Psychiatry Stigma: ఆ రోగుల పట్ల దృక్పథం మారాలి
ABN, Publish Date - May 20 , 2025 | 04:30 AM
సైకియాట్రీను కెరీర్‌గా ఎంచుకున్నప్పుడు ఎదురైన అభ్యంతరాలు, మానసిక రోగుల పట్ల సమాజంలో ఉన్న అపహాస్య భావాలపై ఈ వ్యాసంలో స్పష్టంగా చెప్పబడింది. మానసిక ఆరోగ్యాన్ని సమాజం గౌరవించి, మౌనం, అపహాస్యాన్ని తేలికచేసి, సహానుభూతితో ముందుకు సాగాల్సిన అవసరాన్ని రచయిత స్పష్టం చేశారు.
నేనొక వ్యక్తిగతమైన, ఎంతో ప్రాధాన్యం ఉన్న విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది నాకెందుకింత ముఖ్యమో చెప్పాలంటే మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్లాలి. అది పీజీ సీటు వచ్చిందన్న వార్త తెలిసిన రోజు. సైకియాట్రీకి ఎంపికైనట్టు తెలిసినప్పుడు మొదట గర్వంగా అనిపించింది. నా తల్లిదండ్రులు చదువుకున్న వాళ్లు అయినప్పటికీ, ‘‘సైకియాట్రీలో సీటొచ్చింది’’ అని వారితో పంచుకోవడం అంత సులభం కాలేదు. నాకే కాదు నా తోటి డాక్టర్ల పరిస్థితి కూడా అదే! ‘‘నేను మానసిక వైద్యురాలిని అవుతున్నాను అని చెప్పినప్పుడు మా అమ్మ... ‘‘నిన్ను పిచ్చి డాక్టర్ అంటారు, నిన్ను పెళ్లాడడానికి ఎవరూ ముందుకు రారు’’ అని అంది. అవి కోపంతో వచ్చిన మాటలు కావు. ఆ మాటల వెనక అమ్మ ఆందోళన నాకు అర్థమైంది. చివరకు మా కుటుంబ స్నేహితులందరూ కలిసి తల్లిదండ్రులను ఒప్పించవలసి వచ్చింది. ఇందులో మా అమ్మ తప్పేమీ లేదు. ఇది ప్రతి తల్లి ఆవేదనే! ఆప్తులే కాదు, నా తోటి డాక్టర్లు కూడా వింతగా స్పందించారు. ‘‘ఓహ్ సైకియాట్రీ తీసుకున్నావా? ఎలాంటి పేషెంట్స్ వస్తారు నీ దగ్గరికి? వాళ్లతో ప్రమాదం ఉండదా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది రోగుల గురించిన చర్చలా లేదు. ఒక జాతికి ఇంకో జాతికీ, ఇంకో జాతికీ మధ్య జరిగే పోరాటంలో నేనొక భూమికను పోషిస్తున్న భావనకు వాళ్లు లోనయ్యారు.
సానుభూతి, తోడ్పాటు అవసరం
మానసిక రోగులు మిగతా రోగుల్లా తినే ఆహారం, వైరస్, బ్యాక్టీరియాలతో ఆరోగ్యాన్ని వాళ్లే పాడు చేసుకున్న వాళ్లు కాదు. వాళ్లు సమాజంలోని అనేక అపసవ్య సంబంధాలు, రుగ్మతల బాధితులు. కానీ వారి పట్ల ఎంతో సానుభూతితో, బాధ్యతతో వ్యవహరించాల్సిన కుటుంబసభ్యులు, స్నేహితులు, సభ్య సమాజం... వారికి తగిన వైద్యం చేయించి సహాయపడడానికి బదులుగా, దూరం పెట్టాలనే ఆలోచిస్తున్న పరిస్థితి నేడు నెలకొని ఉంది. ఈ సమస్యకు తోడు, మానసిక అనారోగ్యానికి గురైన వ్యక్తులు కూడా తామొక మానసిక రుగ్మతకు గురైనట్టు అంగీకరించకుండా సమస్యను పెద్దది చేసుకోవడం మరో పెద్ద అడ్డంకిగా మారుతోంది. ఫలితంగా చికిత్స ఆలస్యమై, ఏళ్ల తరబడి సమస్యను భరిస్తూ ఉండిపోతున్నారు. దాంతో వ్యాధి ముదిరిపోయిన దశలోనే వైద్యులను కలుస్తూ ఉంటారు. వ్యాధితో బాధపడడం ఒక ఎత్తైతే, వ్యాధిని గుర్తించకుండా, చికిత్సకు దూరంగా బ్రతకడం మరొక ఎత్తు.
మనందరి బాధ్యత
మానసిక వ్యాది కేవలం వ్యక్తిగతం కాదు. అది సామాజికం కూడా. మానసిక రుగ్మతల పట్ల సమాజంలో నెలకొని ఉన్న వ్యతిరేకతలు బాధితులను ఒంటరులను చేస్తున్నాయి. మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యంగా పరిగణించే పరిపక్వత సమాజం సాధించవలసిన అవసరం ఉంది. మనిషి ఆరోగ్యంగా ఉండడం అంటే సదరు వ్యక్తి మానసికోల్లాస పరిస్థితిలో ఉండడమే! ప్రపంచీకరణ, అనిశ్చిత ప్రపంచ రాజకీయ వ్యాపార పరిస్థితి వలన ఈ రోజు సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు ప్రతి వ్యక్తి మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నాయి. మనమింకా ‘‘మానసిక వ్యాధి’’ అనే పదానికి భయపడుతూ ఉన్నాం. ఈ మౌనం, ఈ అపహాస్యం ఆగాలి. సైకియాట్రి్‌స్టలు అంటే పిచ్చివాళ్ల డాక్టర్లు కాదు. మనందరి ప్రాణాలు కాపాడే మిగతా వైద్యులతో ఈ వైద్యులూ సమానులే! చికిత్స తీసుకోవడం బలహీనత కాదు, అదొక తెలివైన నిర్ణయం. ప్రతి మనిషి మానసిక ఆరోగ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించుకునే సమాజం కావాలి.
డాక్టర్ సనా కౌసర్
ఎంబీబీఎ్‌స(ఎండీ, సైకియాట్రి)
కాంటాక్ట్ నంబరు- 9121318569
మమత మెడికల్ కాలేజీ, ఖమ్మం
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 20 , 2025 | 04:30 AM