Budget Friendly Diwali: బడ్జెట్ దీపావళి
ABN, Publish Date - Oct 19 , 2025 | 04:52 AM
పండగ కచ్చితంగా ఖర్చుతో కూడుకున్న వేడుకే! అలాగని సంబరాలు చేసుకోవడం మానుకోలేం కాబట్టి, వీలైనంత చవకగా దీపావళి పండగ జరుపుకొనే మార్గాల కోసం అన్వేషించాలి. అలాంటి మార్గాల్లో ఇవి కొన్ని..
పండగ కచ్చితంగా ఖర్చుతో కూడుకున్న వేడుకే! అలాగని సంబరాలు చేసుకోవడం మానుకోలేం కాబట్టి, వీలైనంత చవకగా దీపావళి పండగ జరుపుకొనే మార్గాల కోసం అన్వేషించాలి. అలాంటి మార్గాల్లో ఇవి కొన్ని..
క్యాండిల్స్ బదులుగా దివ్వెలు!: బల్బులు, క్యాండిల్స్‌తో దీపావళి వెలుగులు విరజిమ్మాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. కాబట్టి ఈ దీపావళినాడు మట్టి ప్రమిదలు సేకరించి, వాటి మీద ఆక్రిలిక్ కలర్స్‌తో డిజైన్లు గీయండి. వీటిలో నూనె లేదా మైనం నింపి వెలిగించండి. మట్టి ప్రమిదలు క్యాండిల్స్ కంటే ఎక్కువ సమయంపాటు వెలుగుతాయి.
పువ్వుల రంగోలి: రసాయనాలతో తయారైన కృత్రిమ రంగులకు బదులు పూల రేకులు, పసుపు, బియ్యం పిండిలతో రంగోలి తయారుచేయండి. వీటి ఖరీదు తక్కువ. పైగా అలంకరణ కూడా తేలికే! ఇంటి వాకిలి లేదా హాల్‌ను పూల రంగోలీలతో నింపేస్తే ఇంట్లో పండుగ శోభ వెల్లివిరుస్తుంది.
వెలుగులు విరజిమ్మేలా: వాడకుండా వదిలేసిన సీసాలను సేకరించి వాటికి రంగులేయండి. వాటి లోపల ఫెర్రీ లైట్లను నింపి, కిటికీల దగ్గర ఉంచి ఆన్ చేయండి. రంగు కాగితాలతో పూలను తయారుచేసి, సీసాల్లో నింపినా బాగుంటుంది. సీసాల్లో గోళీలు, గులకరాళ్లు నింపి, ఫెర్రీ లైట్లను కూడా అలంకరించుకోవచ్చు.
దుపట్టాతో డెకరేషన్: గది సీలింగ్ నుంచి మూలలకు రంగురంగుల దుపట్టా లేదా చీరలతో అలంకరించుకోవచ్చు. కిటికీలకు, తలుపుల దగ్గర కర్టెన్లుగానూ వాడవచ్చు. బెడ్ వెనకాల గోడకు డిజైన్‌లా దుపట్టాలను అలంకరించి, వాటి మీద అక్కడక్కడా పువ్వులను గుచ్చండి. గదికి పండగ శోభ వస్తుంది.
దాండియా!: డిజె లేదని దిగాలు పడవలసిన అవసరం లేదు. స్నేహితులను పోగు చేసి దాండియా ఆడుకోవచ్చు. వినసొంపైన పాటల లిస్ట్ తయారుచేసుకుని దీపావళి రాత్రి దాండియాతో హంగామా చేయవచ్చు. ఇందుకోసం దాండియా స్టిక్స్, మిలమిలమెరిసే దాండియా దుస్తులు ఉంటే చాలు.
భలే బహుమతులు!: ప్రమిదలకు ఆకర్షణీయమైన రంగులతో పెయింట్ చేసి స్నేహితులకు ఇవ్వవచ్చు. మైనం కొని క్యాండిల్స్ తయారుచేసి బహుకరించవచ్చు. స్వీట్లు తయారుచేసే సామర్థ్యం ఉంటే వాటిని అందంగా గిఫ్ట్ ప్యాక్ చేసి స్నేహితులు, బంధువులకు బహుకరించవచ్చు.
Updated Date - Oct 19 , 2025 | 08:14 AM