Jagdeep Dhankhar: న్యాయ వ్యవస్థలో తిమింగలాలు
ABN, Publish Date - May 21 , 2025 | 02:51 AM
హైకోర్టు న్యాయమూర్తి అధికార నివాసంలో దొరికిన నోట్ల కట్టల కేసులో ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ విమర్శించారు. న్యాయవ్యవస్థలో పారదర్శకత కోసం 1991లోని సుప్రీంకోర్టు తీర్పును పునర్విమర్శించాల్సిన అవసరముందని సూచించారు.
జస్టిస్ వర్మపై ఎఫ్‌ఐఆర్‌కు ఎన్నాళ్లు?
నేర న్యాయవ్యవస్థ సామాన్యులకేనా?
అంతర్గత విచారణలో పారదర్శకత ఏదీ?
నివేదికను బయట పెట్టాలి
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్
న్యూఢిల్లీ, మే 20: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మరోసారి న్యాయవ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. అధికార నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దాచారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ మీద ఎందుకు ఇంతవరకు పోలీస్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. ముగ్గురు న్యాయమూర్తులతో జరిపించిన విచారణకు ఎలాంటి చట్టబద్ధతా లేదని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ కేసులో ఎలాంటి చర్యలూ లేకుండా మూసేస్తారని భావిస్తున్నారని చెప్పారు. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీలో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘మన ముందు ఒక చేదు నిజం నిలబడింది. ఢిల్లీలోని ఒక న్యాయమూర్తి అధికార నివాసంలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికాయి. మార్చిలో జరిగితే ఇంతవరకు ఎఫ్‌ఐఆర్ లేదు. దీన్ని కూడా కాలక్రమంలో మరచిపోవాల్సి వస్తుందని జనం అనుకుంటున్నారు.
ఇతర పౌరుల విషయంలో జరిగినట్లుగా నేర న్యాయ వ్యవస్థ న్యాయమూర్తుల విషయంలో ఎందుకు పని చేయడం లేదు? ఆ డబ్బులు ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చాయి? లాంటి వివరాల కోసం జనం ఎదురు చూస్తున్నారు’’ అన్నారు. న్యాయ వ్యవస్థ కలుషితం అయ్యిందని, వర్మ కన్నా పెద్ద తిమింగలాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
సుప్రీకోర్టు ఇప్పటివరకు సరిగానే వ్యవహరించిందని, ముగ్గురు న్యాయమూర్తుల కమిటీని వేయడం ద్వారా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడారని చెప్పారు. జస్టిస్ గవాయ్ జస్టిస్ ఖన్నా బాటలో నడవవాలని, నివేదికను బహిర్గతం చేయాలని సూచించారు. న్యాయమూర్తుల మీద ఆరోపణలు వచ్చినపుడు అంతర్గత విచారణ జరిపే సంప్రదాయానికి జస్టిస్ వెంకటస్వామి కేసులో 1991 నాటి సుప్రీంకోర్టు తీర్పు అవకాశం ఇచ్చిందని ధన్‌ఖడ్ చెప్పారు. ఆ తీర్పును పునస్సమీక్షించాలని డిమాండ్ చేశారు. నాటి తీర్పుతో న్యాయవ్యవస్థలో జవాబుదారీతనానికి, పారదర్శకతకు పాతర వేసినట్లు అయ్యిందని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమైన ధన్‌ఖడ్ రైతులకు ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలు నగదు రూపంలో బ్యాంకు ఖాతాల్లో వేయాలని అభిప్రాయపడ్డారు. ఇతర ఏ రకాలుగా ఇచ్చినా కొంత లంచాలకు పోతుందని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News
Updated Date - May 21 , 2025 | 06:02 AM