National Herald case: రాహుల్ సోనియాకు 142 కోట్ల లబ్ధి
ABN, Publish Date - May 22 , 2025 | 05:18 AM
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోనియా, రాహుల్ గాంధీలపై రూ.142 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలు చేసింది. యంగ్ ఇండియా కంపెనీని ఉపయోగించి కాంగ్రెస్ విరాళాలను ప్రైవేట్ ఆస్తులుగా మార్చినట్లు పేర్కొంది. కోర్టు విచారణ జూలై నెలకు వాయిదా వేసింది.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్‌లో వారికి అనుచిత ప్రయోజనం
ప్రజల విరాళాలను ప్రైవేటు ఆస్తిగా మార్చేందుకే ‘యంగ్ ఇండియా’
అది మోసపూరిత సంస్థ .. ఢిల్లీ కోర్టులో ఈడీ
న్యూఢిల్లీ, మే 21: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రూ.142 కోట్ల అనుచిత ప్రయోజనం పొందారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. కాంగ్రె్‌సకు పార్టీకి ప్రజలిచ్చిన విరాళాలను ప్రైవేటు ఆస్తులుగా మలచుకునేందుకే ‘యంగ్ ఇండియా’ కంపెనీని ఏర్పాటు చేశారని.. నిజానికి అదో మోసపూరిత కంపెనీ అని పేర్కొంది. బుధవారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నే ఎదుట ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్), దానికున్న రూ.2 వేల కోట్ల ఆస్తులపై నియంత్రణ కోసం 2010లో యంగ్ ఇండియన్ కంపెనీని ఏర్పాటు చేశారని తెలిపారు. 2023 నవంబరులో దాని ఆస్తులు జప్తు చేశామని.. అప్పటివరకు.. అంటే 13 ఏళ్లపాటు ఆయా ఆస్తులను అనుభవించారని.. అద్దెల కింద రూ.142 కోట్ల ఆదాయం అక్రమంగా పొందారని పేర్కొన్నారు. కేసు డాక్యుమెంట్లు 5 వేల పేజీలు ఉన్నాయని.. తమ స్పందన తెలియజేసేందుకు సమయమివ్వాలని రాహుల్, సోనియా తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోరారు.
దీంతో కోర్టు విచారణను జూలైకి వాయిదావేసింది. జూలై 2 నుంచి 8 వరకు రోజువారీ విచారణ జరుపుతామని వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్/ఏజేఎల్ ఆస్తులకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యంస్వామి ప్రైవేటు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ కోర్టు 2014లో దానిని పరిగణనలోకి తీసుకుంది. దాని ఆధారంగా 2021లో ఈడీ కేసు నమోదుచేసింది. సోనియా, రాహుల్, శామ్ పిట్రోడా, సుమన్ దూబే, యంగ్ ఇండియన్, ఇంకో రెండు అనుబంధ సంస్థలను నిందితులుగా చేర్చింది. గత నెల 9న చార్జిషీటు కూడా దాఖలుచేసింది. ఏజేఎల్ స్వాధీనంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తన పదవిని సోనియాదుర్వినియోగం చేశారని ఈడీ వర్గాలు తెలిపాయి. ‘యంగ్ ఇండియన్, ఏజేఎల్ పరిపాలన, ఆర్థిక వ్యవహారాల అధికారాన్ని మోతీలాల్ వోరాకు అప్పగించామని.. అన్నీ ఆయనే చూసుకున్నారని సోనియా, రాహుల్ విచారణలో చెప్పారు. సోనియా అధికార దుర్వినియోగానికి పాల్పడగా.. రాహుల్ ఏజేఎల్ వాటాదారులను, ఏఐసీసీ దాతలను మోసగించారు. రూ.988 కోట్ల అక్రమంలోఆయన క్రియాశీల పాత్ర పోషించారు’ అని వెల్లడించాయి.
Also Read:
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
Updated Date - May 22 , 2025 | 05:18 AM