్టును ఎలా చేపట్టారు?
గతంలో ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మొదలైన చారిత్రాత్మక సినిమాలకు కూడా నేను డిజైనర్‌గా పనిచేశాను. వీటితో పాటుగా కొన్ని సీరియల్స్‌లోని పాత్రలకు కూడా దుస్తులు డిజైన్ చేశాను. అందువల్ల చరిత్రకు సంబంధించిన అంశాలపై నాకు అవగాహన ఉంది. చరిత్రను జాగ్రత్తగా గమనిస్తే... ఆ సమయంలో ప్రజలు వేసుకొనే దుస్తులకు సంబంధించిన అనేక విషయాలు తెలుస్తాయి. ఇక ఈ ప్రాజెక్టు విషయానికి వస్తే- డైరక్టర్ క్రిష్ నాకు సినిమా కధ వివరించారు. ఆ తర్వాత కళ్యాణ్‌గారికి దుస్తులు డిజైన్ చేయాలని చెప్పారు. నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే కళ్యాణ్‌గారు ఒక ట్రెండ్ సెట్టర్. అభిమానులు చాలా ఎక్కువ. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దుస్తులు డిజైన్ చేయాలి. 16, 17 శతాబ్దాలలో దక్షిణ భారత దేశంలో వీరులు ఎలాంటి దుస్తులు వేసుకొనేవారనే విషయంపై కొంత అధ్యయనం చేశాం. వారు మామూలు సమయంలో ఎలా ఉండేవారు? యుద్ధాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి దుస్తులు వేసుకొనేవారు? వాటిపై ఎలాంటి ఆభరణాలు పెట్టుకొనేవారు?లాంటి అనేక కోణాలలో ఆలోచించి కొన్ని స్కెచ్‌లు వేసుకున్నాం. వాటి ఆధారంగా దుస్తులు కుట్టించి కళ్యాణ్‌గారిపై ట్రయల్ వేశాం. మొదటి రోజు చిన్న చిన్న మార్పులతో అన్నింటికీ ఆయన ఓకే చెప్పేశారు. ఆ తర్వాత షూటింగ్‌కు వెళ్లాం.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఐదేళ్లు దాటిపోయింది. ఇంతకాలం దుస్తుల్ని పరిరక్షించటం కష్టం కాలేదా?
2020 ఫిబ్రవరి 4వ తేదీన షూటింగ్ మొదలైంది. ‘కొల్లగొట్టిన..’ సాంగ్ 70 శాతం చిత్రీకరణ అయ్యేసరికి కొవిడ్ లాక్‌డౌన్ వచ్చింది. దాంతో షూటింగ్ ఆగిపోయింది. 2021లో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాం. రెండు, మూడు నెలలకే లాక్‌డౌన్ ప్రకటించారు. మళ్లీ షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్‌గారు రాజకీయాలలో బిజీ అయిపోయారు. దీంతో షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో దుస్తుల్ని జాగ్రత్త చేయటం చాలా కష్టమయింది. ఎందుకంటే- ఈ సినిమాలో కేవలం కాటన్ దుస్తులను వాడాం. ఇవన్నీ సహజమైన రంగులతో తయారుచేసినవి. ఎక్కువ కాలం వదిలేస్తే వాటి మెరుపు తగ్గిపోతుంది. ఉదాహరణకు ‘కొల్లగొట్టిన...’ పాట షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. మళ్లీ షూటింగ్ ప్రారంభించే సమయానికి కొన్ని దుస్తులు పాడైపోయాయి. వాటిని తిరిగి కుట్టాల్సి వచ్చింది. ఈ తరహా సందర్భాలు కొన్ని ఎదురయ్యాయి. ఇదంతా చాలా శ్రమతో కూడిన వ్యవహారం.
చారిత్రాత్మక సినిమా అంటే జూనియర్ ఆర్టిస్టుల సహా అందరికీ ప్రత్యేకమైన దుస్తులు కుట్టాలి కదా.. ఎన్ని వేల మీటర్ల వస్త్రం వాడి ఉంటారు?
