ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sleep Disorders: ఇన్‌సోమ్నియా నిద్రలేమి వెంటాడుతోందా

ABN, Publish Date - Aug 05 , 2025 | 03:41 AM

కంటినిండా నిద్ర లోపిస్తే, మరుసటి రోజంతా హుషారు తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. రోజంతా డీలాగా గడుస్తుంది. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే, అంతిమంగా అరోగ్యం కుంటుపడుతుంది. కాబట్టి ఈ సమస్య మూలాలను వెతికి...

కంటినిండా నిద్ర లోపిస్తే, మరుసటి రోజంతా హుషారు తగ్గుతుంది. ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. రోజంతా డీలాగా గడుస్తుంది. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే, అంతిమంగా అరోగ్యం కుంటుపడుతుంది. కాబట్టి ఈ సమస్య మూలాలను వెతికి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలంటున్నారు వైద్యులు.

కొందరికి నిద్ర పట్టడంలో ఇబ్బంది ఉంటుంది. ఇంకొందరికి పట్టిన నిద్రను కొనసాగించడంలో ఇబ్బంది ఉంటుంది. ఈ పరిస్థితి దైనందిన జీవితాన్ని ఇబ్బంది పెడుతుంటే, దాన్ని నిద్రలేమిగా భావించాలి. ఎప్పుడైనా అరుదుగా ఒకట్రెండు రోజుల పాటు ఈ సమస్య వేధిస్తే ఫరవాలేదు. కానీ వారాలు, నెలల తరబడి ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితిని తీవ్రంగానే పరిగణించాలి. అయితే ఆత్మీయుల మరణం, తరచూ చేసే ప్రయాణాల మూలంగా నిద్రవేళలు మారడం వల్ల కొంత కాలం పాటు నిద్రలేమి వేధిస్తే, పరిస్థితులు అనుకూలించిన తర్వాత పరిస్థితి కూడా సర్దుకుంటుంది. కొందరికి స్వల్పకాలిక మాత్రలు అవసరవుతాయి. ఇలా కాకుండా వారాలు, నెలల తరబడి నిద్రలేమి వేధిస్తున్నా, దాన్ని సాధారణమైన విషయంగానే భావిస్తూ, రాత్రంతా మేలుకుంటూ ఉండిపోయే వాళ్లుంటారు. ఫలితంగా కుటుంబ అనుబంధాలు, పని నైపుణ్యాలు దెబ్బతిని అంతిమంగా వైద్యులను కలుస్తూ ఉంటారు. తీవ్రమైన నిద్రలేమి కలిగిన ఈ కోవకు చెందిన వాళ్లలో సమస్యను సరిదిద్దడం కొంత క్లిష్టం. వీళ్లలో నిద్రలేమిని ట్రిగ్గర్‌ చేసిన అంశాన్ని కనిపెట్టి, ఆ అంశం ఇప్పటికీ ప్రభావం కనబరుస్తూనే ఉందా? అన్నది గమనించాలి. ఉదాహరణకు కొందరు, ధూమపానం లేదా మద్యపానం అలవాటు చేసుకుంటారు. దాంతో మొదలయ్యే నిద్రలేమి, ఆ అలవాట్లతో పాటు అంతకంతకూ కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి అంశాలను కనిపెట్టి, క్రమేపీ వాటిని దూరం చేయవలసి ఉంటుంది.

కారణాలను సరిదిద్ది...

సాధారణంగా నిద్రలేమిని ఎవరూ అంత తీవ్రంగా పరిగణించరు. కానీ ఈ సమస్యతో తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. చికాకు, వ్యక్తిత్వ సమస్యలు, సామర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి సమస్యలు పెరుగుతాయి. నిద్రలేమితో బాధపడేవారు అతి త్వరగా అల్జీమర్స్‌కు లోనయ్యే అవకాశాలు కూడా ఎక్కువే! నిద్రలేమితో పెరిగే రక్తపోటు, అదుపు తప్పే మధుమేహం ఫలితంగా గుండెజబ్బుల బారినపడే సమస్య కూడా పెరుగుతుంది. కాబట్టి నిద్రలేమి సమస్యను గుర్తించినప్పుడు, సరిదిద్దే వీలున్న కారణాలను కనిపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. శ్వాసనాళాన్ని ఇరుకుగా మార్చే అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా ఉంటే, ఆ సమస్యను సరిదిద్దుకోవాలి. అలాగే రక్తపరీక్షతో శరీరంలోని పోషక లోపాలు, హార్మోన్‌ అవకతవకలను కనిపెట్టి, వాటిని సరిదిద్దుకోవాలి. అలాగే మానసిక సమస్యలతో నిద్రలేమికి గురవుతూ ఉంటే, మానసిక వైద్యుల సహాయంతో వాటి నుంచి బయటపడాలి. నొప్పుల వల్ల నిద్రలేమి వేధిస్తుంటే, వాటిని చికిత్సతో తగ్గించుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిద్రలేమికి ఇవేమీ కారణం కాకపోవచ్చు. కొందరు నిద్రలేమికి గురయ్యే తత్వాన్ని కూడా కలిగి ఉండొచ్చు.

స్లీప్‌ డైరీతో...

