Supreme Court Urdu verdict: గంగా జెమునీ తెహ్‌జీబ్‌కు అత్యున్నత ప్రతీక ఉర్దూ
ABN, Publish Date - Apr 17 , 2025 | 04:14 AM
ఉర్దూ భాష ముస్లింలది కాదని, భారతీయ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా సుప్రీంకోర్టు పేర్కొంది. గంగా-జెమునీ తెహ్‌జీబ్‌కు ఉర్దూ ఒక అతి ముఖ్యమైన భాగమని ధర్మాసనం అభిప్రాయపడింది.
అది విదేశీ భాష కాదు.. మన దేశంలో పుట్టిన భాష
హిందీ మూలం హిందవీ.. అది పార్శీ పదం: సుప్రీంకోర్టు
బోర్డుల మీద ఉర్దూ ఉండొద్దన్న పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: మన దేశంలోని ‘గంగా జెమునీ తెహ్‌జీబ్’కు (హిందూ, ఇస్లామిక్ సాంస్కృతిక సమ్మేళనానికి) ఉర్దూ భాష ఒక అత్యున్నత ప్రతీక అని, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం చూసి మనం గర్వపడాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. ఉర్దూ పుట్టిందే భారతదేశంలోనని గుర్తు చేసింది. ఉర్దూను ముస్లింల భాషగా భావించటం అంటే మన దేశ వైవిధ్య వాస్తవికతను పూర్తిగా పక్కనపెట్టి చూసే ధోరణి అని, ఇది చింతించాల్సిన విషయమని పేర్కొంది. మహారాష్ట్రలోని అకోలా జిల్లా పాతూర్‌లో మునిసిపల్ కౌన్సిల్ కొత్త భవనం బోర్డు మీద అక్షరాలను మరాఠీతోపాటు ఉర్దూలో రాయటాన్ని వర్షాతాయీ అనే మాజీ కౌన్సిలర్ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సుదాంశు ధులియా, జస్టిస్ వినోద్ చంద్రన్ బుధవారం విచారణ జరిపారు. ఈ పిటిషన్‌ను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉర్దూ మన దేశానికి సంబంధించినది కాదనే దురభిప్రాయం కారణంగానే ఆ భాషపై రకరకాల అపోహలు నెలకొన్నాయని ధర్మాసనం తెలిపింది. ‘హిందీ, మరాఠీల్లాగే ఉర్దూ కూడా ఇండో-ఆర్యన్ భాష. అనేకమంది మహాకవులకు ఇష్టమైన భాషగా నిలిచింది. ఈ రోజుల్లో అనేక ఉర్దూ పదాలు హిందీలో కలిసిపోయాయి. అసలు, హిందీ అనే పదమే హిందవీ అనే పార్శీ పదం నుంచి పుట్టింది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్
BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ
Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు
Updated Date - Apr 17 , 2025 | 04:14 AM