Balanced Diet: వయసు కనబడకుండా ఇలా...
ABN, Publish Date - May 19 , 2025 | 04:24 AM
సమతుల్య ఆహారం, తగినంత నీరు, గింజలతో పాటు వ్యాయామాన్ని రోజు నిబంధనలాగే అనుసరిస్తే వయస్సు కనిపించకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. చర్మం మెరుస్తూ, శరీరం చురుకుగా మారుతుంది.
కొంతమంది వయసు పెరుగుతున్నప్పటికీ ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటారు. ఇందుకు వారు అనుసరించే రోజువారీ అలవాట్లే కారణమని చెప్పవచ్చు. వయసును కనిపించనీయకుండా నిరంతరం ఉత్సాహంగా ఉంచే అలవాట్ల గురించి తెలుసుకుందాం....
ప్రతిరోజూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పీచుపదార్థాలు, పిండి పదార్థాలు, విటమిన్లు తదితర పోషకాలతో నిండిన తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే గింజలు తినడం వల్ల చర్మం బిగుతుగా ఆరోగ్యంగా ఉంటుంది. తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారం తినకూడదు. క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకుంటూ ఉంటే వృద్ధాప్య లక్షణాలు కనిపించవు.
ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. దీనివల్ల శరీరంలోని విషపదార్థాలు విసర్జితమవుతాయి. తగినంత తేమ లభించడం వల్ల చర్మం మృదువుగా మెరుస్తుంది. కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి. తరచూ హెర్బల్ టీ లేదా నిమ్మరసం తాగడం మంచిది. కీరతోపాటు పుచ్చకాయ, నారింజ, బత్తాయి, ద్రాక్ష, వాటర్ యాపిల్ లాంటి పండ్లు తింటూ ఉంటే చర్మం స్థితిస్థాపకత మెరుగుపడుతుంది.
శరీరం దృఢంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేస్తూ ఉంటే శరీరానికి ఆక్సిజన్ అందుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి అకాల వార్థక్య లక్షణాలు మాయమవుతాయి. యోగా, నడక వల్ల కూడా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీర భాగాలన్నీ చురుకుగా పనిచేస్తాయి.
ప్రతిరోజూ కనీసం ఏడు గంటలు నిద్రించాలి. నిద్రలోనే శరీరం కణాలను బాగుచేసుకుంటుంది. శక్తిని పుంజుకుంటుంది. ప్రశాంతంగా నిద్రించడం వల్ల ముఖ వర్చస్సు పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
రసాయన పద్ధతులతో కాకుండా సహజ విధానాల్లో చర్మాన్ని, శిరోజాలను సంరక్షించుకోవాలి. వాటికి నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి.
పుస్తకాలు చదవడం, ఆటలు ఆడడం, తోటపని లాంటి వ్యాపకాలను ఏర్పరచుకోవాలి. ధ్యానం లేదా ఇష్టమైన పని చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించాలి. సానుకూల మనస్తత్వాన్ని పెంచుకోవాలి. వస్త్రధారణ.... హుందాగా ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల మానసికానందం కలుగుతుంది. ఆహార్యం అందంగా మారుతుంది.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 19 , 2025 | 04:35 AM