నిద్రలేమి సమస్యను కచ్చితంగా అంచనా వేయడం కోసం, నిద్ర నాణ్యతను కనిపెట్టడం కోసం స్లీప్‌ డైరీ రాసుకోవాలి. ఏ సమయానికి నిద్రకు ఉపక్రమించారు? పడక మీద పడుకున్న తర్వాత ఎంత సేపటికి నిద్రలోకి జారుకుంటున్నారు? ఎన్నిసార్లు నిద్రాభంగం కలుగుతోంది? అనే వివరాలతో పాటు రోజులో తాగే కాఫీ, సిగరెట్ల వివరాలు, మద్యం వివరాలు కూడా డైరీలో రాసుకుని వైద్యులకు చూపించాలి. వీటి ఆధారంగా నిద్రలేమి తీవ్రత, కారణాలను వైద్యులు గ్రహించి నిద్రకు అడ్డుపడే అంశాలను కనిపెట్టి వాటికి దూరంగా ఉండమని సూచిస్తారు. ఆ అంశాలు ఏవంటే....

  • నిద్రకు ముందు కాఫీ తాగే అలవాటు మానుకోవాలి

  • మద్యం, ధూమపానాలు మానేయాలి

  • వ్యాయామానికీ నిద్రకు మధ్య మూడు నుంచి నాలుగు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి

  • నిద్రకు మూడు నుంచి నాలుగు గంటల ముందే భోజనం ముగించాలి

  • నిద్రకు రెండు గంటల ముందు నుంచే మొబైల్‌, టివి స్ర్కీన్స్‌కు దూరం పాటించాలి

  • కొన్నిసార్లు ఒక గదిలో నిద్ర పట్టకుండా, మరొక గదిలో నిద్ర పడుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు నిద్ర పట్టే గదినే నిద్రకు కేటాయించాలి

  • పడకను నిద్రకు తప్ప ఆఫీసు పనులకు ఉపయోగించకూడదు

  • నిద్ర పట్టనప్పుడు బలవంతంగా నిద్రపోయే ప్రయత్నం చేయకుండా, హాల్‌లో కూర్చుని పుస్తకం చదవాలి

  • గది ఉష్ణోగ్రత, 24 నుంచి 25 డిగ్రీల మధ్య ఉండాలి

  • నిద్రవేళలు క్రమం తప్పకుండా పాటించాలి

థెరపీ ప్రయోజనం

కొందర్లో చిన్ననాటి చేదు జ్ఞాపకాల వల్ల, ఆత్మీయుల మరణం వల్ల నిద్రలేమి వేధించవచ్చు. ఇలాంటి వారికి కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ ఎంతో బాగా తోడ్పడుతుంది. కౌన్సెలింగ్‌ ఆధారంగా సాగే ఈ థెరపీలో ప్రతికూల పరిస్థితుల వ్యవహరించే నైపుణ్యాలను నేర్పిస్తారు. గతంలో కూరుకుపోయి, దిగులు పడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదనీ, సమస్యను పరిష్కరించుకుని ముందుకు సాగాలనీ మానసిక వైద్యులు సూచిస్తారు. అలాగే జీవగడియారాన్ని గాడిలో పెట్టడం ద్వారా నిద్రలేమిని తొలగించడానికి లైట్‌ థెరపీని కూడా అనుసరించవచ్చు.

నిద్రమాత్రలు చివరి ప్రత్యామ్నాయం

నిద్రలేమిని పరిష్కరించే అన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు, వైద్యులు అంతిమంగా నిద్రమాత్రలు సూచిస్తారు. ఇలాంటి నిద్రమాత్రలను ఇష్టారాజ్యంగా కొనుక్కుని వాడుకోవడం వల్ల వాటికి అలవాటుపడే ప్రమాదం ఉంటుంది. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఎంత మోతాదు మాత్రలు తీసుకున్నా నిద్రరాని పరిస్థితి తలెత్తుతుంది. ఈ స్థితికి చేరుకున్న వ్యక్తి నిద్రలేమి సమస్యను పరిష్కరించడం వైద్యులకు ఎంతో క్లిష్టంగా మారుతుంది. కాబట్టి ఎవరికి వారు నిద్రమాత్రలు కొనుక్కుని వాడుకోకూడదు. నిజానికి నిద్రమాత్రలతో నిద్రపోయే సమయం పెరుగుతుందే తప్ప నిద్ర నాణ్యత పెరగదు. కాబట్టి వైద్యులు సూచించే దుష్ప్రభావాలు లేని సమర్థమైన నిద్రమాత్రలనే వాడుకోవాలి.

ఆధునిక ఔషధాలున్నాయి

నిద్రకు తోడ్పడే మెలటోనిన్‌ హార్మోన్‌ ఆధారిత మాత్రలు ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. వీటితో పాటు అలవాటు పడే వీల్లేని, లెంబారెక్సెంట్‌ అనే నిద్ర మాత్రలు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. అలాగే నిద్ర రావడం కోసం ‘స్లీప్‌ ఆన్‌సెట్‌ ఇన్‌సోమ్నియా’ మందులున్నాయి. పట్టిన నిద్ర కొనసాగడం కోసం ‘స్లీప్‌ మెయింటెనెన్స్‌ ఇన్‌సోమ్నియా’, తెల్లవారుఝామున మూడు గంటలకు మెలకువ వచ్చే వారికి ‘ఎర్లీ మార్నింగ్‌ అవేకెనింగ్‌ ప్రివెన్షన్‌’ మందులు అందుబాటులో ఉన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 03:41 AM