Creative Baking: కథలు చెప్పే కేక్‌లు
ABN, Publish Date - Aug 06 , 2025 | 01:01 AM
బేకరీకి వెళ్లగానే ముందుగా నన్ను ఆకట్టుకొనేవి కేక్‌లు. అందుకు కారణం వాటిపై కనిపించే డెకరేషన్. చిన్నప్పటి
‘బేకరీకి వెళ్లగానే ముందుగా నన్ను ఆకట్టుకొనేవి కేక్‌లు. అందుకు కారణం వాటిపై కనిపించే డెకరేషన్. చిన్నప్పటి నుంచీ నా దృష్టి దానిపైనే ఉండేది. ఆ ఆసక్తే ఇవాళ నన్ను కేక్ ఆర్టి్‌స్టను చేసింది. నేను పుట్టి పెరిగిందంతా మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో. ప్రణవేశ్ దబాల్‌తో పెళ్లి తరువాత మా నివాసం ముంబయికి మారింది. ఇంట్లో ఖాళీ దొరికినప్పుడల్లా రకరకాల కేక్‌లు తయారుచేస్తుండేదాన్ని. ఫ్లేవర్స్ మాత్రమే కాకుండా... విభిన్న డిజైన్లు ప్రయత్నిస్తుండేదాన్ని. కొంతకాలానికి అనిపించింది... పూర్తి స్థాయిలో ఈ కళను నేర్చుకోవాలని. నా అదృష్టం ఏంటంటే... సుగర్ క్రాఫ్ట్‌లో పేరు పొందిన సర్ ఎడ్డీ స్పెన్స్ దగ్గర శిష్యరికం చేసే అవకాశం రావడం. బకింగ్‌హామ్ ప్యాలె్‌సలో జరిగే శుభ కార్యాలకు ఆయన కేక్‌లు తయారు చేసేవారు. 2015లో యూకే వెళ్లి ఆయన వద్ద ఈ కళను అభ్యసించాను.
ప్రత్యేకత కోసం...
భారత్‌కు తిరిగి వచ్చాక నాదంటూ ప్రత్యేక శైలి ఉండేలా కేక్‌లు రూపొందించడంపై దృష్టి పెట్టాను. అందుకోసం ఎన్నో పరిశోధనలు, లెక్కలేనన్ని ప్రయోగాలు చేశాను. క్రమంగా వీగన్ కేక్‌లు మొదలుపెట్టాను. దాంతో ఆదరణ పెరిగింది. అంతేకాదు... కేక్ తయారీని సమకాలీన కథలు చెప్పే ఒక సాధనంగా మలిచాను. ఇదే నన్ను ప్రత్యేకంగా నిలిపింది. ఈ ఆలోచనా విధానమే నాకు పలు అవార్డులు, అభినందనలు తెచ్చి పెట్టింది. 2021లో ‘స్వదేశ్ సమ్మాన్’ పురస్కారం అందుకున్నాను. ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. ఇంకా ఎన్నో ఉన్నాయి.
ఆ పాప కళ్లల్లో మెరుపులు...
ఒకసారి ఒక పదేళ్ల చిన్నారి తల్లితో కలిసి కేక్ డెలివరీ తీసుకువెళ్లడానికి వచ్చింది. కోట, దాని ముందు యువరాణి డిజైన్‌లో రూపొందించిన కేక్ అది. చూడగానే ఆ చిన్నారి కళ్లు మెరిసిపోయాయి. ఆ క్షణం నేను నా చిన్నప్పటి రోజులకు వెళ్లిపోయా. ఎడిన్ బ్లైటన్ కథలు చదువుతూ... మాయా ప్రపంచం గురించి కలలు కనేదాన్ని. ఆ పాపవల్ల ఆ పాత మధురాలు మళ్లీ కళ్ల ముందు కదలాడాయి. కాసేపు నన్ను నేను మరిచిపోయా. ఆ అనుభూతి ఎంతో అద్భుతంగా అనిపించింది. దాన్ని అందరికీ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే కోటలు, రాణులు, కళలు ఉట్టిపడేలా... అవి ఒక అందమైన కథ చెప్పేలా కేక్‌లు తయారు చేస్తున్నా.
భావం... భావోద్వేగం...
నా ప్రాజెక్ట్‌లు అన్నిటిలోకెల్లా మరిచిపోలేనిది, అత్యంత కష్టమైనది ‘డ్యుమో డి మిలనో’ ఇటాలియన్ కేథడ్రాల్ చర్చి రెప్లికా. 6.4 అడుగుల ఎత్తు, 4.6 అడుగుల వెడల్పుతో రూపొందించిన వంద కేజీల వీగన్ కేక్ అది. దీని తయారీకి వంద గంటలకు పైగా సమయం పట్టింది. అంతపెద్ద కేక్‌ను నిలబెట్టాలంటే... చెదరని ఏకాగ్రత, అపారమైన ఓర్పు అవసరం. అన్నిటికీ మించి ఇలాంటి పురాతన, వారసత్వ కట్టడాల ప్రతిరూపాన్ని తయారు చేయాలంటే కళాత్మకత, వాస్తుశిల్ప శైలిని ఆకళింపు చేసుకొనే సామర్థ్యం కావాలి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు నేను కట్టడం వాస్తుశిల్ప శైలి గురించి లోతుగా అధ్యయనం చేశాను. కనుకనే ఉన్నది ఉన్నట్టు కేక్‌పై చూపించగలిగాను. ఇది ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. కేక్ అంటే నాకు చూడగానే ఆకర్షించి, నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాంటి తీపి పదార్థం మాత్రమే కాదు... ఒక భావోద్వేగ బంధం. దాని తయారీ ఒక యజ్ఞం.
స్ఫూర్తి అవే...
నేను ఎంత పెద్ద కేక్‌లు చేసినా వాటిల్లో కోడిగుడ్డు వాడను. క్రీమ్ నుంచి కేక్ మిక్సింగ్ తయారీ వరకూ అన్నీ మొక్క ఆధారిత ఉత్పత్తులతో చేసిన పదార్థాలే ఉపయోగిస్తాను. కథక్ లాంటి సంప్రదాయ నాట్యం కావచ్చు... హస్తకళాకృతులు, చేనేతలు కావచ్చు... వారసత్వ కట్టడాలు కావచ్చు... మన చుట్టూ ఉండేవాటినే స్ఫూర్తిగా తీసుకొని కేక్‌లు రూపొందిస్తాను. ఇప్పటి వరకు ఇండియన్ ప్యాలెస్, పైథానీ చీర అంచు, బెంగాలీ పెళ్లికూతురు ధరించే సంప్రదాయ చీరలు, నగలు, మణిపురీ నాట్యం లాంటి నిలువెత్తు ప్రతిరూపాలు ఎన్నో నేను తయారు చేశాను. వాటిని చూసినప్పుడు నా మనసు పరవశిస్తుంది. ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. నేను కోరుకున్నది ఇలాంటి అనుభూతినే.’’
Updated Date - Aug 06 , 2025 | 01:01 AM