కచ్చితమైన లెక్క చెప్పలేను కానీ 30 వేల మీటర్ల కన్నా ఎక్కువ వస్త్రం వాడి ఉంటాం. అన్ని వేల మీటర్లు వాడారా? అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఈ సినిమాలో ఒక పాటలో 350 మంది డ్యాన్సర్లు ఉన్నారు. ఒక్కక్కరికి ప్రత్యేకమైన డ్రస్సు కుట్టాలంటే 9 మీటర్లు పడుతుందనుకుందాం. అంటే 3150 మీటర్లు అవుతుంది. వీరితో పాటు కొందరు జూనియర్ ఆరిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇతరులు కూడా ఉంటారు. వీరికి కూడా ప్రత్యేకంగానే కుట్టాలి కదా! అంతా కలిపితే 3500 మీటర్లు అయిందనుకుందాం.. తలపాగాల లెక్క వేరు. ఒక తలపాగ చుట్టాలంటే 20 మీటర్ల వస్త్రం అవసరమవుతుంది. వీటితో పాటుగా రకరకాల సీన్లు, ఫైట్లు కూడా ఉంటాయి కదా! ఒక ఫైట్ సీక్వెన్స్‌ను తీసుకుంటే వాటిలో దుస్తులు పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల హీరోకు, ఆయన బాడీ డబుల్ (డూప్)కు కలిపి ఆరేడు జతలు రెడీగా ఉంచుకుంటాం. మనకు అత్యాధునికమైన కెమేరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ చిన్న తేడా వచ్చినా ప్రేక్షకులు పసికట్టేస్తున్నారు. అందువల్ల దుస్తుల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది.
రంగుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఆ సమయంలో ప్రకృతిలో ఎలాంటి రంగులు ఉన్నాయో అలాంటి రంగులే ఎక్కువగా వేసుకొనేవారు. అయితే ఆ రంగులన్నీ కెమేరాలో ఎలా కనిపిస్తాయో తెలియదు. అందువల్ల ముందు కొన్ని నమూనాలు తీసుకొని వాటిని సినిమాటోగ్రాఫర్‌కు, ఆర్ట్ డైరక్టర్‌కు చూపించేవాళ్లం. వాళ్లతో చర్చించిన తర్వాత వేర్వేరు పాత్రలకు రంగులు నిర్ణయించాం. ఆలాగే అన్ని పాత్రలకు ఒకే విధమైన దుస్తులను కుట్టించలేం. ఉదాహరణకు గ్రామంలో నివసించే గ్రామీణులను తీసుకుందాం. వారు మెరిసే దుస్తులు వేసుకోరు. అవి ఎక్కువ మెరవకుండా ముతకగా కనిపించాలి. హీరో, హీరోయిన్, ముఖ్యమైన పాత్రల దుస్తులలో కొంత మెరుపు ఉండాలి. వారు పెట్టుకున్న ఆభరణాలకు తగినట్లు ఉండాలి. అందువల్ల మేము తెల్ల వస్త్రాన్ని తీసుకొని, దానికి మాకు అవసరమైన రంగులను వేయించుకొని వాటితో దుస్తులు కుట్టేవాళ్లం. ఈ సినిమాలో కళ్యాణ్‌గారి కోసం చేసిన డిజైన్లను చేతితోను కుట్టాం. ఒకో డ్రస్సు కుట్టడానికి ఆరు నుంచి ఎనిమిది రోజులు పట్టేది.
షూటింగ్‌లో మీరు మరచిపోలేని అనుభవం?
కళ్యాణ్‌గారు చాలా మితభాషి. ఎవరితోను ఎక్కువగా మాట్లాడరు. మొదట్లో నాతో కూడా ఏమి మాట్లాడేవారు కాదు. నేను ప్రతిరోజూ లొకేషన్‌లో ఉండి అందరిని సరైన దుస్తులు, ఇతర ఆభరణాలు అందాయా? లేదా? అని చూసుకుంటూ ఉండేదాన్ని. ఒక రోజు పని అయిపోయిన తర్వాత కళ్యాణ్‌గారి టెంట్ దగ్గరకు వచ్చి నిలబడ్డా. కళ్యాణ్ గారు వచ్చి- ‘‘ఇంతకు ముందు మీరు ఏం చేశారు?’’ అని అడి గారు. ‘‘నేను ఇంజనీరింగ్ చదివాను సర్... టీచింగ్ చేసేదాన్ని. కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే నాకు ఇష్టం. దాంతో ఉద్యోగం వదిలేసి వచ్చా. ‘కంచె’ సినిమాతో మొదలుపెట్టాను’’ అని చెప్పాను. ‘‘జూనియర్ ఆర్టిస్టులకు మీరు ఇస్తున్న దుస్తుల రిఫెరెన్స్‌లు చూశా. వారి లుక్స్ చాలా బావున్నాయి. చారిత్రాత్మక సినిమాలకు పనిచేయటం అంత సులభం కాదు. మీరు అద్భుతంగా పనిచేస్తున్నారు’’ అని ప్రశంసిం చారు. నా జీవితంలో అతి పెద్ద ప్రశంస అది.
-సీవీఎల్‌ఎన్ ప్రసాద్
Updated Date - Jun 01 , 2025 | 04:12 AM