South East Asia Shiva temples: వారు ఆలయాలను ఆస్తిగా భావిస్తారు
ABN, Publish Date - Jul 27 , 2025 | 03:57 AM
పురాతన ఆలయాల కోసం రెండు దేశాలు యుద్ధానికి దిగటం చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. థాయ్‌లాండ్, కంబోడియా శుక్రవారం పురాతన శివాలయాల కోసం దాడులకు తెగబడ్డాయి. ఈ శివాలయాలపై...
పురాతన ఆలయాల కోసం రెండు దేశాలు యుద్ధానికి దిగటం చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. థాయ్‌లాండ్, కంబోడియా శుక్రవారం పురాతన శివాలయాల కోసం దాడులకు తెగబడ్డాయి. ఈ శివాలయాలపై విస్తృతమైన పరిశోధనలు చేసిన లిడియా లక్ష్మీ ఈ దాడుల సమయంలో ఆ సమీప ప్రాంతంలోనే ఉన్నారు. ఉక్రెయిన్‌లో సైనికురాలిగా పనిచేసి, ఆ తర్వాత ఆధ్యాత్మికవేత్తగా మారిన లిడియా మన దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు... థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాంలలో బ్రహ్మసూత్ర శివలింగాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఆ శివాలయాల విశిష్టతను ఆమె ‘నవ్య’కు వివరించారు.
శివాలయాల కోసం రెండు దేశాలు యుద్ధానికి దిగే పరిస్థితులు ఏర్పడటం అరుదుగా జరుగుతుంది. దీని వెనుక నేపథ్యమేమిటి?
ఈ ఆలయాలు థాయ్‌లాండ్‌లోని సురిన్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్రం కంబోడియా- థాయ్‌లాండ్ సరిహద్దుల్లో ఉంటుంది. రెండు దేశాలకు చెందిన ప్రజలు ఈ ఆలయాలను తమ ఆస్తిగా భావిస్తారు. పరిరక్షించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఆలయాల గురించి గతంలో కూడా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, చల్లారాయి. ఈ మధ్యనే పరిశోధనలు చేయటానికి నేను ఈ ఆలయాలకు వెళ్లాను. ఈ మూడు ఆలయాలు శైవ తంత్ర విద్యను అభ్యసించేవారికి చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఒక విషయాన్ని అందరికీ స్పష్టంగా చెప్పాలి. ఈ ఆధునిక యుగంలో ‘తంత్ర’ అంటే చాలా రకాల అపోహలు ఉన్నాయి. కానీ ఒకప్పుడు మన సంస్కృతిలో తంత్రశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇదే విధంగా ఇప్పుడు భౌగోళిక విభజనల తర్వాత థాయ్‌లాండ్, కంబోడియా వేర్వేరు దేశాలుగా ఏర్పడ్డాయి కానీ ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ఖమేర్ సామ్రాజ్యంలో భాగమే! ఒక విశేషమేమిటంటే - ఈ శాస్త్రాలన్నిటికీ పుట్టినిల్లు మన భారతదేశమే! ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఈ శాస్త్రాలను మన పూర్వీకులు తీసుకువెళ్లారు. అందుకే వీటన్నిటినీ కూడా మన సంస్కృతిలో భాగంగానే చూడాలి.
ఈ ఆలయాల ఆధ్యాత్మిక
విశిష్టతను
మరింతగా వివరిస్తారా?
ఈ మూడు ఆలయాలు ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనవి. నేను వాటిని క్షుణ్ణంగా పరిశీలించాను. అక్కడ ధ్యానం చేశాను. ఈ ఆలయాలలో గొప్ప శక్తి ప్రసారం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం వీటిని కేవలం సరిహద్దుల వద్ద సైనికుల చెక్‌పో్‌స్టలుగా కొందరు భావిస్తూ ఉండచ్చు. కానీ వీటి నిర్మాణం వెనుక నిగూఢమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఉదాహరణకు... ప్రసాత్ టా మ్యుయెన్ థోమ్ దేవాలయాన్నే తీసుకుందాం. ఈ ఆలయ నిర్మాణం కౌల తంత్ర సంప్రదాయాల ప్రకారం జరిగింది. దీనిని కొండల మధ్య కొన్ని ప్రత్యేకమైన క్రతువుల నిర్వహణ కోసం ఉద్దేశించారు. సాధారణంగా అఘోర, భైరవ శక్తులు ఈ కొండలు, అడవులు ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ తరహా ఆలయాలు కొండల అంచుల్లో, ఎక్కువ మంది చేరుకోవటానికి వీలు కాని అడవుల్లో ఉంటాయి. ఇలాంటి ఇంకో ఆలయం ప్రసాత్ తా క్రబే. ఇది స్వయంభూ శివాలయం. కుబ్జక తంత్ర, రుద్ర యమాల, మహానిర్వాణ తంత్ర అభ్యాసకులకు చాలా కీలకమైనది. ఒకప్పుడు ఈ ఆలయంలోకి అందరికీ ప్రవేశం ఉండేది కాదు. ఖమేర్ రాజపురోహితులు దీనిలో పూజలు నిర్వహించేవారు. ఇలా ఈ ఆలయాల గురించి అనేక విశేషాలు చెప్పవచ్చు.
మీరు ఈ ఆలయాలలోని శాసనాలను
పరిశీలించారా? ఆ శాసనాలు ఏమి చెబుతున్నాయి?
సాధారణంగా శాసనాలలో దాతల గురించి, నిర్మాణం వెనుక ఉన్న ఉద్దేశం గురించి, నిర్మాణానికి అయిన ఖర్చు గురించి పేర్కొంటారు. కానీ ఖమేర్ శాసనాలలో వీటితో పాటుగా ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక విశేషాలు కూడా ఉంటాయి.
ఈ ఆలయాలలో అలాంటి కొన్ని శాసనాలు ఉన్నాయి. ఇవన్నీ ఖమేర్ భాషలో ఉన్నాయి.
ఈ శాసనాలను పరిష్కరించేవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వీటిని పరిష్కరించగలిగితే మనకు అనేక విషయాలు తెలుస్తాయి.
మీరు ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు కదా... స్థానిక ప్రజల భావనలు ఎలా ఉన్నాయి?
ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలు శాంతిని కోరుకుంటారు. ఇప్పుడు భౌగోళికంగా ఈ ప్రాంతం వేర్వేరు దేశాలలో ఉండవచ్చు. కానీ ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు ఒకటే! ఆచార, వ్యవహారాలు ఒకటే! ఈ ప్రాంతంలో ప్రజలకు ఈ దేవాలయాలంటే విపరీతమైన భక్తి శ్రద్ధలున్నాయి. వారు యుద్ధ వాతావరణాన్ని ఇష్టపడటం లేదు.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News
Updated Date - Jul 27 , 2025 | 03:58 AM