CM MK Stalin : పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల్ని కనండి
ABN, Publish Date - Mar 04 , 2025 | 04:03 AM
పునర్విభజనలో తమ రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గిపోతాయంటూ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్..
గతంలో కు.ని.పై గట్టిగా దృష్టి పెట్టాం
జనాభా తగ్గితే లోక్‌సభ సీట్లు కోల్పోతాం
పునర్విభజనలో మన రాష్ట్రానికి నష్టం
ఆలోపు ఎక్కువ మంది పిల్లల్ని కనండి
వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి
నూతన వధూవరులకు తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపు
చెన్నై, మార్చి 3(ఆంధ్రజ్యోతి): పునర్విభజనలో తమ రాష్ట్రంలో లోక్‌సభ నియోజకవర్గాలు తగ్గిపోతాయంటూ గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. జనాభాను పెంచడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై కొత్తగా పెళ్లి చేసుకునే వధూవరులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పిల్లల్ని కనాలని ఆయన కోరారు. పునర్విభజన ప్రక్రియ మొదలయ్యేలోగా ఎక్కువ మంది పిల్లల్ని కంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. సోమవారం నాగపట్టణం జిల్లా పర్యటన సందర్భంగా ఓ వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం వేదికపై మాట్లాడుతూ.. గతంలో పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనవద్దని, కాస్త వేచి చూడాలంటూ విజ్ఞప్తి చేసేవారమన్నారు. కానీ, ఇపుడు అలా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే రాష్ట్ర జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు, పార్లమెంట్ స్థానాల సంఖ్యను నిర్థారిస్తామని కేంద్రం చెబుతోందని, అలా జరిగితే అధిక జనాభా కలిగిన రాష్ట్రాలకు లోక్‌సభ సీట్లు అధికంగా వస్తాయన్నారు. కానీ, మనమంతా కుటుంబ నియంత్రణపై గట్టిగా దృష్టి పెట్టి విజయం సాధించామన్నారు. ఇపుడు లోక్‌సభ సీట్ల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇకపై కొత్తగా పెళ్లి చేసుకున్నవారు వెంటనే పిల్లల్ని కనాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే తమ సంతానానికి కూడా అందమైన తమిళ పేరును పెట్టాలని సూచించారు. ఇదే తన హృదయపూర్వక వినతిగా పేర్కొన్నారు. దివంగత కలైంజర్ కృషి ఫలితంగా తమిళ భాషకు ప్రాచీన హోదా వచ్చిందని, అలాంటి ప్రాచీన భాషలో పిల్లలకు పేర్లు పెట్టాలని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు.
Updated Date - Mar 04 , 2025 | 04:04 AM