Pancha Agastyeshwara temples: యోగఫలాలు అందించే అగస్త్యేశ్వరుడు
ABN, Publish Date - Jul 18 , 2025 | 03:20 AM
త్రికాలవేదిగా ఖ్యాతిగాంచిన అగస్త్య మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. ఆయన త్రేతాయుగంలో ప్రతిష్ఠించినవిగా పేరుపొందిన అయిదు ఆలయాలు... పంచ అగస్త్యేశ్వర ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి పూర్వ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని తాపేశ్వరం, ఆర్తమూరు...
ఆలయ దర్శనం
త్రికాలవేదిగా ఖ్యాతిగాంచిన అగస్త్య మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. ఆయన త్రేతాయుగంలో ప్రతిష్ఠించినవిగా పేరుపొందిన అయిదు ఆలయాలు... పంచ అగస్త్యేశ్వర ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి పూర్వ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని తాపేశ్వరం, ఆర్తమూరు, మండపేట, వల్లూరు, చెల్లూరులలో ఉన్నాయి. తాపేశ్వరంలో (ప్రస్తుత కోనసీమ జిల్లా) పశ్చిమాభిముఖంగా ఉన్న శ్రీ ఉమా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించినవారికి అద్భుతమైన యోగ ఫలితాలు లభిస్తాయని ప్రతీతి. ఈ ఆలయానికి ఉత్తరదిశగా తుల్యభాగ నది ప్రవహిస్తున్నందున... దీన్ని సందర్శిస్తే కాశీలోని విశ్వేశ్వరుని దర్శించిన ఫలాన్ని పొందుతారనేది భక్తుల నమ్మకం.
వాతాపి జీర్ణం...
స్థల పురాణం ప్రకారం... త్రేతాయుగంలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు కామరూపులు. వాతాపిని ఇల్వలుడు గొర్రెగా మార్చి, ఆహారం వండి, తమ ఇంట పితృకార్యం పేరుతో బాటసారులకు భోజనాలు పెట్టేవాడు. వారు తిన్న తరువాత... ‘‘వాతాపీ బయటకు రా’’ అని ఇల్వలుడు పిలవగానే... భోజనాలు చేసినవారి ఉదరాలను చీల్చుకుంటూ వాతాపి వచ్చేవాడు. అలా మరణించినవారిని ఇల్వలుడు, వాతాపి రాక్షస రూపాల్లోకి మారి ఆరగించేవారు. ఈ విషయం తెలిసిన అగస్త్యుడు వారి వద్దకు వెళ్ళి, భోజనం చేసిన తరువాత ‘‘జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం’’ అన్నాడు. అగస్త్యుడి ఉదరంలో కామరూపంలో ఉన్న వాతాపి పూర్తిగా జీర్ణమైపోయాడు. అందుకనే ఇప్పటికీ ఇళ్ళల్లో పిల్లలకు ఉగ్గు పట్టిన తరువాత పెద్దలు ‘‘జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం’’ అంటారు. ఆ తరువాత ఇల్వలుణ్ణి కూడా తన తపశ్శక్తితో అగస్త్యుడు సంహరించాడు. వారిలో బ్రాహ్మణత్వం ఉండడం వల్ల అగస్త్యుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆయన శివుణ్ణి ప్రార్థించి, స్వామి అనుగ్రహంతో ఇక్కడ శ్రీ ఉమా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామిని ప్రతిష్ఠించడంతో... ఆయనకు చుట్టుకున్న బ్రహ్మహత్యాపాతకం నశించింది. ఈ ఊరి పేరు పూర్వం ‘వాతాపిపురం’ కాగా... కాలక్రమేణా తాపేశ్వరంగా మారింది.
అత్యంత పురాతనం
ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీఅగస్త్యేశ్వర స్వామితో పాటు సంతోషిమాత, శ్రీరాముడు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అగస్త్యేశ్వర స్వామి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం అత్యంత పురాతనమైనదని, ఈ ఆవరణలో ఉన్న రెండు నాగమల్లి చెట్లకు సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉందని డెబ్భయ్యేళ్ళ నుంచి ఆలయ అర్చకుడిగా ఉన్న శంకరమంచి సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు. ఆలయ ప్రాంగణంలోని ప్రాచీనమైన గిలకబావిలోని నీటినే స్వామి అభిషేకాల కోసం నేటికీ వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. కాగా కొన్నేళ్ళ క్రితం ఈ ఆలయాన్ని స్థానిక సురుచి ఫుడ్స్ యజమాని పోలిశెట్టి మల్లిబాబు సుమారు కోటి రూపాయల ఖర్చుతో పునర్నిర్మించారు. ఇది తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన చెబుతున్నారు. కాకినాడ నుంచి రామచంద్రపురం మీదుగా, రాజమండ్రి నుంచి జొన్నాడ, ఆలమూరు, మండపేట మీదుగా తాపేశ్వరం చేరుకోవచ్చు.
సి.ఎన్.మూర్తి
8328143489
ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీఅగస్త్యేశ్వర స్వామితో పాటు సంతోషిమాత, శ్రీరాముడు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అగస్త్యేశ్వర స్వామి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే కాశీలోని విశ్వేశ్వరుని దర్శించిన ఫలాన్ని పొందుతారనేది భక్తుల నమ్మకం.
Updated Date - Jul 18 , 2025 | 03:44 AM